బుల్ మార్కెట్లో పరుగులు శాశ్వతంగా ఉండవు
కంపెనీ సూపర్ కదా అని షేర్లు కొనేయొద్దు
ఎందుకంటే మీరు ఏ ధరలో కొంటున్నారనేదే ముఖ్యం
భవిష్యత్తుకు తగ్గట్టు ముందే పెరిగిపోయాక... కొంటే కష్టం
ఒక్కోసారి అద్భుతంగా... తరువాత చతికిలబడే కంపెనీలు వేస్ట్
క్రమం తప్పకుండా నిరంతర వృద్ధిని చూపేవే ‘వెల్త్ క్రియేటర్లు’
‘టైమ్ కరెక్షన్’ జరిగేటపుడు వేలుపెడితే లాభం ఉండదు
బుల్ మార్కెట్లో జరిగేదొకటే. కొన్ని తప్ప అన్ని షేర్లూ పరుగులు పెడతాయి. ఎలా అంటే... అమ్మో! ఇప్పుడు కొనలేకపోతే ఇంకెప్పటికీ ఆ ధర దగ్గర దొరకవేమో!!... అని ఇన్వెస్టర్లు భయపడేలా!. కొంచెం స్టాక్‌మార్కెట్ గురించి తెలిసిన వాళ్లంతా గురువులు, స్నేహితుల రూపంలో అప్పుడే ఎదురవుతారు. ‘‘ఇది మంచి కంపెనీ. ధర ఓకే. జస్ట్ కొని పక్కనపెట్టుకోండి. ఎప్పటికీ అమ్మకపోతేచాలు’’ అని సలహా ఇస్తారు.
ఇదిగో... ఇన్వెస్టర్లు తప్పులో కాలేసేదిక్కడే. ఎందుకంటే ‘షేర్లు కొని మర్చిపోండి’ అనే సలహాలో నిజం సగమే. ఒక గొప్ప కంపెనీ షేరును కొన్నంత మాత్రాన అద్భుతమైన లాభాలు వస్తాయని కానీ... ఒక నాసిరకం కంపెనీ షేరును కొన్నంత మాత్రాన నష్టాలు ఖాయమని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే కంపెనీ– షేరు కవలలు కాదు. కేవలం సోదరులే. రెండింట్లో తేడాలుండొచ్చు. అనుకున్నట్టుగా రాణించే మంచి కంపెనీలకన్నా, అనూహ్యంగా రాణించే సాధారణ కంపెనీలే బాగా ముందుకెళతాయి. అదెలాగో సోదాహరణంగా వివరించేదే ఈ సాక్షి ‘వెల్త్’ ప్రత్యేక కథనం...
ఒక షేరు పెరుగుతుందా? తగ్గుతుందా? ఎన్నాళ్లలో ఎంత రాబడినిస్తుంది? ఇదంతా కేవలం కంపెనీ ఎంత బాగుందన్న దానిపైనే ఆధారపడదు. కంపెనీ వ్యాపారం ఏటా ఏ స్థాయిలో పెరుగుతోంది? ఆ పెరిగే వృద్ధికి మార్కెట్ ఎంత విలువ ఇస్తోంది? ఆ కంపెనీ ఎంత డివిడెండ్ చెల్లిస్తోంది? మనం కొన్న షేరును ఎంతకాలం విక్రయించకుండా ఉంచగలుగుతున్నాం? ఇవన్నీ కలిసే షేరుపై వచ్చే రాబడిని నిర్ణయిస్తాయి. అందుకు కొన్ని ఉదాహరణలివీ...
గొప్ప కంపెనీ... కానీ పూర్ ఇన్వెస్ట్‌మెంట్!
పేజ్ ఇండస్ట్రీస్: 2009–2019 మధ్య దేశంలోని కంపెనీల్లో ఇన్వెస్టర్లకు అత్యంత భారీ లాభాలిచ్చిన షేరు ఇదే. ఆదాయం బీభత్సం. మార్జిన్లు అద్భుతం. పెట్టిన మూలధనంపై వచ్చే రాబడి(ఆర్‌ఓసీఈ) అత్యధికం. దీంతో 2009లో రూ.300 ఉన్న షేరు ధర పదేళ్లలో ఏకంగా రూ.35వేలకు చేరింది. ఇన్వెస్టర్లు ఇక ఈ కంపెనీకి ఎదురులేదనుకున్నారు. ధర ఎంత పెరిగినా కొనటం మొదలుపెట్టారు. వేల్యుయేషన్లు పెరిగాయి. అంటే.. కంపెనీ భవిష్యత్తుకు తగ్గట్టు ముందే షేరు ధర పెరిగిపోయింది.
జాకీ బ్రాండ్ దుస్తుల్ని దేశీయంగా విక్రయించే ఈ కంపెనీ వ్యాపారం 2019 తరువాత కూడా అద్భుతంగా కొనసాగింది. కానీ అప్పటికే ఆ భవిష్యత్తు మొత్తం షేరు ధరలో చేరిపోయింది. ఈ ఏడేళ్లలో షేరు ధర రూ.40 వేలకు అటూఇటుగా ఉంది. మరి 2019లోనో ఆ తరువాతో ఇన్వెస్ట్ చేసిన వారికిది పూర్ ఇన్వెస్ట్‌మెంటే కదా?
