శుభాకాంక్షల ముసుగులో సైబర్ ఉచ్చు..
చలానా పేరుతో నయా దగా
వాట్సాప్‌లో వచ్చే ‘ఏపీకే ’ ఫైళ్లే డిజిటల్ దొంగల ఆయుధాలు
క్షణాల్లో బ్యాంక్ బ్యాలెన్స్ హుష్ కాకి!
పండగ వేళ పంజా విసురుతున్న కేటుగాళ్లు
పార్వతీపురం రూరల్:
అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు అమాయకుల పాలిట సైబర్ ఉచ్చులా మారుతోంది. సాంకేతికతను సామాన్యుడు సౌకర్యం కోసం వాడుకుంటుంటే, సైబర్ నేరగాళ్లు మాత్రం దానినే వలగా మారుస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ నిబంధనల పేరుతో భయపెడుతునో, మరోపక్క పండగ వేళ ఆప్యాయంగా శుభాకాంక్షలు చెబుతునో జనాల జేబులకు చిల్లులు పెడుతున్నారు. వాట్సాప్ వేదికగా ‘ఏపీకే ’ ఫైళ్ల రూపంలో వస్తున్న ఈ కొత్త రకం మోసం ఇప్పుడు కలకలం రేపుతోంది.
కంగారు పడేలా చేయడమే మొదటి ఎత్తుగడ
‘అయ్యో! నా బండికి చలానా పడిందా? రెడ్ లైట్ క్రాస్ చేశానా?’ అని సామాన్యుడు కంగారు పడేలా చేయడమే ఈ కేటుగాళ్ల మొదటి ఎత్తుగడ. వాహనదారుల ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా అచ్చం పోలీసుల నుంచి వచ్చినట్లుగా ఒక సందేశం వస్తుంది. మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని, అందుకు సంబంధించిన ఫొటోలు, ఆధారాలు చూడాలంటే కింద ఉన్న ఫైల్‌ని డౌన్లోడ్ చేసుకోవాలని ఆ మెసేజ్ సారాంశం. పోలీసులు పంపారేమో అనే భయం, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆత్రుతతో జనం ఆ లింక్ లేదా ఫైల్‌పై క్లిక్ చేస్తున్నారు.
ప్లే స్టోర్‌లో కాకుండా, ఇలా బయట నుంచి వచ్చే ఈ ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోగానే, ఫోన్‌లోకి ప్రవేశించే మాల్వేర్ ఫోన్‌ను పూర్తిగా వారి ఆ«దీనంలోకి తీసుకుంటుంది. క్షణాల్లో మొబైల్ హ్యాక్ అవుతుంది. ఇదిలా ఉంటే.. సంక్రాంతి, క్రిస్మస్, నూతన సంవత్సర వేళల్లో మన వాళ్లకి శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీ. ఇదే అదనుగా సైబర్ మాయగాళ్లు మరో వేషం కడుతున్నారు. 2026 విషెస్ కోసం ఈ యాప్ వేసుకోండి, సంక్రాంతి గ్రీటింగ్స్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..అంటూ ఆకర్షణీయమైన లింకులు పంపిస్తున్నారు. తీపి కబురు అనుకొని ఆశగా క్లిక్ చేస్తే.. అది చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. ప్లే స్టోర్‌లో లేని ఈ థర్డ్ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే, నట్టింట్లో దొంగను కూర్చోబెట్టినట్టేనని సైబర్ నిపుణులు నెత్తీ నోరు బాదుకుంటున్నారు.
‘ఏపీకే’ ఫైళ్లను ఓపెన్ చేయకండి..
ప్రజలారా తస్మాత్ జాగ్రత్త! ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్‌లో లేని ఏ యాప్‌నూ పొరపాటున కూడా డౌన్లోడ్ చేయవద్దు. ముఖ్యంగా వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైళ్లను అస్సలు ఓపెన్ చేయకండి. ఒకవేళ నిజంగా చలానా పడిందో లేదో తెలుసుకోవాలంటే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లోనే చెక్ చేసుకోవాలి తప్ప, ఇలాంటి లింకులను నమ్మవద్దు. ఎవరైనా మోసపోతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
వచ్చే బ్యాంక్ ఓటీపీలు నేరుగా వాళ్లకే వెళ్లిపోతాయి
ఒకసారి ఆ అప్లికేషన్ మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యిందంటే చాలు.. ఇక ఆ ఫోన్ మన చేతిలో ఉన్నా, దాని కంట్రోల్ అంతా ఆన్‌లైన్ నేరగాడి చేతిలో ఉంటుంది. మనకు వచ్చే బ్యాంక్ ఓటీపీలు నేరుగా వాళ్లకే వెళ్లిపోతాయి. మన ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము హుష్ కాకి అవుతుంది. అంతటితో ఆగకుండా, మన ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్ నంబర్ల అందరికీ మన పేరు మీద అదే మోసపూరిత లింక్ వెళ్లిపోతుంది. దీంతో మన బంధువులు, మిత్రులు కూడా మనమే పంపామని నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది.
ఉచ్చులో పడొద్దు!
ప్రస్తుతం పండగ సమయాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆర్టీఓ చలానా పేరుతోనో, శుభాకాంక్షల యాప్ పేరుతోనో వాట్సాప్ ద్వారా వచ్చే ‘ఏపీకే ’ ఫైళ్లను ఏ మాత్రం నమ్మవద్దు. ప్రభుత్వం తరఫున, పోలీస్ శాఖ తరఫున ఎప్పుడూ ఇలాంటి అజ్ఞాత లింకులు లేదా ఏపీకే ఫైళ్లు పంపడం జరగదు. ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తుల్లా మెసేజ్ చేసి ఈ ఫైళ్లు పంపినా, పొరపాటున కూడా వాటిని తెరిచి ఇన్‌స్టాల్ చేయకూడదు. ఎందుకంటే.. ఈ ఫైళ్లు మీ మొబైల్ ఫోన్‌ను పూర్తిగా హ్యాక్ చేసి, మీ బ్యాంక్ ఖాతా వివరాలను, ఓటీపీలను దొంగిలించే ప్రమాదం ఉంది.
మీ మొబైల్‌లో ప్లే స్టోర్ నుంచి మాత్రమే అప్లికేషన్‌లను డౌన్లోడ్ చేసుకోండి. అనుమానాస్పద లింకులు, ఆఫర్లకు దూరంగా ఉండండి. ఒకవేళ ఎవరైనా మోసానికి గురైతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930కి కాల్ చేయండి లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. త్వరితగతిన ఫిర్యాదు చేస్తే, పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. – ఎస్వీ మాధవ్‌రెడ్డి, ఎస్పీ, పార్వతీపురం మన్యం


