పల్లెదారులకు డిజిటల్‌ కోడ్‌ | Design of internal village road coding and grading system | Sakshi
Sakshi News home page

పల్లెదారులకు డిజిటల్‌ కోడ్‌

Jul 13 2026 3:00 AM | Updated on Jul 13 2026 3:00 AM

Design of internal village road coding and grading system

దేశంతోపాటు రాష్ట్రంలో 10 వేల గ్రామాల నుంచి ఆన్‌లైన్‌లో అభిప్రాయ సేకరణ  

సలహాలు, సూచనలు చెప్పేందుకు 14వ తేదీ వరకు గడువు  

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: దేశంలోని కోట్లాది గ్రామీణుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఆపరేషన్‌ కగార్‌ విజయవంతమైన నేపథ్యంలో గ్రామాలను మరింత వేగంగా చేరుకునేందుకు ఈ బృహత్తర ప్రాజెక్టు చేపట్టింది. గ్రామీణ రోడ్లను బలోపేతం చేసి వాటిని జిల్లా, జాతీయ రోడ్లతో కలిపే గ్రామ అంతర్గత రోడ్‌ కోడింగ్‌ అండ్‌ గ్రేడింగ్‌ విధానానికి రూపకల్పన చేసింది. ఫలితంగా మారుమూల పల్లెటూరు రోడ్లకు సైతం డిజిటల్‌ నంబర్లు కేటాయించి మ్యాపింగ్‌ చేస్తారు. తద్వారా ప్రతీ పల్లెటూరులోని రోడ్డుకు ఒక విశిష్ట గుర్తింపు ఉంటుంది. 

మొన్నటివరకూ గ్రామాల్లో నావిగేషన్‌ గుర్తింపు కష్టంగా ఉండేది. ఫలితంగా పోలీసు, ఫైర్, అంబులెన్స్, పోస్టల్‌ సిబ్బంది సకాలంలో గమ్యాన్ని చేరుకునేందుకు ఇబ్బంది పడేవారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇకపై ఆ కష్టాలేవీ ఉండవు. ఈ ప్రాజెక్టును మరింత ప్రభావ వంతంగా అమలు చేసేందుకు ప్రజా సంప్రదింపుల డాక్యుమెంట్‌ (కన్సల్టేషన్‌ డాక్యుమెంట్‌)ను విడుదల చేసింది. దీని ని జూన్‌ 24 నుంచి ప్రారంభించగా.. గడువు ఈ నెల 14తో ముగియనుంది. స్థానిక సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామీణుల నుంచి ఈ సలహాలు, సూచనలను కోరింది. 

తెలంగాణలో 10 వేలకుపైగా పల్లెలు  
ఈ పథకం విజయవంతంగా అమలైతే తెలంగాణలోని దాదాపు 10,954 పల్లెలకు కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల నుంచి మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి, మంచిర్యాల వంటి సరిహద్దు, అటవీ ప్రాంతాలున్న జిల్లాలకు మున్ముందు మరింత మెరుగైన సేవలు అందుతాయి. తపాలాశాఖకు చెందిన డిజిపిన్‌ జియోస్పేషియల్‌ టెక్నాలజీని వాడుతూ గ్రామ మంచిత్ర పోర్టల్‌ ద్వారా అనుసంధానిస్తూ ప్రక్రియ సాగుతోంది. దీనివల్ల ప్రతీ పల్లెటూరు రహదారికి ప్రత్యేక డిజిటల్‌ గుర్తింపు లభిస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement