రైలు ప్రయాణంలో స్లీపర్, 3ఏసీ (3AC), 2ఏసీ (2AC), ఫస్ట్ ఏసీ (1AC) వంటి కోచ్‌ల గురించి చాలామందికి అవగాహన ఉంటుంది. అయితే కొన్ని రైళ్లలో కనిపించే 'AB'అనే కోచ్ గుర్తు మాత్రం ప్రయాణికులను తరచూ అయోమయానికి గురి చేస్తుంది. ఇది ప్రత్యేక కోచ్ కాదని, 2ఏసీ, 3ఏసీ విభాగాలను ఒకే కోచ్‌లో కలిపిన కాంబినేషన్ కోచ్ అని భారతీయ రైల్వే చెబుతోంది.
భారతీయ రైల్వేలో సాధారణంగా స్లీపర్ కోచ్‌లకు 'S', థర్డ్ ఏసీకి 'B', సెకండ్ ఏసీకి 'A' అనే కోడ్‌లు ఉంటాయి. అయితే కొన్ని రైళ్లలో ప్రయాణికుల డిమాండ్, కోచ్‌ల అందుబాటు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని 'AB' కోచ్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక భాగం 2ఏసీ ప్రయాణికులకు, మరో భాగం 3ఏసీ ప్రయాణికులకు కేటాయిస్తారు.
ఒకే బెర్త్ నంబర్ రెండు చోట్ల..
AB కోచ్‌లో ఎక్కువగా గందరగోళం సృష్టించే అంశం బెర్త్ నంబర్లే. ఉదాహరణకు బెర్త్ నంబర్ 3 ఒకటి 2ఏసీ విభాగంలో ఉండగా, మరో బెర్త్ నంబర్ 3, 3ఏసీ విభాగంలో కూడా ఉండొచ్చు. అందువల్ల ప్రయాణికులు బెర్త్ నంబర్‌తో పాటు టికెట్‌లో పేర్కొన్న క్లాస్ (2AC లేదా 3AC)ను తప్పనిసరిగా పరిశీలించాలి.
మీ సీటును ఎలా గుర్తించాలి?
టికెట్‌లో 2AC అని ఉంటే కోచ్‌లోని 2ఏసీ విభాగానికే వెళ్లాలి. అక్కడ దిగువ, ఎగువ బెర్త్‌లు మాత్రమే ఉంటాయి. మిడిల్ బెర్త్ ఉండదు. అదే 3AC టికెట్ అయితే 3ఏసీ భాగంలో సీటు ఉంటుంది. అక్కడ సాధారణంగా దిగువ, మధ్య, ఎగువ బెర్త్‌లతో పాటు సైడ్ బెర్త్‌లు ఉంటాయి.

కోచ్‌ను చూసి కూడా గుర్తించొచ్చు
2ఏసీ విభాగంలో ఎక్కువ ప్రైవసీ కోసం బెర్త్‌లకు కర్టెన్లు (కొన్ని రైళ్లలో రైల్వే నిబంధనల ప్రకారం అందుబాటులో ఉంటే) లేదా ప్రత్యేక విభజన ఉంటుంది. 3ఏసీ భాగంలో మాత్రం ఓపెన్ బే తరహా అమరిక కనిపిస్తుంది. దీంతో కోచ్‌లోకి వెళ్లిన వెంటనే ఏ విభాగంలో ఉన్నారో గుర్తించడం సులభమవుతుంది.
టికెట్‌లో కోచ్ నంబర్, క్లాస్, బెర్త్ వివరాలు స్పష్టంగా ఉన్నప్పటికీ సందేహం వస్తే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) లేదా కోచ్ అటెండెంట్‌ను సంప్రదించడం మంచిది. దీంతో తప్పు సీటులో కూర్చోవడం, ఇతర ప్రయాణికులతో అనవసర ఇబ్బందులు ఎదురుకావడం వంటి సమస్యలను నివారించవచ్చు.
అయితే అన్ని రైళ్లలోనూ ఈ AB కోచ్ ఉండదు. ప్రయాణికుల డిమాండ్, రైలు రేక్ అమరిక (Coach Composition) ఆధారంగా మాత్రమే భారతీయ రైల్వే ఇలాంటి కాంబినేషన్ కోచ్‌లను ఉపయోగిస్తుంది. అందువల్ల టికెట్‌లో క్లాస్, కోచ్, బెర్త్ వివరాలను ముందుగానే పరిశీలించుకోవడం సురక్షితమైన ప్రయాణానికి కీలకం.


