దేశీయ నౌకాయాన రంగంలో వ్యూహాత్మకమైన విజింజం అంతర్జాతీయ పోర్టులో అదానీ గ్రూప్ తన 49 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్న తరుణంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదిత వాటా విక్రయం వల్ల రాష్ట్ర ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు కేరళ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి
కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి సతీశన్ విలేకరులతో మాట్లాడారు. విజింజం పోర్టు కేరళ ఆర్థిక ప్రగతికి కీలకమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయాన్నీ ప్రభుత్వం తీసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో కథనాలు వచ్చేంత వరకు అదానీ గ్రూప్ తలపెట్టిన ఈ వాటా బదిలీ వ్యవహారం తమ ప్రభుత్వ దృష్టికి రాలేదని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ షిప్పింగ్ దిగ్గజం ఎంఎస్‌సీ గ్రూప్‌తో అదానీ సంస్థ దాదాపు ఏడాది కాలంగా ఈ వ్యవహారంపై చర్చలు జరుపుతోందనే నిజాన్ని ప్రభుత్వం ఆ తర్వాతే గుర్తించిందని ఆయన వెల్లడించారు.
‘వాటా బదిలీకి సంబంధించిన ప్రతిపాదనను అదానీ గ్రూప్ సెబీకి సమర్పించిన రోజే.. ముందస్తుగా రాష్ట్రానికి సమాచారం ఇవ్వకపోవడంపై అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేశాం. ఆ తర్వాతే కన్సెషన్ ఒప్పంద నిబంధనల ప్రకారం వాటా బదిలీకి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరుతూ అదానీ గ్రూప్ అధికారికంగా ప్రభుత్వం వద్దకు వచ్చింది’ అని ముఖ్యమంత్రి అన్నారు.
గుత్తాధిపత్యం అసాధ్యం
విపక్ష నేత పినరయి విజయన్ చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి పూర్తిగా కొట్టిపారేశారు. విజయన్ అసలు కన్సెషన్ అగ్రిమెంట్ (రాయితీ ఒప్పందం) చదవకుండానే గుడ్డిగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ డీల్ వల్ల ఎమ్మెస్సీ గ్రూప్ గుత్తాధిపత్యం ఏర్పడుతుందన్న వాదనలో వాస్తవం లేదన్నారు. ఏ ఒక్క సంస్థా దీనిపై పూర్తి ఆధిపత్యం చలాయించలేదని సీఎం స్పష్టం చేశారు.
కేంద్ర అనుమతులు వస్తేనే డీల్ పూర్తి!
ప్రస్తుతానికి వాటా బదిలీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, కాబట్టి రాయితీ ఒప్పందాన్ని అదానీ గ్రూప్ ఉల్లంఘించిందని చెప్పలేమని సీఎం వివరించారు. ఈ లావాదేవీ ముగియాలంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మాత్రమే సరిపోదని.. దీనికి అనేక రకాల భద్రతా, వ్యూహాత్మక కోణాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే..


