breaking news
bharat gas
-
వచ్చేస్తున్నాయ్ 10 కిలోల గ్యాస్ సిలిండర్లు..
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) 10 కిలోల ఎల్పీజీ సిలిండర్ల లభ్యతను మరింత విస్తరించనుంది. ఆగస్టు 15 నాటికి దేశంలోని 24 రాష్ట్రాల్లో మరో 100 నగరాలకు ఈ సేవను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది. చిన్న కుటుంబాలు, ఒంటరిగా నివసించే ఉద్యోగులు, విద్యార్థులు, తరచూ నివాసం మారే వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ముడి చమురు కొనుగోళ్లలో కూడా బీపీసీఎల్ వైవిధ్యాన్ని పెంచుతోంది. జూన్ త్రైమాసికంలో వెనిజులా, అంగోలా నుంచి దిగుమతులను పెంచగా, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొత్తం ముడి చమురు కొనుగోళ్లలో రష్యా వాటా 38 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో స్పాట్ కార్గోల ద్వారా కొనుగోళ్లు గత ఏడాది ఇదే కాలంలోని 44 శాతం నుంచి 69 శాతానికి పెరిగినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ వద్ద 3.8 మిలియన్ టన్నుల ముడి చమురు నిల్వలు ఉండగా, ఇవి సుమారు 35 రోజుల అవసరాలకు సరిపోతాయని వెల్లడించింది. అలాగే మొజాంబిక్ ఎల్ఎన్జీ ప్రాజెక్టు కార్యకలాపాలు 2029 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతాయని అంచనా వేసింది.ఇదిలా ఉండగా, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీపీసీఎల్ రూ.3,962 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంలో రూ.3,919 కోట్ల లాభం వచ్చినప్పటికీ, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండటం, ఎల్పీజీ విక్రయాల్లో అండర్రికవరీలు పెరగడం వల్ల మార్జిన్లపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఈ నష్టం మార్కెట్ అంచనా అయిన రూ.12,632 కోట్ల కంటే చాలా తక్కువగా నమోదవడం విశేషం. -
నిమిషాల్లో కొత్త గ్యాస్ కనెక్షన్.. ఎక్స్‌ప్రెస్ డెలివరీ
ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) గృహ వినియోగదారులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ‘భారత్‌గ్యాస్ లైట్ జిప్ (Bharat gas Lite ZIP)’ పేరుతో కొత్త ప్రీమియం ఎల్పీజీ సేవను ప్రారంభించింది. సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ ఖన్నా, డైరెక్టర్ (మార్కెటింగ్) శుభాంకర్ సేన్ సమక్షంలో ఈ సేవను ప్రారంభించారు.ఈ సర్వీస్‌లో ప్రధాన ఆకర్షణ ఎక్స్‌ప్రెస్ డెలివరీతో తక్షణ కొత్త ఎల్పీజీ కనెక్షన్ అందుబాటులో ఉండటమే. ఇది బీపీసీఎల్ ఇటీవల ప్రవేశపెట్టిన భారత్‌గ్యాస్ లైట్ కాంపోజిట్ సిలిండర్ ఆధారంగా రూపొందించబడింది. సాధారణ స్టీల్ సిలిండర్లతో పోలిస్తే ఈ కాంపోజిట్ సిలిండర్ 50 శాతానికి పైగా తేలికగా ఉండటంతో ఎత్తడం, తరలించడం సులభం. తుప్పు పట్టని బాడీ, సిలిండర్‌లో మిగిలిన గ్యాస్ పరిమాణాన్ని బయట నుంచే చూసే వీలు, అధునాతన భద్రతా ప్రమాణాలు, ఆధునిక డిజైన్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.నేటి వేగవంతమైన జీవనశైలికి అనుగుణంగా వినియోగదారులకు అవాంతరాలు లేని ప్రీమియం ఎల్పీజీ అనుభవం అందించడమే ‘లైట్ జిప్’ లక్ష్యమని బీపీసీఎల్ తెలిపింది. కొత్త కనెక్షన్ కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించి, సేవలను మరింత స్మార్ట్‌గా అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొంది.ప్రస్తుతం ఈ సర్వీస్‌ను ముంబైలో ప్రారంభించగా, వచ్చే ఆగస్టు 15 నాటికి 24 రాష్ట్రాల్లోని మరో 100 నగరాలకు విస్తరించనున్నట్లు బీపీసీఎల్ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా మరిన్ని కుటుంబాలకు తేలికపాటి కాంపోజిట్ సిలిండర్లు, వేగవంతమైన కనెక్షన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. BPCL has launched Bharatgas Lite ZIP, a premium LPG offering designed to deliver a faster, smarter and more convenient customer experience. The product was launched by Shri Sanjay Khanna, Chairman & Managing Director, BPCL in the presence of Shri Subhankar Sen, Director… pic.twitter.com/maYQM821o5— Bharat Petroleum (@BPCLimited) July 18, 2026 -
సిలిండర్ల లారీ పల్టీ.. పోలీసుల బందోబస్తు!
