ఎక్కువ జీతం వస్తేనే ధనవంతులు అవుతామని చాలా మంది భావిస్తారు. కానీ అధిక ఆదాయం కంటే ఆర్థిక క్రమశిక్షణ, ఖర్చుల నియంత్రణ, దీర్ఘకాలిక పెట్టుబడులే నిజమైన సంపదకు పునాది అని బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) మీనాల్ గోయెల్ పేర్కొన్నారు. లింక్డ్‌ఇన్‌లో ఆమె పంచుకున్న అభిప్రాయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.
మాజీ డెలాయిట్, కేపీఎంజీ ఉద్యోగి అయిన గోయెల్ తన కెరీర్ ప్రారంభంలో వార్షికంగా రూ.1 కోటి సంపాదిస్తేనే తాను ధనవంతురాలినని భావించేదాన్నని చెప్పారు. అయితే అనుభవం పెరిగే కొద్దీ, ఎక్కువ సంపాదించడం ఒక్కటే సంపదకు ప్రమాణం కాదని, సంపాదించిన డబ్బులో ఎంత మిగుల్చగలుగుతున్నామన్నదే అసలు కీలకమని గ్రహించినట్లు వెల్లడించారు.
జీతం పెరిగినా.. పొదుపు పెరుగుతుందా?
గోయెల్ అభిప్రాయం ప్రకారం, ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా అదే వేగంతో పెరగడం చాలా మందిలో కనిపించే ప్రధాన సమస్య. దీనినే ఆర్థిక నిపుణులు "లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్" లేదా "లైఫ్‌స్టైల్ క్రీప్" అని పిలుస్తారు.
జీతం పెరిగిన వెంటనే అధిక అద్దె ఉన్న ఇళ్లకు మారడం, ఖరీదైన కార్లను ఈఎంఐలపై కొనుగోలు చేయడం, తరచూ బయట భోజనం చేయడం, విలాసవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం వల్ల అదనంగా వచ్చిన ఆదాయం పూర్తిగా ఖర్చైపోతుందని ఆమె వివరించారు. దీంతో ఆదాయం ఎక్కువైనా, నికర సంపద మాత్రం ఆశించినంతగా పెరగదని పేర్కొన్నారు.
ఎక్కువ జీతం... తక్కువ పొదుపు
తన పోస్టులో గోయెల్ ఒక ఆసక్తికరమైన ఉదాహరణను ప్రస్తావించారు. సంవత్సరానికి రూ.50 లక్షలు సంపాదించే కొంతమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఏడాదికి రూ.12 లక్షల జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగుల కంటే తక్కువ మొత్తాన్ని పొదుపు చేస్తున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. కారణం ఆదాయం కాదు.. ఖర్చుల నియంత్రణలో ఉన్న తేడా అని ఆమె అభిప్రాయపడ్డారు.
కోటీశ్వరులు కావాలంటే కోటి జీతం కావాలా?
వార్షికంగా రూ.1 కోటి జీతం ఉంటేనే కోటీశ్వరులు కావచ్చనే అభిప్రాయం సరైంది కాదని గోయెల్ స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా పొదుపు చేయడం, పెట్టుబడులు కొనసాగించడం, ప్రతి జీతం పెరుగుదలలో కొంత భాగాన్ని ముందుగా పెట్టుబడులకు కేటాయించడం ద్వారా సాధారణ ఉద్యోగి కూడా దీర్ఘకాలంలో రూ.1 కోటి ఆస్తిని సృష్టించగలడని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆమె ప్రకారం, సుమారు 10% వార్షిక జీతం పెరుగుదలతో పాటు దీర్ఘకాలంలో సగటున 12–15% పెట్టుబడి రాబడిని సాధించగలిగితే, పదేళ్ల వ్యవధిలో కోటి రూపాయల పెట్టుబడి విలువను చేరుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. అయితే ఇది మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడి విధానం, కాలవ్యవధి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఆర్థిక స్వేచ్ఛ అంటే ఇదే..
రూ.1 కోటి పెట్టుబడి దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయాన్ని అందించే ఆస్తిగా మారితే, అది నెలవారీ అవసరాల్లో పెద్ద భాగాన్ని భర్తీ చేసే అవకాశం ఉంటుందని గోయెల్ పేర్కొన్నారు. అదే నిజమైన ఆర్థిక స్వేచ్ఛకు తొలి అడుగు అని ఆమె అభిప్రాయపడ్డారు.
పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు కూడా గోయెల్ అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నారు. ఆదాయం పెరిగిన ప్రతిసారి ఖర్చులు పెంచడం కంటే, ముందుగా ఎస్‌ఐపీ (SIP), పీఎఫ్, ఎన్‌పీఎస్ లేదా ఇతర దీర్ఘకాలిక పెట్టుబడుల్లో వాటాను పెంచాలని సూచిస్తున్నారు. సాధారణంగా అత్యవసర నిధి, తగిన బీమా, క్రమబద్ధమైన పెట్టుబడులు, అవసరం లేని రుణాలకు దూరంగా ఉండటం ద్వారా దీర్ఘకాలంలో గణనీయమైన సంపదను నిర్మించవచ్చని వారు చెబుతున్నారు.
ధనవంతులుఏ కావడం అనేది కేవలం భారీ జీతంతో వచ్చే విషయం కాదు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులను నియంత్రించడం, క్రమశిక్షణతో పొదుపు చేయడం, నిరంతర పెట్టుబడులు కొనసాగించడం, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను పాటించడమే నిజమైన సంపద సృష్టికి మార్గమని గోయెల్ సందేశం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశంపై విస్తృత చర్చ కొనసాగుతోంది.


