గ్యాస్‌ ధరలు హైదరాబాద్‌లోనే ఎక్కువ.. ఎందుకు? | LPG Cylinder Price Hike Domestic Gas Costs Differ Across Indian Cities After 29 Increase | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ధరలు హైదరాబాద్‌లోనే ఎక్కువ.. ఎందుకు?

Jun 7 2026 10:49 AM | Updated on Jun 7 2026 11:59 AM

LPG Cylinder Price Hike Domestic Gas Costs Differ Across Indian Cities After 29 Increase

దేశవ్యాప్తంగా వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరిగాయి. ఈ పెంపు దేశమంతా ఒకేలా ఉన్నప్పటికీ, గ్యాస్‌ సిలిండర్‌ల ధరలు ఒక్కో రాష్ట్రంలో, నగరంలో ఒక్కోలా ఉంటున్నాయి. ఈ గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేస్తున్న కంపెనీలు దేశవ్యాప్తంగా ఒకటే అయినప్పటికీ, తుది రిటైల్ ధర ఎందుకు భిన్నంగా ఉంటుంది అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ ధరల వ్యత్యాసానికి కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్‌పీజీ (14.2 కిలోల) సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. జూన్‌ 7 నుంచి అమల్లోకి వచ్చిన తాజా సవరణతో ఒక్కో సిలిండర్‌పై రూ.29 పెరిగింది. గత మూడు నెలల్లో ఇది రెండో పెంపు కావడం గమనార్హం. మార్చిలో రూ.60 పెరిగిన తర్వాత ఇప్పుడు మరోసారి ధరలు పెరగడంతో కుటుంబాలపై అదనపు భారం పడనుంది.

ప్రధాన నగరాల్లో తాజా ధరలు

నగరం14.2 కిలోల ఎల్పీజీ ధర
న్యూఢిల్లీరూ.942
ముంబైరూ.941.50
కోల్కతారూ.968
చెన్నైరూ.957.50
హైదరాబాద్రూ.994
బెంగళూరురూ.915.50

తాజా పెంపుతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య దాదాపు రూ.80 వరకు ధరల వ్యత్యాసం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.994గా ఉండగా, బెంగళూరులో అదే సిలిండర్ రూ.915.50కే లభిస్తోంది.

ఒకే దేశంలో.. ఒకే గ్యాస్‌.. ధరలు ఎందుకు వేరు?

ఎల్పీజీని సరఫరా చేస్తున్న కంపెనీలు దేశవ్యాప్తంగా ఒకటే అయినప్పటికీ, తుది రిటైల్ ధర రాష్ట్రాల వారీగా మారుతుంది. దీనికి ప్రధాన కారణాలు ఇవే.

రాష్ట్ర పన్నుల ప్రభావం

ప్రతి రాష్ట్రం ఎల్పీజీపై వేర్వేరు స్థాయిలో వ్యాట్‌, స్థానిక పన్నులు లేదా సెస్సులు విధిస్తుంది. ఈ పన్నుల రేట్లు మారడంతో వినియోగదారుడు చెల్లించే ధరలో తేడా వస్తుంది.

రవాణా ఖర్చులు

ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు, నిల్వ కేంద్రాల నుంచి సిలిండర్లను నగరాలకు తరలించడానికి అయ్యే రవాణా వ్యయం కూడా ధరను ప్రభావితం చేస్తుంది. సరఫరా కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

పంపిణీ వ్యయం

డీలర్ల కమిషన్‌, స్థానిక పంపిణీ ఖర్చులు, లాజిస్టిక్స్‌ వ్యయాలు ప్రాంతాల వారీగా మారుతుంటాయి. దీంతో తుది ధరలో స్వల్ప తేడాలు కనిపిస్తాయి.

పెంపు వెనుక కారణాలు

అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల, మధ్యప్రాచ్య భౌగోళిక ఉద్రిక్తతలు, దిగుమతి వ్యయాల పెరుగుదల కారణంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలపై భారం పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాజా పెంపునకు ముందు ప్రతి గృహ సిలిండర్‌పై వందల రూపాయల మేర నష్టాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భరిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

హైదరాబాద్‌లో ఎందుకు అత్యధిక ధర?

తెలంగాణలో స్థానిక పన్నులు, రవాణా, పంపిణీ వ్యయాల ప్రభావంతో హైదరాబాద్‌లో ధర దేశంలోని అనేక మెట్రో నగరాల కంటే ఎక్కువగా ఉంది. దీంతో ప్రస్తుతం ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ అత్యంత ఖరీదైన గృహ ఎల్పీజీ మార్కెట్లలో ఒకటిగా నిలిచింది.

వినియోగదారులపై అదనపు భారం

మార్చి నుంచి ఇప్పటివరకు గృహ ఎల్పీజీ సిలిండర్ ధర మొత్తం రూ.89 పెరిగింది. దీంతో నెలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిలిండర్లు వినియోగించే కుటుంబాల ఖర్చులు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల గృహ బడ్జెట్‌పై ఈ పెంపు ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఎల్‌పీజీ సిలిండర్లు.. ఎన్ని రంగులో..

Advertisement
 
Advertisement
Advertisement