హైవే లోకల్‌ పాస్‌లు.. ఇక పూర్తిగా ఆన్‌లైన్‌లో! | NHAI Digital Local Toll Pass Online Rajmarg Yatra App Local Pass benefits | Sakshi
Sakshi News home page

హైవే లోకల్‌ పాస్‌లు.. ఇక పూర్తిగా ఆన్‌లైన్‌లో!

Jul 22 2026 6:04 PM | Updated on Jul 22 2026 6:25 PM

NHAI Digital Local Toll Pass Online Rajmarg Yatra App Local Pass benefits

జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే స్థానిక వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) మరో కీలక డిజిటల్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజ్‌మార్గ్‌యాత్ర (RajmargYatra) మొబైల్‌ యాప్‌లో ‘డిజిటల్‌ లోకల్‌ పాస్‌’ సర్వీసును ప్రారంభించింది. దీని ద్వారా అర్హులైన ప్రయాణికులు ఇకపై టోల్‌ ప్లాజాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే నెలవారీ లోకల్‌ టోల్‌ పాస్‌ను పొందవచ్చు.

ప్రస్తుతం ఈ సర్వీస్‌ను ఢిల్లీ అర్బన్‌ ఎక్స్‌టెన్షన్‌ రోడ్‌-IIలోని ముండ్కా–బక్కర్వాలా టోల్‌ ప్లాజా వద్ద ప్రారంభించగా, రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా అర్హత కలిగిన ఇతర టోల్‌ ప్లాజాలకు దశలవారీగా విస్తరించనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది.

ఎవరు అర్హులు?

టోల్‌ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రైవేట్‌ కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులు ఈ లోకల్‌ పాస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి పాస్‌ మంజూరైతే, సంబంధిత టోల్‌ ప్లాజా ద్వారా ఒక నెల పాటు అపరిమిత ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఇందుకోసం టోల్‌ ప్లాజాకు వెళ్లి పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. ఇప్పుడు మొత్తం ప్రక్రియ మొబైల్‌ యాప్‌లోనే కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది.

దరఖాస్తు ఎలా పరిశీలిస్తారు?

వినియోగదారు సమ్మతి ఇచ్చిన తర్వాత రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌ ప్రభుత్వ డిజిటల్‌ వ్యవస్థలతో అనుసంధానమై ధృవీకరణ చేపడుతుంది. డిజిలాకర్‌ ద్వారా చిరునామా వివరాలు, వాహన్‌ డేటాబేస్‌ ద్వారా వాహన రిజిస్ట్రేషన్‌, అనుసంధానమైన ఫాస్‌ట్యాగ్‌  సమాచారం, అలాగే జీఐఎస్‌ ఆధారిత లొకేషన్‌ వెరిఫికేషన్‌ ద్వారా దరఖాస్తుదారు నిజంగా అర్హత ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారో లేదో నిర్ధారిస్తుంది. దీంతో కాగితపు పత్రాల అవసరం తగ్గడంతో పాటు ఆమోద ప్రక్రియ కూడా వేగవంతమవుతుంది.

‘మార్గ్‌మిత్ర’ హెల్ప్‌ సెంటర్‌ కూడా ప్రారంభం

లోకల్‌ పాస్‌తో పాటు ‘మార్గ్‌మిత్ర’ (MargMitra) హెల్ప్‌ సెంటర్‌ను కూడా ఎన్‌హెచ్‌ఏఐ యాప్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది 22 భారతీయ భాషల్లో టెక్స్ట్‌ లేదా వాయిస్‌ ద్వారా సహాయం అందించే డిజిటల్‌ సపోర్ట్‌ ప్లాట్‌ఫామ్‌. ఫాస్‌ట్యాగ్‌ రీఛార్జ్‌, కేవైసీ, రీఫండ్‌ స్థితి, లోకల్‌/వార్షిక పాస్‌లు, బ్లాక్‌లిస్ట్‌ స్టేటస్‌, ఈ-నోటీసులు, అప్పీలు, అలాగే జాతీయ రహదారులపై నిలిచిపోయిన వాహనాలు లేదా ఇతర భద్రతా సమస్యలను నివేదించే సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement