అభిప్రాయం
చైనాలో విధానపరమైన అన్ని నిర్ణయాలు తీసుకునే కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో నుంచి ఈ నెల 14న మరొక సభ్యుడిని తొలగించారు. అసలు పార్టీ నుంచే బహిష్కరించారు. మొత్తం 24 మంది సభ్యులుండే ఆ విభాగం నుంచి ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటికి ముగ్గురు బహిష్కృతులయారు. ఇదే కాలంలో అత్యున్నత సైనిక జనరల్స్ నలుగురు పదవీ చ్యుతులు కావటమేగాక, కొందరు ఉన్నతాధికారులు ఉరిశిక్షలకు గురికావటమో, జీవిత కాలపు జైలుకు వెళ్లటమో జరిగింది.
ప్రచారంలో నిజం ఎంత?
ఇందుకు కారణాలు ఏమిటన్నది అర్థం చేసుకోవలసిన విషయం. ఇటువంటి వార్తలు బయటకు వచ్చినప్పుడల్లా ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఒక విధమైన దిగ్భ్రమకు కూడా లోనవుతుంది. పలువిధాలైన ఊహాగానాలు, చర్చలు సాగుతాయి. కానీ, చైనా 1949 కమ్యూనిస్టు విప్లవానికి ముందుకాలపు చరిత్రలోనూ తనకుతానే సీమితమై, తన చుట్టూ తాను తిరిగే మిస్టిక్ దేశమే. కమ్యూనిజంలో ఉండే పారదర్శకతా రాహిత్యానికి, ఈ చారిత్రక మిస్టిసిజం తోడై, అక్కడి పరిణామాలలోని వాస్తవాలు ఏమిటో బయటి ప్రపంచానికి సరిగా తెలియని పరిస్థితి ఏర్పడింది.
చైనా ప్రభుత్వం స్వయంగా చెప్పేది ఎక్కువగా అవినీతి, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగం. కొద్ది సందర్భాలలో మాత్రం రక్షణ రహస్యాలను, శాస్త్ర–సాంకేతికరంగ రహస్యాలను శత్రు దేశాలకు చేరవేయటం. చైనా నాయకత్వం మధ్య అధికార గ్రూపు రాజకీయాలని కూడా పాశ్చాత్య ఇంటెలిజెన్స్ సంస్థలు, మీడియా ప్రచారం చేస్తుంటాయి. ఈ ప్రచారాన్ని నిజానికి తేలికగా కొట్టివేయవచ్చు. మావో, డెంగ్ జియావ్ పింగ్ తర్వాత ఈ రోజున షీ జిన్‌పింగ్ పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో, ప్రజలలో కూడా ఎదురులేని నాయకుడు. పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో అత్యున్నతాధికార స్థానాలన్నీ ఆయనవే. అది వాంఛనీయమా అన్న చర్చ వేరే. కానీ, ఈ ప్రక్షాళనలకు కారణం మాత్రం అధికార ఘర్షణల నటం కేవలం పాశ్చాత్య ప్రచారాలే.
మెరుగ్గా లేని ర్యాంకు
ఇపుడు విషయానికి వస్తే, ఈ విధమైన ప్రక్షాళనలను పురస్కరించుకుని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినవి రెండున్నాయి. మొదటిది అవినీతి కోణం. కమ్యూనిస్టు వ్యవస్థలలో నైతికతలు, క్రమశిక్షణలు ఎక్కువనీ, ముఖ్యంగా ఉన్నత స్థానాలకు చేరుకునే వారికి త్యాగశీలత, దేశభక్తి కూడా ఉన్నతంగా ఉంటాయనీ భావిస్తాము. కానీ చైనాలో అవినీతి విస్తృతంగా ఉన్న మాట నిజం. నిరుడు నేను చైనా వెళ్లినప్పుడు, సామాన్య ప్రజలలో ఈ మాట అననివారు కన్పించలేదు. కింది స్థాయిలో గ్రామీణాధికారుల నుంచి ఉన్నత స్థాయి వారిదాకా అందరూ దోషులేనన్నది వినవచ్చిన మాట. దానితో కొంత వెతకగా కనిపించిన లెక్క, అవినీతి ర్యాంకింగ్స్‌లో 182 దేశాలలో చైనా స్థానం 76.
చైనా వ్యవస్థలో కీలకమైన విభాగాలు కమ్యూనిస్టు పార్టీ, అధికార యంత్రాంగం, సైన్యం, శాస్త్ర–సాంకేతిక రంగాలు. ఈ నాలుగింటికి నాలుగులోనూ ఏదో ఒక స్థాయిలో అవినీతి చేరింది. వీటిలో పార్టీ అవినీతి అన్నింటికన్న ప్రమాదకరమైనదని దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ అభిప్రాయం. ఎందుకంటే – పార్టీ, దాని సిద్ధాంతం తమ వ్యవస్థకు వెన్నెముక. అది బాగుంటే తక్కిన లోపాలను సరి దిద్దుకోవచ్చు. అదే లేనట్లయితే మొత్తం వ్యవస్థ కుప్పగూలుతుంది. పార్టీని ఎంత లోపరహితంగా ఉంచగలిగితే జన సామాన్యానికి పార్టీపై, నాయకత్వంపై, వ్యవస్థపై అంత విశ్వాసం కుదురుతుంది. అంతిమంగా దేశ సుస్థిరతకు, పురోభివృద్ధికి ఇది అవసరం.
