2020లో మొదలైనా మరీ మందకొడిగా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ
26.76 లక్షల దరఖాస్తుల్లో 3.20 లక్షలకే తుది ప్రొసీడింగ్స్
ఫీజులు చెల్లించని దరఖాస్తుదారులు
25% రాయితీ ప్రకటించినా స్పందన అంతంతే.. రుసుము చెల్లించినా పెండింగ్‌లోనే వేలాది దరఖాస్తులు
ఒకవైపు క్షేత్రస్థాయిలో సమస్యలు.. మరోవైపు సిబ్బంది కొరత
నెలాఖరుకు ముగియనున్న రాయితీ గడువు
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన అనధికార లే ఔట్లను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్’(ఎల్‌ఆర్‌ఎస్) అమలు ఆరేళ్లుగా కొలిక్కి రావడం లేదు. 2020లో ఆగస్టులో ఎల్‌ఆర్‌ఎస్ కింద అనధికార లే ఔట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ కోరుతూ 26 లక్షలకు పైగా దరఖాస్తులు అందినా ఇప్పటివరకు కేవలం 3.20 లక్షల దరఖాస్తులు మాత్రమే పూర్తి స్థాయిలో పరిష్కారమయ్యాయి. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ముందుకు సాగక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణకు చెల్లించాల్సిన ఫీజులో ఈ నెల 31 వరకు 25 శాతం రాయితీని ప్రకటించింది. అయితే రాయితీ గడువు ముగుస్తున్నా దరఖాస్తుదారుల నుంచి అంతంత మాత్రంగానే స్పందన కనిపిస్తోంది. రాయితీ ప్రకటనతో దరఖాస్తుదారులు భారీగా ముందుకు వచ్చి రెగ్యులరైజేషన్ ఫీజు చెల్లిస్తారని, రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావించినా రూ.80 కోట్ల మేర మాత్రమే వసూలైనట్లు సమాచారం. ఫీజు చెల్లింపులకు అంతంత మాత్రం స్పందన, భౌతిక తనిఖీలు, రికార్డుల పరిశీలన, సాంకేతిక సమస్యలు, వివాదాల కారణంగా దరఖాస్తుల పరిష్కారం నత్తనడకన సాగుతోంది.
దరఖాస్తుల వెల్లువ.. చెల్లింపుల్లో వెనుకంజ
అనధికార లే ఔట్ల క్రమబద్ధీకరణ పథకం 2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్టర్ అయిన ప్లాట్లు, లే ఔట్లకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో హెచ్‌ఎండీఏతో పాటు జీహెచ్‌ఎంసీ, ఇతర మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో రెగ్యులరైజేషన్ కోరుతూ 26.76 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో 21.63 దరఖాస్తులను పరిశీలించి రెగ్యులరైజేషన్ కింద కట్టాల్సిన ఫీజు వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేశారు. ఇందులో కేవలం 7.20 లక్షల మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. అయితే 3.20 లక్షల మందికి మాత్రమే తుది ప్రొసీడింగ్‌లు ఇచ్చారు. అంటే ఈ దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయన్న మాట. ఇటు ప్రభుత్వ పరంగా, మరోవైపు దరఖాస్తుదారుల పరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ కొలిక్కి రావడం లేదు.
దరఖాస్తులు లోపాల పుట్టగా ఉండటం, రెగ్యులరైజేషన్ ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులు ముందుకు రాకపోవడాన్ని అధికారులు కారణంగా చూపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ, అసైన్డ్ భూములు, కోర్టు వివాదాలు, ఎఫ్‌టీఎల్ పరిధిలోని భూములను క్రమబద్ధీకరణకు కూడా దరఖాస్తులు అందినట్లు అధికారులు చెప్తున్నారు. తాము ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా క్షేత్ర స్తాయి తనిఖీలు జరగకపోవడం, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడంలో సాంకేతిక సమస్యలు, చెల్లించాల్సిన ఫీజుపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలతో తమ దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. 