కొటక్ మహీంద్రా బ్యాంక్‌దీ ఇలాంటి స్టోరీనే.
దేశంలోని అతికొద్ది అద్భుతమైన ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటి. మేనేజ్‌మెంట్, అండర్‌రైటింగ్, అసెట్ క్వాలిటీ అన్నింటా సూపర్. ఇన్వెస్టర్లకూ ఇష్టమే. కానీ అందరూ ఇష్టపడి కొనటం వల్ల ఈ షేరు వాల్యుయేషన్ బాగా పెరిగిపోయింది. తరువాత రుణాల వృద్ధి తగ్గింది. వ్యాపారం, బుక్ వేల్యూ పెరుగుతున్నా వాల్యుయేషన్ల ప్రీమియం తగ్గటంతో షేరు ధర బాగా పడింది. ఏషియన్ పెయింట్స్‌దీ ఇలాంటి కథే. ఒకప్పుడు ఇది వ్యాపారానికి బెంచ్‌మార్క్. పోటీ సంస్థలకన్నా అన్నింటా ముందంజే. కానీ గత కొన్నేళ్లుగా షేరుపై రాబడి పెద్దగా లేదు. ఎందుకంటే వ్యాపారం బాగానే ఉన్నా అంచనాలు విపరీతంగా పెరిగాయి. వాటిని అందుకోవటం సాధ్యం కాని స్థితిలో... షేరు ధర పెరుగుదల అంతంతమాత్రంగానే ఉంటోంది.
రాబడిలో నిలకడ లేకుంటే... షేరు ధర అంతంతే!
నాట్కో ఫార్మా: అప్పుల్లే వు. ఆర్ అండ్ డీ అద్భుతం. మార్జిన్లు సూపర్. పటిష్ఠమైన మేనేజ్‌మెంట్. కానీ... దీర్ఘకాలలలో చూస్తే ఈ కంపెనీపై రాబడి చాలా నాసిరకం. కారణమేంటి?
ఈ కంపెనీ లాభాలన్నీ బ్లాక్‌బస్టన్ జనరిక్ డ్రగ్స్‌ను ప్రవేశపెట్టడంపైనే ఆధారపడుతూ వస్తున్నాయి. ఒక అద్భుతమైన ఉత్పత్తితో అన్నీ మారిపోతాయి. తరవాత దానికి పోటీ వస్తుంది. మార్జిన్లు పడిపోతాయి. మరో కొత్త ఉత్పత్తిపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ తరహా అనిశ్చితి మార్కెట్‌కు నచ్చదు.
దివీస్ లాబొరేటరీస్: ఇది కూడా నాట్కో తరహాలో దేశీ ఫార్మా కంపెనీనే. కానీ ఈ కంపెనీ పనితీరులో నాటకీయ అనూహ్యతేదీ ఉండదు. బ్లాక్‌బస్టర్ డ్రగ్స్ ఉండవు. కానీ... అదే పనితీరు క్రమం తప్పకుండా కొనసాగుతుంది. మార్జిన్లు, క్యాష్ ఫ్లో, రాబడి... అన్నీ అంచనాలకు తగ్గట్టే ఉంటాయి. అందుకే ఈ కంపెనీ షేరు ఎప్పటికప్పుడు కొత్త గరిష్ఠ స్థాయిలను తాకుతూనే వస్తోంది.
కొన్ని సార్లు వేచి చూడాలి... అంతే!
రిలయన్స్ ఇండస్ట్రీస్: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం
రిలయన్స్‌ది ప్రత్యేక కథ. 2002–08 మధ్య చూస్తే... చమురు రిఫైనింగ్ బూమ్‌లో ఉంది. షేరు ధర రూ.20 నుంచి ఏకంగా రూ.350కి చేరి ఇన్వెస్టర్లకు సంపద సృష్టించింది. కానీ అప్పటి నుంచి 2016 వరకు వ్యాపారం అద్భుతంగానే ఉన్నా షేరు ధర పెరగలేదు. పైపెచ్చు తగ్గింది.
ఆ తరువాతి ఐదేళ్లూ... అంటే 2021 వరకూ చూస్తే జియో వచ్చింది. రిటైల్ పెరిగింది. కంపెనీ విలువ మారిపోయింది. షేరు ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.1400 కూడా తాకింది. మరి తరువాతేంటి? ఇదిగో ఈ ప్రశ్నకు సమాధానంకోసమే మార్కెట్ ఎదురు చూస్తోంది. అందుకే గడిచిన ఐదేళ్లలో షేరు ధర పెరగలేదు. జియో ఐపీవోకు వస్తే దాని విలువెంత? రిటైల్ ఐపీఓ ఎంత? గ్రీన్ ఎనర్జీ ఆదాయాలెలా ఉంటాయి? ఏఐతో వచ్చే లాభమెంత? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాల కోసం మార్కెట్ వేచిచూస్తోంది. కంపెనీ మారలేదు. వ్యాపారం క్షీణించలేదు. కానీ మార్కెట్ కంపెనీ వృద్ధికి కొత్త ట్రిగ్గర్ కోసం ఎదురుచూసింది. అందుకే ఐదేళ్లపాటు షేరు ధర పెద్దగా కదల్లేదు. ఇదే టైమ్ కరెక్షన్.