ఈ అవగాహనతోనే జిన్‌పింగ్ 2013లో అధికారానికి వచ్చి నప్పటినుంచే అవినీతిని అరికట్టడంపై దృష్టి పెట్టారన్నది చైనాకు బయటి చైనా నిపుణులు చెప్తున్న మాట. ఇందుకు ధ్రువీకరణలను నేను చైనా వెళ్లినప్పుడు విన్నాను కూడా. ఆయన ఆ స్థాయి పార్టీ బాధ్యులపై, సీనియర్ జనరల్స్‌పై సాహసించి తీవ్ర చర్యలు తీసుకుంటున్నారంటే, తన లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండటం ఒకటైతే, ఆయన చర్యలకు తక్కిన పార్టీ నుంచి, సైన్యం నుంచి, అంతిమంగా ప్రజల నుంచి మద్దతు ఉండటమే కారణం.
పెరిగిన సంపదతో అవినీతి కూడా!
అంతవరకు బాగున్నదిగానీ, అసలు చైనా వంటి వ్యవస్థలో ఇంతటి అవినీతి ఏమిటన్నది కూడా ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితే. ఆ కారణాన్ని విని తిరిగి ఆశ్చర్యం కలగవచ్చు. మనమంతా డెంగ్ జియావో పింగ్ సంస్కరణలు సృష్టించిన సంపదల గురించి తప్ప, ఆ దీపం కింద గల నీడలను చూడటం లేదు. అవినీతి, అసమానతల పెరుగుదల ఆ నీడలలో భాగమే. ఆయన చైనా సంపదలను పెంచుతూ, ప్రైవేట్ రంగానికి, విదేశీ పెట్టుబడులకు మార్గాన్ని సరళతరం చేస్తూ, మనుషులు ధనికులు కావటం సిగ్గుపడవలసిన విషయమేమీ కాదని ప్రకటించాడు. ఆ ఒక్క వాక్యం చాలామందికి స్ఫూర్తినిచ్చింది. సక్రమంగానైనా, అక్రమంగానైనా ధన సంపాదనకు ప్రోత్సహించింది.
ఒక స్థాయిలో ఆలోచించినపుడు, మావో అనంతర కాలంలో ఆర్థికాభివృద్ధి కోసం వ్యవస్థలో ఒత్తిడులు ఏర్పడిన మాట నిజం. అదే సమయంలో అభివృద్ధి కోసం అనుసరించిన మార్గాలు అనివార్యంగా అవినీతికి కూడా దారితీశాయి. అది మావో కాలంలో లేదు. పింగ్ అధికారానికి వచ్చేనాటికి ఇది అది అని గాక అన్ని రంగాలు అవినీతిమయమయ్యాయి. అక్కడి ప్రజలు చేసే వ్యాఖ్యలకుగానీ, అవినీతిలో అటువంటి ర్యాంకింగ్‌కుగానీ, ప్రస్తుత అధ్యక్షుని ప్రక్షాళన చర్యలకుగానీ ఆ పరిస్థితి కారణమవుతున్నది.
మరొక ముఖ్య విషయం కూడా దీని వెనకున్నది. అది, 1991లో సోవియెట్ యూనియన్ పతనం వెనుక గల కారణాల నుంచి చైనా నాయకత్వం నేర్చుకున్న పాఠాలు. ఆ కారణాలలో ఒకటి, సోవియట్ కమ్యూనిస్టు పార్టీ సహా అన్ని రంగాలలో పెచ్చు పెరిగిన అవినీతి. రెండవది– పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో స్వేచ్ఛగా చొరబడగలిగిన పాశ్చాత్య గూఢచార సంస్థలు. ఇక్కడ ఒక విశేషం ఉంది. సోవియట్ యూనియన్ పతనానికి ఆర్థిక వెనుక బాటుతనం కూడా ఒక ముఖ్య కారణం. అయితే, పింగ్ బలమైన సైన్యం అవసరమనే పాఠాన్ని అయితే బాగానే తీసుకున్నా,సంపదల వెంట అవినీతి పెరుగుదల అనే పాఠాన్ని మాత్రం తీసుకోలేదు. 1997లో ఆయన మరణించే నాటికే ఏర్పడిన ఈ సమస్యను ఆయన గుర్తించలేదనలేము. ఎందువల్లనైతేనేమి చర్యలేమీ కనిపించ లేదు. తర్వాత 15 ఏళ్లకు 2012లో జిన్‌పింగ్ పార్టీ బాధ్యతలు తీసుకునే వేళకు, ప్రజలకు అసలు కమ్యూనిస్టు పార్టీ పట్లనే విశ్వాసం లేకుండా పోయే ప్రమాదం ముంచుకొస్తున్నట్లు భావించటంతో, ఆయన అప్పటినుంచే ఈ జాఢ్యం నిర్మూలనకు పూనుకొన్నారు. పూర్తి నిర్మూలన సాధ్యమవుతుందనుకోలేము గానీ, కనీసం తగినంత అదుపు అవుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టగలదేమో చూడాలి.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


