రాబోయే వరుస పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలో వంటనూనెల కొరత తలెత్తకుండా ప్రభుత్వం, దేశీయ రిఫైనరీలు ముందస్తు చర్యలను వేగవంతం చేశాయి. రాబోయే జులై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సగటున నెలకు 15 లక్షల టన్నుల చొప్పున వంటనూనెలను దిగుమతి చేసుకోవడానికి రంగం సిద్ధమైంది. వినాయక చవితి, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల సమయంలో స్వీట్లు, పిండివంటల తయారీతో వంటనూనెలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో మార్కెట్లో కొరత ఏర్పడకుండా స్థిరమైన ధరలను నిర్వహించడమే లక్ష్యంగా దిగుమతుల పరిమాణాన్ని భారీగా పెంచుతున్నారు.
దేశీయ సరఫరా తగ్గుదల..
ప్రస్తుతం దేశీయంగా సోయాబీన్, ఆవాల (రేప్‌సీడ్) క్రషింగ్ కార్యకలాపాలు మందగించడంతో స్థానికంగా నూనెల లభ్యత తగ్గింది. ఈ లోటును పూడ్చడానికి పండుగల నాటి గరిష్ఠ డిమాండ్‌ను తట్టుకోవడానికి దిగుమతులే ఏకైక మార్గంగా మారాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వి.మెహతా తెలిపారు. దీంతో దేశీయ రిఫైనర్లు పామ్ ఆయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లపై భారత డిమాండ్ ప్రభావం
ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను దిగుమతి చేసుకునే భారతదేశం ఈ స్థాయిలో కొనుగోళ్లు చేపట్టడం గ్లోబల్ కమొడిటీ మార్కెట్లపై స్పష్టమైన ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియాల నుంచి క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతులు పుంజుకోనున్నాయి. అర్జెంటీనా, బ్రెజిల్‌ల నుంచి సోయా ఆయిల్, రష్యా-ఉక్రెయిన్‌ల నుంచి పొద్దుతిరుగుడు నూనె సరఫరాలు పెరగనున్నాయి. భారత్ నుంచి పెద్దమొత్తంలో ఆర్డర్లు రావడంతో ఇండోనేషియా, మలేషియాల్లో నిల్వలు తగ్గి మలేషియన్ పామ్ ఆయిల్, గ్లోబల్ సోయా ఆయిల్ ఫ్యూచర్స్ ధరలకు అంతర్జాతీయ మార్కెట్‌లో బలమైన మద్దతు లభిస్తోంది.
భారతదేశం తన మొత్తం వంటనూనెల అవసరాలలో దాదాపు 55-60% వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. పండుగల సీజన్‌లో సామాన్యులపై ధరల భారం పడకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించాలి. సుదీర్ఘ కాలంలో దిగుమతులను తగ్గించుకోవడానికి నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ ద్వారా దేశీయంగా నూనె గింజల సాగు విస్తీర్ణాన్ని, ఉత్పాదకతను పెంచడంపై కేంద్రం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి: ఒక్కరోజులో ధరలు అమాంతం ఇలా..


