అయోధ్య విరాళాల కేసు.. కౌంటింగ్ రూమ్‌లో నిందితుల తొలి ఫొటోలు లీక్! | First Photos of Accused Inside Ayodhya Ram Mandir Counting Room Surface | Sakshi
Sakshi News home page

అయోధ్య విరాళాల కేసు.. కౌంటింగ్ రూమ్‌లో నిందితుల తొలి ఫొటోలు లీక్!

Jul 3 2026 11:41 AM | Updated on Jul 3 2026 11:59 AM

First Photos of Accused Inside Ayodhya Ram Mandir Counting Room Surface

అయోధ్య: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రధాన నిందితులు అవినాష్‌ శుక్లా, అనుకల్ప్‌ మిశ్రాలకు సంబంధించిన ఫొటోలు తాజాగా వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది.

రామ మందిర భవనంలో అధికారుల సమక్షంలో భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. అయితే, సిబ్బంది విరాళాల్ని లెక్కిస్తున్న సమయంలోనే అవినాష్‌, అనుకల్ప్‌ ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు ఇప్పుడు బయటకు రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించేందుకు ట్రస్ట్ అధికారులు ఆలయ ప్రాంగణంలో రెండు కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి లెక్కింపు కేంద్రం ‘పిల్గ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్’ కాగా, రెండవదాన్ని ఒక పోలీస్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ రెండవ కౌంటింగ్‌ సెంటర్‌లోనే కానుకలు లెక్కించే బాధ్యతలను ప్రధాన నిందితుడు అనుకల్ప్‌ మిశ్రా చూసేవాడు. అక్కడ నుంచే అతను ఈ అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. 

కుంభమేళా అనంతరం భక్తుల రద్దీ, కానుకల సమర్పణ విపరీతంగా పెరగడంతో, లెక్కింపును వేగవంతం చేయడానికి ట్రస్ట్ అధికారులు ఆలయ ఆవరణలోని ఒక పోలీస్ పోస్ట్ వద్ద రెండవ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది మార్చి నెలలో నగదు లెక్కింపు కోసం కొత్తగా రిక్రూట్ చేసిన 10 మంది సిబ్బందిని ఈ పోలీస్ పోస్ట్ వద్ద ఉన్న రెండవ కేంద్రానికే కేటాయించారు. వీరిలో ప్రధాన నిందితుడు అనుకల్ప్ మిశ్రాతో పాటు అవినాష్ శుక్లా, కరుణేష్ పాండే, లవకుష్ మిశ్రా ఉన్నారు.

అనుకల్ప్ మిశ్రా నేరుగా విరాళాల వోచర్లు తయారు చేసే బాధ్యతను చూసేవాడు. అతను తన బావ అయిన లవకుష్ మిశ్రాతో కలిసి బ్యాంకుకు వెళ్లే క్యాష్ బండిల్స్‌లో అదనపు నోట్లను చేర్చేవాడు. బ్యాంకు అధికారులు బండిల్స్ సంఖ్యను మాత్రమే లెక్కించి డిపాజిట్ రశీదులు ఇచ్చే లోపాన్ని ఆసరాగా చేసుకుని, ఆలయం నుండి బ్యాంకుకు సొమ్ము తరలించే లోపే ఆ అదనపు నగదును వీరు రహస్యంగా నొక్కేసేవారని దర్యాప్తులో తేలింది.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. విరాళాల లెక్కింపు సమయంలో సీసీటీవీ కంట్రోల్ రూమ్‌ను అధికారులు సరిగ్గా పర్యవేక్షించడం లేదనే విషయాన్ని నిందితులు గమనించారు. మొదట్లో కెమెరాలకు చిక్కకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించిన నిందితుడు అనుకల్ప్ మిశ్రా, ఆ తర్వాత నిఘా లోపాన్ని ఆసరాగా చేసుకుని కెమెరాల ముందే బహిరంగంగా నగదును పక్కదారి పట్టించాడు.ఆలయం నుంచి నిందితుడు అత్యంత చాకచక్యంగా నగదును తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాల ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.  

నెలకు కేవలం రూ. 15,000 నుండి రూ. 18,000 జీతం తీసుకునే అనుకల్ప్ మిశ్రా పేరు మీద అయోధ్యలో రూ. 65 లక్షల విలువైన ఇల్లు, కొత్తగా నిర్మిస్తున్న ఫామ్‌హౌస్, రూ. లక్షకు పైగా విలువైన బైక్, మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ  బుకింగ్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఈ కేసులో మనీలాండరింగ్, నిధుల మళ్లింపు కోణాన్ని మరింత లోతుగా విచారించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ సహాయం కూడా కోరనున్నారు.

దేవుడు చూస్తున్నాడు
రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి, నిందితుడైన సుభాష్ శ్రీవాస్తవ లెక్కింపు ప్రక్రియకు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. విరాళాల పెట్టెల నుండి నగదును బయటకు తీసి, దానిని లెక్కింపు గదికి పంపి, చివరకు ఎస్‌బిఐకి అప్పగించడం అతని బాధ్యత. ఆభరణాలకు సంబంధించి సరైన రికార్డు ఉండేది కాదు.దీనివల్ల విరాళాల దుర్వినియోగం జరిగేది.  

ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి విరాళాలు పక్కదారి మళ్లుతన్నాయనే విషయం తొలిసారి వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. లెక్కింపు బృందంలోని ఒక సభ్యుడు, లెక్కింపు సమయంలో పలువురు డబ్బును కాజేస్తున్నారని ఇన్‌చార్జ్ సుభాష్ శ్రీవాస్తవకు తెలియజేశారు. దీనికి శ్రీవాస్తవ..‘దేవుడు చూస్తున్నాడు. ఇది నీ ఇంట్లో నుంచో నా ఇంట్లో నుంచో పోయేది కాదు కదా’అని బదులిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement