విండ్‌ఫాల్ ప్రాఫిట్స్ కావు
మూడు ఆయిల్ కంపెనీల ఫలితాలపై పరిశ్రమ వర్గాల విశ్లేషణ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) లాభాలు సాధారణ స్థాయికి తిరిగొచ్చాయే తప్ప పశ్చిమాసియా సంక్షోభం నుంచి అవేమీ భారీగా లబ్ధి పొందలేదని ప్రభుత్వ, పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2025–26లో మూడు ఓఎంసీలు కలిసి రూ. 77,821 కోట్ల లాభాలను ప్రకటించాయి. ఇది 2024–25తో పోలిస్తే ఏకంగా 130 శాతం అధికం. దీనితో ఆయిల్ కంపెనీలు పశ్చిమాసియా సంక్షోభం సాకుతో రేట్లను పెంచేసి అనూహ్య లాభాలను ఆర్జించాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు ఓఎంసీలైన ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) నిపుణుల విశ్లేషణ ప్రాధాన్యం సంతరించుకుంది.
వాస్తవానికి 2024–25లో వంట గ్యాస్ రేట్లు పెరగకుండా రేట్లను అదే స్థాయిలో కొనసాగించడం వల్ల ఓఎంసీలు రూ. 40,434 కోట్ల ఆదాయ నష్టాన్ని భరించాయి. ఫలితంగా 2024–25లో లాభాలు రూ. 33,602 కోట్లకు పరిమితమయ్యాయి. 2025–26లో లాభాలు భారీగా పెరిగినట్లు కనిపిస్తున్నా, అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో అవి భారీగా అండర్ రికవరీలను నమోదు చేయడం వల్ల, దానితో పోల్చి చూడటం సరికాదని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న లాభాలు 2023–24లో నమోదైన రూ. 80,986 కోట్ల స్థాయికి దరిదాపుల్లో ఉన్నాయని, ఈ స్థాయి ప్రాఫిట్స్ సాధారణమే తప్ప ఆకస్మిక లాభాలు కావని తెలిపారు.
ఆ మాత్రం మార్జిన్లుండాలి..
కంపెనీల ఆదాయాల స్థాయిని వాటి పరిమాణాన్ని బట్టి మదింపు చేయాలని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశీయంగా మూడు ఏఎంసీల వార్షికాదాయం రూ. 20 లక్షల కోట్ల పైగానే ఉంటుంది. ఐవోసీలాంటి రిఫైనింగ్ సంస్థ ఆదాయామే ఏటా రూ. 10 లక్షల కోట్లు ఉంటుంది. భారీ కమోడిటీ రిఫైనింగ్ సంస్థల నిర్వహణ మార్జిన్లు 1–3 శాతం ఉండటం సాధారణమేనని నిపుణులు తెలిపారు. మూలధన పెట్టుబడులను కొనసాగించడానికి, రిఫైనరీలను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ మాత్రం నిధులు కావాల్సి ఉంటుందని వివరించారు. కేవలం ఒక రిఫైనరీని విస్తరించాలన్నా రూ. 50,000–60,000 కోట్లు అవసరమవుతాయని తెలిపారు.
2030 నాటికి రిఫైనింగ్ సామర్థ్యాలను వార్షికంగా 310 మిలియన్ టన్నులకు మించి పెంచుకోవాలని పరిశ్రమ నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, 2025–26లో ఆదాయాలకు పశ్చిమాసియా ఉద్రిక్తతలకు సంబంధం లేదని కంపెనీలు చెబుతున్నాయి. హార్మూజ్ జలసంధి సంక్షోభం తలెత్తడానికి 50–60 రోజుల ముందు కొన్న ముడిచమురును తాము శుద్ధి చేసినట్లు వివరించాయి. కాబట్టి పశ్చిమాసియా సంక్షోభంపరంగా క్రూడాయిల్ రేట్లు, రవాణా వ్యయాలు, ఇన్సూరెన్స్ సర్‌చార్జీల పెరుగుదల మొదలైనవన్నీ 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆదాయాల్లోనే కనిపించవచ్చంటున్నాయి. ఈ గణాంకాలు ఆగస్టులో వెల్లడవుతాయి.
ప్రపంచంలో అయిదో వంతు ముడిచమురు హార్మూజ్ జలసంధి నుంచే రవాణా అవుతోంది. అక్కడ ఉద్రిక్తతల వల్ల ఆసియావ్యాప్తంగా ఆయిల్ ధరలు, షిప్పింగ్ వ్యయాలు భారీగా పెరిగిపోయాయి. ఫిబ్రవరిలో సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి దేశీయంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ రేట్లు 8–9 శాతం పెరిగాయి. అయితే పలు పొరుగు దేశాల్లో నమోదైన 20–67 శాతం వరకు పెంపుతో పోలిస్తే ఇది తక్కువేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. పైగా 2026 మార్చి 27 నుంచి పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు తెలిపాయి.
దీనితో 2021 నుంచి చూస్తే పెట్రోల్‌పై రూ. 23, డీజిల్‌పై రూ. 26 మేర సుంకాలను తగ్గించినట్లయిందని పేర్కొన్నాయి. ఇక ఓఎంసీల లాభాల్లో దాదాపు సగం వాటా డివిడెండ్లు, ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వస్తుందని.. హైవేలు, రైల్వేలు, మెట్రో ప్రాజెక్టుల్లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఇవి ఉపయోగపడుతున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మిగతా మొత్తాన్ని ఇంధన భద్రత కోసం, రిఫైనింగ్ సామర్థ్యాల పెంపు కోసం పెట్టుబడులకి వినియోగమవుతున్నాయని వివరించాయి.