క్షేత్ర స్థాయిలో సమస్యలు
అనధికార లే ఔట్లలో కొన్నిచోట్ల కొత్త కాలనీలు ఏర్పాటు కాగా, చాలావరకు అభివృద్ధికి నోచుకోలేదు. పిచ్చి మొక్కలతో కొన్ని లే ఔట్లు చిట్టడవిని తలపిస్తున్నాయి. ఫీజు చెల్లించిన దరఖాస్తుదారుల ప్లాట్లను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో వాటి హద్దులను గుర్తించడం సిబ్బందికి కష్టతరంగా మారింది. ప్లాట్లు పలుమార్లు చేతులు మారడం, యజమానులు చిరునామాలు మార్చడం, వలస వెళ్లడం వంటి కారణాలతో దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మరోవైపు టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత కూడా అడ్డంకిగా మారింది. కొందరు దరఖాస్తుదారులు రెగ్యులరైజేషన్‌కు అవసరమైన సేల్ డీడ్, లే ఔట్ ప్లాన్ కాపీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్, ఆధార్ కార్డు వంటి పత్రాల్లో కొన్నింటిని మాత్రమే అప్‌లోడ్ చేయడంతో రెగ్యులరైజేషన్ ముందుకు సాగడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్ కొలిక్కి వస్తే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు కూడా ఆస్తి పన్ను రూపంలో ఆదాయం పెరిగే అవకాశముంది. మరోవైపు ప్లాట్ల కొనుగోలు, అమ్మకాలు, బ్యాంకు రుణాలు, నిర్మాణ అనుమతుల్లో వేగం పెరిగి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు.
రాయితీ గడువు పెంచే చాన్స్ లేదు!
ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంచుతూ, 2020 నాటి నిబంధనలను సవరిస్తూ ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు, చార్జీల చెల్లింపుపై 25 శాతం రాయితీ ఇచ్చేందుకు గత ఏప్రిల్ 29న ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.131 జారీ చేసింది. ఈ రాయితీ 2026 మే 1 నుంచి జూలై 31 వరకు అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తారని భావించినా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మరో 20 రోజుల్లో రాయితీ గడువు ముగుస్తున్నప్పటికీ తిరిగి పొడిగించే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు.
రాయితీపై సందేశాలు పంపిస్తున్నాం..
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకోవాల్సిందిగా దరఖాస్తుదారులకు సందేశాలు పంపిస్తున్నాం. దరఖాస్తుల పరిష్కారంలో ఎదురవుతున్న సాంకేతిక, ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం.
– ఎస్.దేవేందర్‌రెడ్డి, డైరక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్
ఫీజు చెల్లించినా అనుమతి రాలేదు
మా గ్రామం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనమైంది. 2020లో ప్లాట్ రెగ్యులరైజేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాం. ఇందుకు సంబంధించిన ఫీజును కూడా చెల్లించాం. ఇప్పటివరకు అనుమతులు రాలేదు. సమస్య ఏంటని అధికారులను అడిగితే.. విలీన గ్రామం కావడంతో కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, ప్లాట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా పూర్తి స్థాయిలో లేవని సమాధానం చెబుతున్నారు. కొన్ని డాక్యుమెంట్లు ఇటీవల ఇచ్చాం. అయినప్పటికీ పని పూర్తి కాలేదు. ఒక డిపార్ట్‌మెంట్ అధికారిని అడిగితే మరో డిపార్ట్‌మెంట్ వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు.
– శేఖర్, దివిటిపల్లి, మహబూబ్‌నగర్
4,500 మంది ఆచూకీ లేదు
జనగామ మున్సిపాలిటీలో 18,065 మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13,607 మందికి రెగ్యులరైజేషన్ సమాచారం పంపారు. ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తిచేసి 1,996 మందికి ప్రోసిడింగ్ ఇచ్చినా, 295 మంది మాత్రమే పూర్తి ఫీజు చెల్లించి సబ్ రిజి్రస్టా్టర్ కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. ఇక సుమారు 4,500 మంది దరఖాస్తుదారుల అడ్రస్ దొరకడం లేదు. ప్లాట్లు చేతులు మారడం, మరణాలు, వలసలు వంటి కారణాలతో అందరికీ సమాచారం ఇవ్వలేకపోతున్నట్లు అధికారులు చెప్తున్నారు.


