ఐఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. యాపిల్‌ కొత్త ప్లాన్! | Apple Upgrade Program iPhone Monthly Leasing Plan | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. యాపిల్‌ కొత్త ప్లాన్!

Jul 22 2026 3:09 PM | Updated on Jul 22 2026 4:00 PM

Apple Upgrade Program iPhone Monthly Leasing Plan

ఐఫోన్‌, ఐప్యాడ్‌, యాపిల్‌ వాచ్‌.. ఇలా యాపిల్‌ ఉత్పత్తులను వాడాలని మోజు చాలా మందికి ఉంటుంది. కానీ అధిక ధరల కారణంగా అందిరికీ వాటిని కొనే స్తోమత ఉండదు. అలాంటి వారికీ ఓ అవకాశం తీసుకొస్తోంది యాపిల్‌ సంస్థ. యాపిల్ ఉత్పత్తులు కొనాలంటే ఒకేసారి భారీ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయడానికి కంపెనీ కొత్త అడుగు వేస్తోంది.

అమెరికాలో జూలై 28 నుంచి  ‘యాపిల్‌ అప్‌గ్రేడ్‌’ (Apple Upgrade) పేరుతో కొత్త డివైస్ లీజింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఈ పథకం కింద వినియోగదారులు ఐఫోన్‌, మ్యాక్‌, ఐప్యాడ్‌, యాపిల్ వాచ్ వంటి పరికరాలను పూర్తి ధర చెల్లించకుండా నెలవారీ వాయిదాల రూపంలో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ధ్రువీకరించాయి.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఐఫోన్‌ అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌ను మరింత విస్తరించి, దాదాపు అన్ని ప్రధాన యాపిల్ ఉత్పత్తులను ఈ కొత్త పథకంలో చేర్చనున్నారు. ఐఫోన్‌లు, యాపిల్ వాచ్‌లకు 24 నెలలు, మ్యాక్‌లు, ఐప్యాడ్‌లకు 36 నెలల లీజు కాలాన్ని నిర్ణయించనున్నట్లు సమాచారం. లీజు గడువు పూర్తయ్యాక వినియోగదారులు మిగిలిన మొత్తాన్ని చెల్లించి పరికరాన్ని సొంతం చేసుకోవచ్చు. లేకపోతే కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ కావచ్చు లేదా పరికరాన్ని తిరిగి ఇచ్చి లీజును ముగించవచ్చు. కొన్ని లావాదేవీలపై అదనపు ఫీజు ఉండే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి.

ఈ కార్యక్రమం కోసం యాపిల్ స్వీడన్‌కు చెందిన బై నౌ పే లేటర్‌ సంస్థ క్లార్నాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రుణ నిర్వహణ, ఫైనాన్సింగ్ బాధ్యతలను క్లార్నా చూసుకోనుండటంతో యాపిల్‌పై ఆర్థిక భారం తగ్గనుంది. ప్రారంభ దశలో ఈ సర్వీస్‌​ అమెరికాలోని యాపిల్ రిటైల్ స్టోర్లు, అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అందుబాటులోకి రానుంది.

అయితే అన్ని ఉత్పత్తులు ఈ పథకానికి అర్హత పొందవు. యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ, ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్‌, ఐఫోన్‌ 16, మ్యాక్‌బుక్‌ నియో వంటి కొన్ని మోడళ్లను మినహాయించే అవకాశం ఉంది. అలాగే వ్యాపార, విద్యా సంస్థల కొనుగోళ్లకు ఈ పథకం వర్తించదని సమాచారం. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న ఐఫోన్‌ అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌లో లభించే యాపిల్‌కేర్‌+ రక్షణ ఈ కొత్త లీజింగ్ పథకంలో డిఫాల్ట్‌గా ఉండదు. అవసరమైతే వినియోగదారులు దాన్ని విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఇటీవల మెమరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు పెరగడంతో యాపిల్ కొన్ని మ్యాక్‌, ఐప్యాడ్ ఉత్పత్తుల ధరలను పెంచింది. ప్రీమియం పరికరాల అధిక ధరల ప్రభావాన్ని తగ్గించి, వినియోగదారులకు తక్కువ నెలవారీ చెల్లింపులతో కొనుగోలు అవకాశం కల్పించడం ద్వారా విక్రయాలను పెంచాలన్నదే ఈ కొత్త 'యాపిల్‌ అప్‌గ్రేడ్‌' ప్రోగ్రామ్ వెనుక ప్రధాన ఉద్దేశమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం అమెరికాకే పరిమితమైనప్పటికీ, భవిష్యత్తులో ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉండొచ్చు. అయితే దీనిపై యాపిల్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement