నెతన్యాహు అరెస్టుకు మమ్దానీ కసరత్తు! | New York Mayor Zohran Mamdani Considers Arresting Netanyahu During UN General Assembly Visit | Sakshi
Sakshi News home page

నెతన్యాహు అరెస్టుకు మమ్దానీ కసరత్తు!

Jul 19 2026 9:45 AM | Updated on Jul 19 2026 12:43 PM

mamdani still mulling netanyahus arrest

న్యూయార్క్: సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ నగరానికి వస్తే, ఆయన్ని అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ జొహ్రాన్‌ మమ్దానీ తెలిపారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) యుద్ధ నేరాల ఆరోపణలు మోపిన నెతన్యాహును అరెస్టు చేసే అధికారం తనకు ఉందో లేదో తెలుసుకోవడానికి నగర న్యాయ విభాగంతో చర్చిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ విషయమై ‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమ్దానీ మాట్లాడుతూ ‘నెతన్యాహు ఒక యుద్ధ నేరస్థుడు, ఆయన హేగ్‌లో ఉండాల్సిన వ్యక్తి. ప్రస్తుతం చట్టం తనకు కల్పించిన అధికారాల పరిధిలోనే చర్యలు తీసుకుంటాం. ఈ అరెస్టు కోసం కొత్త చట్టాలేవీ తీసుకురావడం లేదు’ అని స్పష్టం చేశారు. నెతన్యాహు అరెస్టు కోసం న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించే అధికారం తనకున్నదో లేదో స్పష్టత కోసం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గతంలో కూడా ఇజ్రాయెల్‌ను ‘అపార్థీడ్ (వర్ణవివక్ష) పాలన’ అని అభివర్ణించిన మమ్దానీ, ఐసీసీ జారీ చేసిన అరెస్టు వారెంట్లను అమలు చేసేలా పోలీసులను ఆదేశిస్తానని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు నెతన్యాహు బాధ్యత వహించాల్సి ఉందని ఐసీసీ గతంలోనే పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement