ఒకప్పుడు ఇస్రోలో ఉద్యోగం అంటే ప్రతి ఇంజినీర్, శాస్త్రవేత్తకు జీవితకాల కల. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య-ఎల్1, గగన్‌యాన్ వంటి ప్రతిష్ఠాత్మక మిషన్లలో పనిచేసే అవకాశం, దేశసేవ అనే గౌరవం, ఉద్యోగ భద్రత.. ఇవన్నీ ఇస్రోను అత్యంత ఆకర్షణీయ సంస్థగా నిలబెట్టాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. గత కొన్ని నెలల్లోనే వంద మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామాలు చేయడం లేదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం కేంద్రాన్ని సైతం ఆందోళనకు గురి చేసింది. దీంతో కీలక మిషన్లలో పనిచేస్తున్న గ్రూప్-ఏ శాస్త్రవేత్తల రాజీనామాలపై కఠిన నిబంధనలు అమలు చేయాలని అంతరిక్ష శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఇస్రోలో జీతాలు ఎంత?
ఇస్రోలో కొత్తగా ఎంపికయ్యే సైంటిస్ట్/ఇంజినీర్-SC స్థాయి అధికారికి 7వ వేతన సంఘం ప్రకారం బేసిక్ పే రూ.56,100 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కలిపి నెలకు సుమారు రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అనుభవం పెరిగేకొద్దీ సైంటిస్ట్-SD, SE, SF, SG, H స్థాయిలకు పదోన్నతులు లభిస్తాయి. అత్యున్నత స్థాయిలో నెలకు రూ.2 లక్షలకు పైగా స్థూల వేతనం పొందే అవకాశం ఉంది. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి సాధారణంగా 20–30 ఏళ్ల సర్వీస్ అవసరమవుతుంది.
ప్రైవేట్ స్పేస్ కంపెనీల్లో ఎంత?
ఇక్కడే ప్రధాన తేడా కనిపిస్తోంది. స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, బెల్లాట్రిక్స్, ధృవ స్పేస్ వంటి ప్రైవేట్ కంపెనీలు మార్కెట్ ఆధారిత వేతనాలు అందిస్తున్నాయి. ఫ్రెషర్లకు రూ.8–15 లక్షల వార్షిక ప్యాకేజీ లభిస్తోంది. 3–7 ఏళ్ల అనుభవం ఉన్న వారు రూ.15–30 లక్షలు అందుకుంటున్నారు. అదే సీనియర్ రాకెట్, ప్రొపల్షన్, ఏవియానిక్స్ నిపుణులు అయితే రూ.30–60 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ వేతనాన్ని కూడా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. వీటితో పాటు స్టాక్ ఆప్షన్‌లు (ESOPs), పనితీరు బోనస్‌లు, విదేశీ ప్రాజెక్టులు, వేగవంతమైన ప్రమోషన్లు కూడా లభిస్తున్నాయి. కంపెనీ విలువ పెరిగితే స్టాక్‌ల విలువకోట్ల రూపాయలకు చేరే అవకాశం కూడా ఉంటుంది.


