సుజుకి తన ఫ్లాగ్‌షిప్ స్పోర్ట్ టూరర్ అయిన 2027 హయబుసాను అంతర్జాతీయ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ లేటెస్ట్ మోడల్ ఇప్పుడు కొత్త రంగులలో అందుబాటులో ఉంది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
2027 సుజుకి హయబుసా కొత్త పెయింట్ స్కీమ్(గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ రిఫ్లెక్టివ్ బ్లూ)లు మినహా, ఎలాంటి యాంత్రిక మార్పులకు లోనుకాలేదు. కాబట్టి మునుపటిలాగే అదే ఇంజిన్, ఛాసిస్, ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీని కొనసాగిస్తోంది. పెర్ల్ బ్రిలియంట్ వైట్ అండ్ మెటాలిక్ ఊర్ట్ గ్రే రంగులలో, కాంట్రాస్టింగ్ రెడ్ హైలైట్స్‌తో కూడిన ఒక స్పెషల్ ఎడిషన్ కూడా అందుబాటులోకి వచ్చింది.
హయబుసాలోని అదే 1,340 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్ లైన్ ఫోర్ ఇంజన్.. 190 bhp పవర్, 150 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్, బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ జతచేయబడి ఉంటాయి. ఈ మోటార్‌సైకిల్‌లో సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ (SIRS) కూడా ఉంది, ఇందులో మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, మల్టిపుల్ రైడర్ అసిస్టెంట్స్ కూడా ఉన్నాయి.
భారతదేశంలో సుజుకి హయబుసా ధర రూ.18.05 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కాగా ఇప్పుడు కంపెనీ తీసుకొచ్చిన కొత్త కలర్ హయబుసా ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెడుతుందా?, లేదా? అనేది తెలియాల్సి ఉంది. బహుశా భవిష్యత్తులో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.