సాదాసీదా వ్యాపారం... షేరు అద్భుతం!
షిప్పింగ్ కంపెనీలను చూడండి. వ్యాపార నాణ్యత అంతంతే. రాబడులు కొన్నిసార్లు మాత్రం అసాధారణమైన రీతిలో ఉంటాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా సరకు రవాణా సైకిల్స్ మారుతుంటాయి కనక. దానికి తగ్గట్టే షేర్లూ పెరుగుతుంటాయి.
షుగర్ కంపెనీలదీ అదే తీరు. మార్జిన్లు తక్కువ. ప్రభుత్వ నియంత్రణ ఎక్కువ. కానీ... ఇథనాల్ నిర్ణయాలప్పుడు... చక్కెర సీజన్లోను ఈ షేర్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్ని చాలాసార్లు రెండుమూడు రెట్ల చొప్పున పెరిగాయి. కానీ వ్యాపారమేమీ అంత నాటకీయంగా మారిపోదు. సీజన్ మారుతుంది... అంతే.
షేర్ల రాబడికి గ్రోత్ ఇంజిన్లు ఇవే...
పై ఉదాహరణలన్నీ చూశాక ప్రతి ఇన్వెస్టరూ గమనించాల్సినవి ఇవే.
→ రాబడుల్లో వృద్ధి: కంపెనీ ఆదాయం, లాభం క్రమం తప్పకుండా పెరగాలి.
→ ఊహించినట్టే: కంపెనీ భవిష్యత్తు రాబడులపై ఇన్వెస్టర్లు ధీమాగా ఉండాలి.
→ వేల్యుయేషన్: ఎంత పీఈ దగ్గర కొంటున్నామనే విషయంతో పాటు కంపెనీ పీఈ ఏటా ఏ స్థాయిలో పెరుగుతోందో కూడా చూడాలి. అప్పుడే ధర సహేతుకమో కాదో తెలుస్తుంది.
→ క్యాపిటల్ కేటాయిపు: రాబడుల్లో మిగిలే మొత్తం కంపెనీ విస్తరణ ప్రణాళికలకు ఏ మేరకు సరిపోతుందన్నది కూడా ముఖ్యమే.
→ టైమ్: ఇది అన్నిటికన్నా ముఖ్యం. కొన్నిసార్లు అన్నీ బాగున్నా మార్కెట్ మాత్రం ఆ కంపెనీ నుంచి మరిన్ని సంకేతాల కోసం ఎదురు చూస్తుంటుంది.
ఇన్వెస్టర్లు చూడాల్సినవివే...
ఒక షేరు కొనేటపుడు ‘ఇది మంచి కంపెనీయే’ అని సింపుల్‌గా తేల్చేసుకోకుండా...
→ కంపెనీ రాబడుల్లో వృద్ధి నిలకడగా ఉంటుందా?
→ వ్యాపార పనితీరు అనుకున్నట్టుగానే సాగుతుందా?
→ లాభాలను కంపెనీ తెలివిగా వాడి విస్తరణ చేయగలుగుతుందా?
→ కంపెనీ షేరు విలువ సహేతుకంగానే ఉందా?
→ ఈ కంపెనీనుంచి మార్కెట్ ఆశిస్తున్నదెంత? కంపెనీ సాధించిందెంత?
→ వచ్చే ఐదేళ్లలో ఈ కంపెనీ ఏ రకమైన అనూహ్య ఫలితాలు సాధిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుని... ఆ తరువాత ఇన్వెస్ట్ చేస్తేనే అనుకున్న ఫలితాలొస్తాయి.
చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ సలహాదారులు ఇన్వెస్టర్లు కంపెనీ యాజమాన్యం తరహాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతారు. కానీ అది సరికాదనే అనుకోవాలి. ఎందుకంటే కంపెనీ యాజమాన్యం ‘ఈ వ్యాపారం భవిష్యత్ బాగుంటుందా?’ అనే ఆలోచిస్తుంది. కానీ ఇన్వెస్టర్లు మాత్రం... ‘ఈ వ్యాపారం తాలూకు భవిష్యత్తు వృద్ధి ఇప్పటికే ఈ షేరులో కనిపిస్తోందా?’ అనేది చూడాలి. ఎందుకంటే ఇన్వెస్టర్లు కంపెనీని కొనరు. ఆ కంపెనీ భవిష్యత్ ఆదాయాలను కొంటారు. ఆ భవిష్యత్తుకు ఎంత ధర చెల్లిస్తున్నారన్నదే చివరికి వారి రాబడిని నిర్ణయిస్తుంది. ఆ చెల్లించే ధర మరీ ఎక్కువ అనిపిస్తే ఆ షేరుకు దూరంగానే ఉండాలి. కనీసం కొన్నాళ్లయినా!!
మంథా రమణమూర్తి


