మేధో వలసలను ఇస్రో ఆపేదెలా? | Sakshi Guest Column On How ISRO can stop Scientists migrate | Sakshi
Sakshi News home page

మేధో వలసలను ఇస్రో ఆపేదెలా?

Jul 22 2026 12:31 AM | Updated on Jul 22 2026 12:31 AM

Sakshi Guest Column On How ISRO can stop Scientists migrate

సందర్భం

అంతరిక్ష రంగం ఈమధ్య సముచిత, అనుచిత కారణాలు రెండింటితోనూ వార్తలకెక్కుతోంది. స్కైరూట్‌ అనే భారతీయ ప్రైవేటు స్పేస్‌ కంపెనీ తానే అన్నీ అయి చూసుకున్న ఒక అంతరిక్ష ప్రయోగాన్ని తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా నిర్వహించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ఇద్దరు మాజీ ఇంజినీర్లు ఆ కంపెనీని నెల కొల్పారు. ఈ కంపెనీ విక్రమ్‌–1 రాకెట్‌ను ప్రయోగించి తన సత్తా చాటుకుంది. ఇదే తరహా రాకెట్‌ను మరింత ఉన్నతపరచి విక్రమ్‌–2 పేరుతో వచ్చే ఏడాది ప్రయోగించాలని భావిస్తోంది. తక్కువ ఎత్తులోనున్న భూకక్ష్య (ఎల్‌.ఇ.ఓ.)లో ఉపగ్రహాలను నిలిపే కోట్లాది డాలర్ల మార్కెట్లోకి ప్రవేశించాలని స్కైరూట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 

ప్రైవేటు ఆకర్షణీయం
మరోపక్క ఇస్రో నుంచి టాప్‌ సైంటిస్టులు, ఇంజినీర్లు పెద్ద యెత్తున వైదొలగుతున్నారనే వార్త గుబులు పుట్టిస్తోంది. యు.ఆర్‌. రావు స్పేస్‌ సెంటర్, విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్, జాతీయ అంతరిక్ష సంస్థకు చెందిన ఇతర కీలక విభాగాల్లో పనిచేస్తున్న డజన్లకొద్దీ సీనియర్‌ సైంటిస్టులు రాజీనామా చేయడమో లేదా ముందుగానే రిటైర్మెంట్‌ తీసుకోవడమో చేశారని వార్తలు సూచిస్తున్నాయి. వారిలో చాలామంది భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గగన్‌యాన్‌ (మానవుడిని స్పయంగా అంతరిక్షంలోకి పంపడం), తదుపరి తరం వాహక నౌక (ఎన్జీఎల్వీ), భారతీయ అంతరిక్ష స్టేషన్‌ (బ్యాస్‌) వంటి ప్రముఖ కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. ఈ వలస ఎంత ఆందోళనకరంగా పరిణమించిందంటే, అలాంటి ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు వాటిలో పనిచేస్తున్నవారు సంస్థను విడిచి వెళ్ళడానికి వీలులేకుండా అంతరిక్ష శాఖ ఆంక్షలు విధించాలని నిర్ణయించుకుంది. 

ఈ రెండు పరిణామాలు– మొదటి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం, ఇస్రోకు ఉద్యోగులు వీడ్కోలు పలకడం– పైకి ఒకదానితో ఒకటి సంబంధం లేనివిగా కనిపించవచ్చు. కానీ, అవి పరస్పరం ముడిపడి ఉన్నవని గ్రహించాలి. ఇస్రో యూనిట్ల నుంచి ఉద్యోగులు రాజీనామాలు చేయడానికి ప్రధాన కారణం, గత కొద్ది ఏళ్ళలో ప్రైవేట్‌ రంగ స్పేస్‌ కంపెనీలు కనబరుస్తున్న ఎదుగుదలేనని స్పష్టమవుతోంది. అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్‌ సంస్థల ప్రవేశానికి పచ్చజెండా ఊపడమే కాకుండా, ఉపగ్రహ వాహక నౌకల ప్రయోగానికి ఇస్రో సదుపాయాలను వినియోగించుకునేందుకు కూడా ప్రభుత్వం అను మతించింది. ఇస్రోలో పనిచేస్తున్న ప్రతిభావంతులైనవారిని తమ వైపు లాక్కునేందుకు ప్రైవేట్‌ కంపెనీలకు ఇది అనువైన వాతావర ణాన్ని కల్పించింది.  

