సాక్షి, అమరావతి: ‘‘రాయలసీమ ఎత్తిపోతల పథకాన్నీ.. నేను చెప్తే చంద్రబాబు ఆపారని.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.. ఇది వాస్తవమా? కాదా? అని మండలిలో ప్రశ్నించాం. దీనిపై సరైన సమాధానం చెప్పడం లేదు’’ అంటూ శాసనమండలి విపక్ష నేతబొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనేదే తమ డిమాండ్ అంటూ స్పష్టం చేశారు.
‘‘తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన వ్యాఖ్యలను ఖండించలేదంటే ఆర్థిక శాఖ మంత్రి దానికి వత్తాసు పలికినట్టే.. అధికారం ఉపయోగించుకుని రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. విలువలను తాకట్టు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాట అబద్దం అని ఎందుకు చెప్పటం లేదు?. వ్యక్తిగత స్వార్థాలు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం.. మాకు అందరితో పరిచయాలు ఉన్నాయి.. అవి అనుబంధం వరకే. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని బొత్స నిలదీశారు.
‘‘రాజమండ్రిలో కల్తీ పాలపై ప్రభుత్వం చర్చ జరపడం లేదు. చట్టాన్ని రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. లడ్డులో జంతు కొవ్వు ఉందని చంద్రబాబు చెప్పారు.. కోర్టు వేసిన సిట్ నిగ్గు తేల్చింది. 329 రూపాయలకు హిందూపూర్ డెయిరీ ఉంటే.. ఈరోజు టీటీడీ 650 రూపాయలు కొంటుంది.. హిందూపూర్ డెయిరీకి.. హెరిటేజ్‌కి ఉన్న సంబంధం అదే. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నారు.. ఇప్పుడు కో యూనిట్ అంటున్నారు.. డిప్యూటీ సీఎం పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా ఈరోజు ఎందుకు చర్చించలేదు.
..ఆ దేవదేవుడు కూడా ఇటువంటి దోపిడీలను క్షమించడు. ఈ దోపిడిని అరికట్టాలి. వైఎస్సార్ ఏడుకొండలు జీవో ఇచ్చారు. ఏడుకొండలపై ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. 2016లో.. మజ్జిగ సైతం హెరిటేజ్‌లో కొనాలని జీవో ఇచ్చారు. చంద్రబాబు బుర్ర ఏ విధంగా పనిచేస్తుందో అనేదానికి ఇదే నిదర్శనం. మండలిలో ఎందుకు చర్చించడం లేదు.
..విజయవాడలో పుష్కరాల పేరు చెప్పి చంద్రబాబు ఎన్ని గుళ్లు కూల్చేశారు. శ్రీశైలంలో లాఠీఛార్జి జరిగింది.. ఎవరిని సస్పెండ్ చేశారు. మీకు దేవుడిపైన దేవాలయాల పైన నమ్మకం లేదు.. కేవలం రాజకీయాలు కుర్చీలపైనే. ప్రజలను దగా చేయడం మోసం చేయడమే మీ ఎజెండా. చంద్రబాబు ధన దాహం కోసం దేవదేవుడు ప్రసాదాన్ని సైతం అవమానించారు. దేవదేవుడు ప్రసాదంపైనే అపోహలు సృష్టించారు.
..చంద్రబాబు నీ వయసుకి గాని ఆ ముఖ్యమంత్రి పదవి గాని న్యాయమా ఇది.. తప్పుని ఒప్పుకోకుండా ఎన్డీబీ రిపోర్ట్ అంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలోనే నాలుగు ట్యాంకులు పట్టుకోలేదా?. సభలో చర్చ జరిగే వరకు పట్టుబడుతూనే ఉంటాం. చంద్రబాబు మాయ మాటలు, ఊసరవెల్లి మాటలు, ధన దోపిడీ ప్రజలకు తెలిసే వరకు పోరాడతాం. మేము వాకౌట్ చేయలేదు... వారే చైర్మన్ దగ్గరికి వచ్చి హంగామా చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేయటానికి ఇది టీడీపీ ఆఫీస్ కాదు’’ అంటూ బొత్స మండిపడ్డారు.
మండలిలో చర్చ జరగాలన్నదే వైఎస్సార్‌సీపీ డిమాండ్: లేళ్ల అప్పిరెడ్డి
ఈరోజు మండలిలో చీకటి రోజు.. ఇవాళ చర్చజరుపుతామని ఎజెండాలో పెట్టి.. లఘు చర్చలో మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతుంటే.. మంత్రి మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటున్నారు... ఇంతకన్నా దుర్దినం ఉందా?. హెరిటేజ్‌కి సంబంధించి కంపెనీ ఉత్పత్తులను ఏ విధంగా వాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. 1998లోనే హెరిటేజ్ తిరుపతి లడ్డూ నెయ్యి టెండర్లలలో పాల్గొన్నదని సమాచారం ఉంది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. మండలిలో చర్చ జరగాలి. తిరుమల ఏడుకొండల అంశంలో వైఎస్సార్‌పై చంద్రబాబు అభాండాలు వేస్తున్నాడు. ప్రజా కోర్టులో మీరు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. మండలిలో చర్చ జరగాలన్నదే వైఎస్సార్‌సీపీ డిమాండ్


