ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) గృహ వినియోగదారులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ‘భారత్‌గ్యాస్ లైట్ జిప్ (Bharat gas Lite ZIP)’ పేరుతో కొత్త ప్రీమియం ఎల్పీజీ సేవను ప్రారంభించింది. సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ ఖన్నా, డైరెక్టర్ (మార్కెటింగ్) శుభాంకర్ సేన్ సమక్షంలో ఈ సేవను ప్రారంభించారు.
ఈ సర్వీస్‌లో ప్రధాన ఆకర్షణ ఎక్స్‌ప్రెస్ డెలివరీతో తక్షణ కొత్త ఎల్పీజీ కనెక్షన్ అందుబాటులో ఉండటమే. ఇది బీపీసీఎల్ ఇటీవల ప్రవేశపెట్టిన భారత్‌గ్యాస్ లైట్ కాంపోజిట్ సిలిండర్ ఆధారంగా రూపొందించబడింది. సాధారణ స్టీల్ సిలిండర్లతో పోలిస్తే ఈ కాంపోజిట్ సిలిండర్ 50 శాతానికి పైగా తేలికగా ఉండటంతో ఎత్తడం, తరలించడం సులభం. తుప్పు పట్టని బాడీ, సిలిండర్‌లో మిగిలిన గ్యాస్ పరిమాణాన్ని బయట నుంచే చూసే వీలు, అధునాతన భద్రతా ప్రమాణాలు, ఆధునిక డిజైన్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.
నేటి వేగవంతమైన జీవనశైలికి అనుగుణంగా వినియోగదారులకు అవాంతరాలు లేని ప్రీమియం ఎల్పీజీ అనుభవం అందించడమే ‘లైట్ జిప్’ లక్ష్యమని బీపీసీఎల్ తెలిపింది. కొత్త కనెక్షన్ కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించి, సేవలను మరింత స్మార్ట్‌గా అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొంది.
ప్రస్తుతం ఈ సర్వీస్‌ను ముంబైలో ప్రారంభించగా, వచ్చే ఆగస్టు 15 నాటికి 24 రాష్ట్రాల్లోని మరో 100 నగరాలకు విస్తరించనున్నట్లు బీపీసీఎల్ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా మరిన్ని కుటుంబాలకు తేలికపాటి కాంపోజిట్ సిలిండర్లు, వేగవంతమైన కనెక్షన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
BPCL has launched Bharatgas Lite ZIP, a premium LPG offering designed to deliver a faster, smarter and more convenient customer experience. The product was launched by Shri Sanjay Khanna, Chairman & Managing Director, BPCL in the presence of Shri Subhankar Sen, Director… pic.twitter.com/maYQM821o5
— Bharat Petroleum (@BPCLimited) July 18, 2026


