భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. టికెట్ ధర ఎంతంటే? | Indias First Hydrogen Train Fare Details, Ticket Prices Start At Just ₹5 And Features Green Technology | Sakshi
Sakshi News home page

భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. టికెట్ ధర ఎంతంటే?

Jul 19 2026 3:27 PM | Updated on Jul 19 2026 3:51 PM

Indias First Hydrogen Train Fare Details Here

భారతదేశం ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుని.. వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియాలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారవడం భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఈ కథనంలో ఈ ట్రైన్ టికెట్ ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.

భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు హర్యానా రాష్ట్రంలోని జింద్ నుంచి సోనిపట్ వరకు నడుస్తుంది. మధ్యలో అనేక చిన్న స్టేషన్లలో ఆగుతూ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అయితే.. ఈ రైలులో ప్రయాణించడానికి అయ్యే ఖర్చు (టికెట్ ధర) కూడా చాలా తక్కువే కావడం గమనార్హం. రూ.5 నుంచి రూ.25 వరకు మాత్రమే టికెట్ చార్జీ ఉండటం వల్ల.. ప్రతి ఒక్కరూ ఈ రైలులో ప్రయాణించవచ్చు. దీన్నిబట్టి చూస్తే.. ఈ ట్రైన్ టికెట్ ప్రారంభ ధర.. సాధారణ ట్రైన్ ప్లాట్‌ఫామ్ టికెట్ రేటు (రూ.10) కంటే తక్కువ అని తెలుస్తోంది.

ఈ రైలు సాధారణ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ రైళ్ల మాదిరిగా కాకుండా.. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తుంది. అంటే ఈ ట్రైన్ ముందుకు వెళ్ళడానికి డీజిల్, ఎలక్ట్రిక్ (కరెంట్) అవసరం లేదు. హైడ్రోజన్ ఆక్సిజన్‌తో చర్య జరిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ట్రైన్ ముందుకు వెళ్తుందన్నమాట. ఈ ప్రక్రియలో కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. తద్వారా గాలి కాలుష్యం తగ్గుతుంది.

ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై 50% సబ్సిడీ!

ఈ రైలులో మొత్తం పది కోచ్‌లు ఉంటాయి. ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ప్రయాణికుల భద్రత కోసం హైడ్రోజన్ లీకేజీ, పొగ, మంటలు, అధిక ఉష్ణోగ్రతలను గుర్తించే ఆధునిక భద్రతా వ్యవస్థలను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.

హైడ్రోజన్ రైలు ప్రారంభం కావడంతో.. భారత్ జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన నిలిచింది. ఇది భారతదేశానికి గర్వకారణమైన విషయం. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పర్యావరణహిత రైళ్లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే కాలుష్యం తగ్గడమే కాకుండా ఇంధన వ్యయం కూడా తగ్గుతుంది. ఈ దిశగా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement