ఇరాన్‌పై అమెరికా ఉక్కుపాదం.. దాడికి దాడే సమాధానం.. | US Launches Fresh Airstrikes On Iran After Deadly Attack On American Troops In Jordan, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై అమెరికా ఉక్కుపాదం.. దాడికి దాడే సమాధానం..

Jul 19 2026 7:34 AM | Updated on Jul 19 2026 12:03 PM

US Strikes On Iran And Warning On Hormuz

అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్‌లతో జరిపిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌పై అమెరికా తాజాగా మరోసారి భీకర వైమానిక దాడులు నిర్వహించింది.

అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, జోర్డాన్ దాడిలో మరో అమెరికా సైనికుడు ఇంకా గల్లంతయ్యాడు. నలుగురు గాయపడగా చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చే వరకు వారి పేర్లను వెల్లడించబోమని సెంట్‌కామ్ తెలిపింది. అలాగే, హర్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, జోర్డాన్ దాడికి బాధ్యులైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బలగాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా వెల్లడించింది.

ఈ సందర్భంగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఇద్దరు అమెరికా సైనికుల మరణం తమ సంకల్పాన్ని మరింత బలపరిచిందని, దీనికి తగిన ప్రతిస్పందన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, దక్షిణ ఇరాన్‌లోని సిరిక్ పోర్టు నగరంతో పాటు హాజీబాద్ సమీప ప్రాంతాలపై అమెరికా దాడులు జరిపింది. అయితే ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.

మరోవైపు, ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ అమెరికాకు "మరచిపోలేని గుణపాఠం నేర్పుతాం" అంటూ హెచ్చరించారు. అమెరికా ఒప్పందాలను పదేపదే ఉల్లంఘిస్తోందని, అధ్యక్షుడు ట్రంప్ హామీలకు విశ్వసనీయత లేదని ఆయన విమర్శించారు. హర్మూజ్‌ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందని ఇరాన్ ఆరోపిస్తుండగా.. వాణిజ్య నౌకలను ఇరాన్ బెదిరిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

ఇక గల్ఫ్ దేశాలు పరిస్థితిని అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి. హర్మూజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అన్ని పక్షాలు వెంటనే కాల్పులు నిలిపి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement