వాషింగ్టన్: ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ‘పెయిడ్ డేటా సర్వీస్ ప్లాన్’ను ప్రకటించింది. దీని ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ట్రూత్ సోషల్‌లోని ప్రముఖ ఖాతాల పోస్టులు అత్యంత వేగంగా అందుతాయి. ట్రూత్ ఏపీఐ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్.. ప్రభావం ఎక్కువగా చూపే 10 ఖాతాల కంటెంట్‌ను బ్యాంకులు, హెడ్జ్ ఫండ్లు, ట్రేడింగ్ సంస్థలకు సాధారణ యాప్ నోటిఫికేషన్ల కంటే వేగంగా అందిస్తుంది. ట్రూత్ ఏపీఐ సేవ ధర $60,000 నుంచి $100,000 మధ్య (సుమారు రూ.51 లక్షల నుంచి రూ.85 లక్షల మధ్య) ఉండొచ్చని సమాచారం.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కొన్ని సెకన్ల ఆలస్యం కూడా ఆర్థికంగా కొందరికి నష్టాలను తెచ్చిపెడుతుంది. అటువంటి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని ఈ సర్వీస్ రూపొందించారు. తాజా సమాచారం వచ్చిన వెంటనే చర్యలు తీసుకునే ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ సంస్థలు ఇందులో ఉన్నాయి. ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు ముందే నిర్ణయించిన నియమాల ఆధారంగా ఆటోమేటిక్‌గా కొనుగోలు, అమ్మకాలు చేసే విధానం.
ఇప్పటి వరకూ ఇలాంటి సంస్థలు ట్రూత్ సోషల్‌ను అందరిలాగే గమనించేవి లేదా ప్లాట్‌ఫాం నిబంధనలకు విరుద్ధంగా డేటాను సేకరించేవి. ట్రూత్ ఏపీఐ ఆ లోటును భర్తీ చేసే పరిష్కారంగా తీసుకొచ్చారు. సోషల్ మీడియా వ్యాపారానికి బయట కొత్త ఆదాయ మార్గాన్ని ఓపెన్ చేయాలనే లక్ష్యంతో డేటా లైసెన్సింగ్‌లో ట్రంప్ మీడియా వేసిన తొలి అధికారిక అడుగు ఇదే. ప్లాట్‌ఫాంలో వచ్చే పోస్టులకు మార్కెట్లు ఇప్పటికే స్పందిస్తున్నాయని, వేగంగా సమాచారం పొందాలనే డిమాండ్ పెరుగుతుందని తాత్కాలిక సీఈవో కెవిన్ మెక్‌గర్న్ తెలిపారు.
ఇందుకే పోస్టులను వేగంగా చదవాలి
ట్రంప్ పోస్టులు సుంకాల ప్రకటనల నుంచి చైనా వాణిజ్య విధానంపై వ్యాఖ్యల వరకు ఎన్నో సందర్భాల్లో మార్కెట్లపై ప్రభావం చూపించాయి. 2025 ఏప్రిల్ 9న కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆయన పోస్టు చేసిన వెంటనే వాల్ స్ట్రీట్ సూచీలు భారీగా ఎగిశాయి.
మార్కెట్ వర్గాలు కూడా ఈ ప్రభావాన్ని అంగీకరిస్తున్నాయి. ట్రూత్ సోషల్‌లో మార్కెట్‌ను నిరంతరం ప్రభావితం చేసేది ట్రంప్ ఒక్కరేనని ఒక ఫండ్ మేనేజర్ చెప్పారు. అందుకే ఆయన పోస్టులు ముందుగానే అందడం అత్యంత విలువైనదిగా భావిస్తున్నారు.
అయితే ఈ చెల్లింపు సర్వీసు అసమానతలను పెంచుతుందని విమర్శకులు అంటున్నారు. వేగంగా సమాచారం అందడం వల్ల భారీ నిధులు ఉన్న సంస్థలకు, చిన్న సంస్థలపై పైచేయి లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. సెనేటర్ రాన్ వైడెన్ ఈ చర్య వల్ల ట్రంప్ కుటుంబానికి ఆర్థిక లాభం చేకూరడంతో పాటు వాల్ స్ట్రీట్ లాభాలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్థాయుల వారీగా డేటా అందించడం కొత్త విషయం కాదు. ఇది సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించకపోవచ్చు. అయినా సమాన అవకాశాలపై సందేహాలు తలెత్తొచ్చు. ఈ సర్వీసు రోజంతా పర్యవేక్షణ సౌకర్యంతో పాటు 2022 నుంచి ఉన్న పాత పోస్టుల భద్రపరిచిన రికార్డులను కూడా అందిస్తుంది. ఆగస్టు 1న ప్రారంభం కానున్న ఈ సేవకు ఇప్పటికే తొలి ఖాతాదారులు చేరారు. రాజకీయ ప్రభావాన్ని ఆదాయంగా మార్చే ప్రయత్నాలను ట్రంప్ మీడియా మరింత దూకుడుగా విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.