కర్ణాటక: రాష్ట్రంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది, సిలిండర్లు దొరకడం గగనమైన తరుణంలో గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న లారీ బోల్తాపడిన సంఘటన గదగ్ జిల్లా రోణ పట్టణ శివారులో జరిగింది. హుబ్లీ నుంచి రోణ, గజేంద్రగడ మీదుగా కుష్టగి పట్టణానికి భారత్ గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ రోణ శివార్లలో మలుపులో ఓవర్టేక్ చేయబోయి రోడ్డు పక్కకు బోల్తా కొట్టింది. దీంతో గ్యాస్ సిలిండర్లు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. అదృష్టవశాత్తు అంతకుమించి జరగలేదు. ఎవరూ సిలిండర్లు ఎత్తుకుపోకుండా రోణ పోలీసులు బందోబస్తు కాశారు.గ్యాస్ సిలిండర్ల చోరీబొమ్మనహళ్లి: ఆనేకల్ తాలూకాలోని సూర్య సిటీలో బి–కాంపొనెంట్‌లో సిలిండర్ దొంగతనాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలప్పుడు రెండు ఇళ్ల నుంచి మూడు సిలిండర్లు చోరీకి గురయ్యాయి. ఓ ఇంటివారు ఫుల్లు సిలిండర్‌ను తీసుకుని ఇంటి కిందిభాగంలో ఉంచారు. మరో రెండు ఇళ్లలోనూ సిలిండర్లు ఉన్నాయి. దీనిని కనిపెట్టిన దొంగలు వరుసగా సిలిండర్లను ఎత్తుకెళ్లారు. ఇద్దరు బైక్‌పై వచ్చారు, హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి వాటిని తీసుకెళ్లడం సీసీ కెమెరాలలో రికార్డయింది. గ్యాస్ కొరత వల్ల ఇలాంటి దొంగతనాలు పెరిగాయి. మేం సురక్షితంగా జీవించగలమా అనే ప్రశ్న తలెత్తుతోంది అని స్థానిక నివాసి పూర్ణేష్ రెడ్డి వాపోయారు. -
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్
గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై పేటీఎం భారీ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం యాప్ ద్వారా ఎల్పీజీ సిలిండర్ బుక్ చేస్తే ఏకంగా రూ.800 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు అని పేర్కొంది. ఈ ఆఫర్ కేవలం జూన్ 30 వరకు అందుబాటులో ఉంది. దేశంలో 14 కిలోల గ్యాస్ సిలిండర్ రిటైల్ ధర రూ.808-850 వరకు ఉంది. అయితే పేటిఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ. 10 నుంచి రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తుంది. మీకు కనుక అదృష్టం ఉంటే గ్యాస్ ఉచితంగానే లభించవచ్చు. అయితే, ఈ ఆఫర్ మొదటి సారి పేటీఎం నుంచి గ్యాస్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే లభిస్తుంది. పేటీఎం ద్వారా ఉచితంగా ఎల్పీజీ సిలిండర్ పొందాలంటే మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మొదట మీరు మీ మొబైల్ ఫోన్లో పేటీఎం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత భారత్ గ్యాస్, హెచ్ పీ గ్యాస్, ఇండెన్ గ్యాస్ ఆప్షన్ లలో మీ డీలర్ షిప్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వంట గ్యాస్ ప్రొవైడర్, వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్ నంబర్లను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లావాదేవీల కోసం వివరాలను ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు పేమెంట్ చేసిన తర్వాత 48 గంటలోపు స్క్రాచ్ కార్డు లభిస్తుంది. స్క్రాచ్ కార్డు ఓపెన్ చేసి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో తెలుసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ మొదటి సారి గ్యాస్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే అని మరిచిపోవద్దు. మీకు రూ.10 నుంచి రూ.800 వరకు ఎంతైనా క్యాష్ బ్యాక్ రావొచ్చు. మీరు స్క్రాచ్ కార్డును వారం రోజులోగా ఉపయోగించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ కార్డు ఎక్స్పైరీ అవుతుంది. -
భారత్ గ్యాస్ గోడౌన్లో చోరీ
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్నిలో వింత చోరీ వెలుగుచూసింది. పట్టణ శివారులోని భారత్ గ్యాస్ గోడౌన్లో దొంగలుపడి సిలిండర్లు ఎత్తుకెళ్లారు. నిన్న సాయంత్రమే గోడౌన్‌కు వచ్చిన 250 గ్యాస్ సిలిండర్లలో శుక్రవారం రాత్రి 204 సిలిండర్లు చోరీకి గురయ్యాయి. శనివారం ఉదయం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. డీసీఎం లాంటి వాహనంలో సిలిండర్లు తరలించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
భారత్ గ్యాస్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
రంగారెడ్డి: రాజేంద్రనగర్ బండ్లగూడలోని భారత్ గ్యాస్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించిది. బుధవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.