ప్రభుత్వ సంస్థల నుంచి ప్రైవేటుకు ఇలా ప్రతిభావంతులు తరలిపోవడం ఇస్రోకు ఇది కొత్తా కాదు, అంతరిక్ష రంగానికి మాత్రమే పరిమితమైన ధోరణి అంతకన్నా కాదు. అమెరికాలో కూడా ప్రైవేట్‌ అంతరిక్ష రంగం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తీర్చిదిద్ది, అభివృద్ధి చేసిన మానవ వనరులే అక్కడి ప్రైవేట్‌ రంగానికి ప్రధాన ఆలంబన. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరిశ్రమ కూడా మొగ్గ తొడుగుతున్న దశలో ఆ రంగానికి చెందిన ప్రైవేట్‌ సంస్థలు తమ పరిశోధన–అభివృద్ధి విభాగాలలోకి ఈసీఐఎల్, సీఎంసీ వంటి ప్రభుత్వ రంగ కంపెనీల నుంచే సిబ్బందిని తీసుకున్నాయి. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ వంటి ప్రభుత్వ రంగ కంపెనీల విషయంలోనూ అదే జరిగింది. డీఆర్‌డీఓ ల్యాబొరేటరీలలో కూడా ఇస్రో తరహా పరిస్థితే నెలకొంది. రక్షణ, ఏరోస్పేస్‌ పరికరాల ఉత్పత్తిలో ప్రైవేట్‌ రంగాన్ని అనుమతించిన ఫలితమే ఇది. 

అందని నిధులు– అందితే కోతలు
ఇస్రో, డీఆర్‌డీఓ వంటి మన వైజ్ఞానిక సంస్థలు తాము ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణాలను నిశితంగా అన్వేషించుకోవాలి. ఇస్రోకు చెందిన వివిధ యూనిట్లలో 2,800లకు పైగా ఖాళీలున్నాయనీ, మంజూరైనవి సుమారు 1800 పోస్టులు మాత్రమేననీ అంతరిక్ష శాఖ పనితీరును అధ్యయనం చేసిన పార్లమెంటరీ కమిటీకి 2026 మార్చిలో వెల్లడించారు. ఎన్జీఎల్వీ తయారు చేసే ముఖ్య పనిలో ఉన్న విక్రమ్‌ సారాభాయ్‌ కేంద్రంలో దాదాపు 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు ప్రైవేట్‌ కంపెనీలు అనుభవజ్ఞులైన సైంటిస్టులను ఎరవేసి పట్టుకుంటున్నాయి. మరోవైపు, ఇస్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదు. 

ఉదాహరణకు, ఎన్జీఎల్వీని నిర్మించి, ప్రయోగించే ప్రాజెక్టునకు 96 నెలల సమయమిస్తూ క్యాబినెట్‌ 2024లో ఆమోదం తెలిపింది. ఆమోదించిన తేదీ నుంచి 84 నెలల లోపల మొదటి పరీక్షకు వాహక నౌకను సిద్ధం చేయాలని కూడా ఆదేశించింది. కానీ, 2024–25 బడ్జెట్‌లో దీనికి కేటాయింపులు ఏమీ లేకపోవడం వల్ల ఆమోదం పొందిన అనేక నెలల తర్వాత కూడా ఈ ప్రాజెక్టు కాగితాలకు మాత్రమే పరిమితమైంది. సవరించిన అంచనాలలో నామ మాత్రంగా రూ. 3 కోట్లు కేటాయిస్తే, దానిలో ఇస్రో రూ. 85 లక్షలను మాత్రమే వెచ్చించగలిగింది. 2025–26 బడ్జెట్‌లో రూ. 158 కోట్లు కేటాయించారుగానీ, సవరించిన అంచనాల దగ్గరకొచ్చేసరికి దాన్ని రూ. 39.76 కోట్లకు తగ్గించారు. ఇందులో ఇస్రో 2026 జన వరి 31 వరకు రూ. 7.93 కోట్లను మాత్రమే వెచ్చించగలిగింది.

