దేశీయ విమానయాన రంగంలో పోటీతత్వాన్ని పెంచేందుకు, ప్రయాణికులకు మరింత మెరుగైన అవకాశాలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన మార్పుపై కసరత్తు చేస్తోంది. విమానాశ్రయాలను నిర్మించి, నిర్వహించే ప్రైవేటు సంస్థలే స్వయంగా ఎయిర్‌లైన్స్ (విమానయాన సంస్థలు)ను కూడా స్థాపించేందుకు అనుమతించే ప్రతిపాదనను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.
ప్రస్తుత నిబంధనలు.. ప్రతిపాదిత మార్పులు
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాలను నిర్వహించే సంస్థలు ఏ ఎయిర్‌లైన్‌లోనూ 10 శాతానికి మించి ఈక్విటీ వాటా పొందేందుకు వీలులేదు. సొంత ప్రయోజనాలను అరికట్టేందుకు గతంలో ఈ నిబంధనను విధించారు. అయితే, ఇప్పుడు ఈ పరిమితులను సడలిస్తే ముంబై సహా 8 విమానాశ్రయాలను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్, ఢిల్లీ సహా పలు ఎయిర్‌పోర్ట్‌లను నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ వంటి దిగ్గజ సంస్థలకు సొంతంగా ఎయిర్‌లైన్స్ ప్రారంభించే మార్గం సుగమమవుతుంది.
ద్వంద్వ ఆధిపత్యంపై దెబ్బ!
గడిచిన దశాబ్దకాలంలో జెట్ ఎయిర్‌వేస్, గో ఫస్ట్ వంటి సంస్థలు మూతపడటం, టాటా గ్రూప్‌లో విస్తారా విలీనమవ్వడంతో భారత విమానయాన రంగం ప్రధానంగా రెండు ప్రధాన సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇండిగో, ఎయిర్ ఇండియాలు కలిపి ప్రస్తుతం దేశీయ విమాన ప్రయాణికుల మార్కెట్‌లో ఏకంగా 90 శాతం సామర్థ్యాన్ని ఆక్రమించాయి. ఈ ద్వంద్వ ఆధిపత్యం వల్ల పోటీ తగ్గుతోందనే ఆందోళనలున్నాయి. కొత్త విధానం ద్వారా పెట్టుబడిదారులను ఆహ్వానించి మార్కెట్‌లో పోటీని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రతిపాదన పరిశ్రమ పరంగా సానుకూలమైనప్పటికీ అమలులో సవాళ్లు ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఎయిర్‌పోర్ట్ యజమానులే విమానాలను నడిపితే.. ప్రైమ్ ల్యాండింగ్/టేకాఫ్ స్లాట్‌ల కేటాయింపు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, టెర్మినల్ స్పేస్ వంటి కీలక అంశాల్లో సొంత ఎయిర్‌లైన్స్‌కే మొదటి ప్రాధాన్యత ఇచ్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
కేబినెట్ ఆమోదం తదుపరి అడుగు
ఈ విధాన సవరణ అమలులోకి రావడానికి న్యాయ మంత్రిత్వ శాఖ క్లియరెన్స్‌తో పాటు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించాల్సి ఉంది. 2047 నాటికి దేశంలో విమానాశ్రయాల సంఖ్యను 350కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న వేళ కేంద్రం తీసుకునే ఈ నిర్ణయం భారత పౌర విమానయాన భవిష్యత్తును మార్చే అవకాశముంది.
ఇదీ చదవండి: ఒక్కరోజులో ధరలు అమాంతం ఇలా..


