కృత్రిమ మేధస్సు (AI), ఆటోమేషన్ విస్తృతంగా వినియోగంలోకి వస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌లో రానున్న కాలంలో మరిన్ని ఉద్యోగ పాత్రలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మిడ్-ఆఫీస్, బ్యాక్-ఆఫీస్ విభాగాల్లో పునరావృతమయ్యే పనులను టెక్నాలజీనే నిర్వహించగలిగితే, అలాంటి ఉద్యోగాల అవసరం క్రమంగా తగ్గవచ్చని బ్యాంక్ యాజమాన్యం సంకేతాలు ఇచ్చింది. అయితే, భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపులు ఉంటాయా.. ఉంటే ఎప్పుడు ఉంటాయన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
మొదటి త్రైమాసిక (Q1 FY27) ఫలితాల అనంతరం నిర్వహించిన విశ్లేషకుల సమావేశంలో బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ, సాంకేతికత వల్ల ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతోందని తెలిపారు. మిడ్-ఆఫీస్, బ్యాక్-ఆఫీస్‌లో ఉండే 'మేకర్-చెకర్' వంటి బహుళ ధ్రువీకరణ ప్రక్రియలను ఆటోమేట్ చేయడం ద్వారా అనేక కార్యకలాపాలను సరళీకరించే అవకాశం ఉందని వివరించారు. దీని వల్ల ఖాళీ అయ్యే సామర్థ్యాన్ని కస్టమర్ సేవలు, వ్యాపార విస్తరణ వంటి ఫ్రంట్-ఎండ్ కార్యకలాపాల వైపు మళ్లించే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే 2025-26 ఆర్థిక సంవత్సరంలో యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య సుమారు 3 శాతం తగ్గింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 1,04,453 మంది ఉద్యోగులతో పోలిస్తే దాదాపు 3,100 మంది తగ్గినప్పటికీ, అదే సమయంలో బ్యాంక్ దేశవ్యాప్తంగా సుమారు 400 కొత్త శాఖలను ప్రారంభించడం గమనార్హం. ఇది వ్యాపారం మందగించడం వల్ల కాకుండా, సాంకేతికత ఆధారిత సామర్థ్య పెరుగుదల వల్లే సాధ్యమైందని ఎండీ, సీఈఓ అమితాబ్ చౌదరి గతంలో స్పష్టం చేశారు.
తాజాగా జూన్ 2026తో ముగిసిన తొలి త్రైమాసికంలో కూడా ఉద్యోగుల సంఖ్య మరో 600 మేర తగ్గి లక్షకు కొద్దిగా పైగా నిలిచింది. అయితే బ్యాంక్ యాజమాన్యం దీన్ని 'లేఆఫ్స్'గా కాకుండా, ఉద్యోగులు సంస్థను విడిచిపెట్టిన తర్వాత ఆ స్థానాలను తిరిగి భర్తీ చేయకుండా ఉత్పాదకతను పెంచే ప్రక్రియగా అభివర్ణించింది. ఏఐ పూర్తి స్థాయి ప్రభావం ఉద్యోగుల సంఖ్యపై కనిపించడానికి మరో 18 నుంచి 24 నెలలు పట్టవచ్చని కూడా అధికారులు పేర్కొన్నారు.
👉ఇది చదివారా? అంతరిక్ష శాస్త్రవేత్తలకు జీతాలు తక్కువా?
బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్, ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ఆపరేషనల్ పనుల కంటే కస్టమర్ సలహాలు, సంబంధాల నిర్వహణ, డేటా విశ్లేషణ, సాంకేతిక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే ధోరణి ఇతర ప్రైవేట్ బ్యాంకుల్లోనూ కనిపించడం ప్రారంభమైందని తాజా పరిశ్రమ గణాంకాలు సూచిస్తున్నాయి.