వ్యయంలో నత్తనడక, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోవడం, తదుపరి బడ్జెట్‌లలో కేటాయింపులను తగ్గిస్తూపోవడం, ఖాళీలను భర్తీ చేయడంలో జాప్యం, ప్రైవేట్‌ రంగ ప్రవేశం వంటివన్నీ ఇస్రోలో నేటి స్థితికి కారణమయ్యాయి. వీటన్నింటికి తోడు ఇస్రోకు నమ్మిన బంటుగా పనిచేస్తూ వచ్చిన పీఎస్‌ఎల్వీ వరుసగా వైఫల్యాలను చవిచూసింది. నిర్ణాయక వ్యవస్థ కేంద్రీకృతం కావడం, అధికారుల, రాజకీయ జోక్యం పెరగడం వంటివి భారీ ప్రాజెక్టులను తలకెత్తుకున్న సైంటిఫిక్‌ ఏజెన్సీ పని తీరుకు మేలు చేయవు. 

మారాల్సిన విధానాలు
సైంటిస్టులను రాజీనామా చేయవద్దని కోరడం, వారు వైదొలగకుండా అడ్డు పెట్టడం సరైన స్పందన అనిపించుకోదు. ప్రైవేట్‌ రంగ ప్రవేశానికి ప్రోద్బలం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, దానికి వీలు కల్పించిన ఇస్రో తమ వైఖరి పర్యవసానాన్ని, అది జాతీయ కార్యక్రమాలపై చూపగల ప్రభావాన్ని ముందే ఊహించి ఉండాల్సింది. దాంతోపాటు, మిషన్‌ వైఫల్యాలు, జాప్యాల ఫలితంగా నీరసపడ్డ సైంటిస్టులలో స్థైర్యాన్ని పెంపొందించే చర్యలను ఇస్రో నాయకత్వం చేపట్టాలి. ఇస్రో దీర్ఘకాలంలో చేపట్టవలసిన సరికొత్త యంత్రాంగాలపై యోచించాలి. ఉదాహరణకు, సిబ్బంది ఇస్రోలో తమ ఉద్యోగాలను నిలబెట్టుకుంటూనే ఒక పరిమిత కాలానికి ప్రైవేట్‌ రంగంలో పని చేసేందుకు అనుమతించవచ్చు. 

కీలకేతర రంగాల్లో సొంత కంపెనీలను స్థాపించుకునేందుకు అంగీకరించవచ్చు. వీటికి తోడుగా, జీతభత్యాలు, ప్రోత్సాహకాలు, ప్రమోషన్ల విధానాలను సవరించు కోవాలి. ప్రభుత్వం తన వంతుగా వైజ్ఞానిక సంస్థల ప్రతిపత్తిని పున రుద్ధరించాలి. స్పేస్‌ మార్కెట్‌ ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతోంది. దాన్ని వినియోగించుకునేందుకు జాతీయ ఏజెన్సీలతో పాటు ప్రైవేట్‌ కంపెనీలకు కూడా కావలసినంత అవకాశం ఉంది. బ్రెయిన్‌ డ్రెయిన్‌ను బ్రెయిన్‌ సర్క్యులేషన్‌గా మలచుకోవచ్చు. 

దినేశ్‌ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement