breaking news
new gas connections
-
40 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు
మహారాణిపేట (విశాఖపట్నం) : సామాజిక భాద్యత(సీఎస్సార్) కింద డిసెంబర్ నాటికి 40 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌర సరఫరాల శాఖ రాష్ట్ర డెరైక్టర్ జి.రవిబాబు తెలిపారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులు, ఐటీడీఏ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోటి 95లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇందులో 25లక్షల మంది వినియోగం సరిగ్గాలేదని గుర్తించామన్నారు. ఏజెన్సీలో అవగాహన లేక వాడడం లేదన్నారు. వారిలోని భయాందోళనలు తొలగించి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలకు సిలిండర్లు తరలించడం సమస్యగా ఉన్నందున 5 కేజీల సిలిండర్లు సబ్సిడీపై ఇవ్వాలని యోచిస్తున్నట్లు రవిబాబు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 11లక్షల మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. పరిశీలించి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. ఆగస్టు నెలాఖరుకల్లా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో ఈ పాస్ విధానం అమలు చేస్తామన్నారు. ఈ పాస్ వల్ల నిజమైన లబ్ధిదారుడికి రేషన్ అందడమే కాకుండా ఇప్పటి వరకూ రూ.43 కోట్లు ఆదా అయిందన్నారు. 20శాతం సరకు మిగిలిందని రవిబాబు తెలిపారు. ప్రతి ఇంటికీ ఎల్పీజీ కనెక్షన్ ఇవ్వడం వల్ల నెలకు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల విలువైన కిరోసిన్ ఆదా అయ్యే అవకాశం ఉందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్, ఐటీడీఏ సబ్‌కలెక్టర్ వెంకటేశ్, విశాఖపట్నం, విజయనగరం డీఎస్ఓలు జె.శాంతకుమారి, నిర్మలాభాయి, ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, ఏఎస్ఓలు పాల్గొన్నారు. -
దీపం ఎర
సాక్షి, గుంటూరు :ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. నిన్నటి వరకు రచ్చబండ కార్యక్రమం వేదికగా పించన్లు, రేషన్ కార్డులు ఇస్తామని ద రఖాస్తులు ఆహ్వానించిన అధికార పార్టీ నేడు గ్రామాల్లో డ్వాక్రా మహిళల ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలకు దిగింది. ఎత్తుగడల్లో భాగంగా ‘దీపం’ పథకం కింద కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎస్. సురేశ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గుంటూరు నగర పాలక సంస్థ, మున్సిపాల్టీలు, మండలాల నుంచి అర్హుల జాబితాలు తెప్పించారు. కొత్తగా రెండు వేల కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు.జిల్లాలో ఇప్పటికే 1,82,757 దీపం కనెక్షన్లు ఉన్నాయి. మాచర్ల పట్టణంలో 946, బాపట్లలో 99, బెల్లంకొండలో 105, తెనాలి పట్టణంలో 850 కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయా స్థానిక సంస్థల కమిషనర్లు, తహశీల్దార్ల నుంచి అందిన లబ్ధిదారుల జాబితాలను అనుమతి కోసం ప్రభుత్వానికి పంపారు. ఇవి కాకుండా గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో సుమారు 200 కొత్త కనెక్షన్లు దీపం కింద మంజూరు చేయాలని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుకు ప్రతిపాదనలు వెళ్లినట్టు తెలిసింది. పెండింగ్ కనెక్షన్లకు దిక్కులేదు.. పేదవారికి అంది ంచే దీపం కనెక్షన్లపై స్థానిక సంస్థలు అంతగా శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారుల జాబితాలకు గ్యాస్ ఏజెన్సీల వద్ద వున్న జాబితాతో సరిపోలకపోవడం సమస్యగా మారింది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు అంతకు ముందే కనెక్ష న్లు ఉన్నట్లు గా్యాస్ ఏజెన్సీల వద్ద వున్న జాబితాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఎవరు అర్హులో, అనర్హులనే ది ఇబ్బందిగా మారింది. ఉదాహరణకు. 2011-12 ఏడాదికి 19,583 గ్యాస్ కనెక్షన్లు మంజూరు కాగా, 17,026 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 16,293 మందికి పంపిణీ చేశారు. ఇంకా 3,290 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇదిలావుంటే, గుంటూరు నగరంలో సుమారు 700 మందికి సాంకేతిక కారణాలు చూపి కొన్ని గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్ల పంపిణీ నిలిపివేశాయి. ఈ విషయాన్ని ఆహార సలహా సంఘ సమావేశం జరిగిన ప్రతిసారి సభ్యులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెస్తూనే ఉన్నారు. గ్రామాల్లో నేతల హడావుడి.. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీల నేతలు గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు, ఇప్పటి నుంచే నానా ప్రయాస పడుతున్నారు. ప్రధానంగా పేద మహిళా ఓటర్లకు ఎర వేసేందుకు దీపం పథకం గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తామని నమ్మ బలుకుతున్నారు. ప్రతీరోజూ ఎవరో ఒక నాయకుడు పది మంది మహిళలను వెంటబెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి వెళుతున్నారు. ఆయాచోట్ల ఉన్నతాధికారులను కలిసి దరఖాస్తులు అందజేస్తున్నారు.