సాక్షి, హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్‌కౌంటర్ల పేరుతో తెలంగాణ పిల్లలని కాల్చి చంపిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ బిడ్డల రక్తంతో కాంగ్రెస్ చేతులు తడిచాయన్నారు. నెత్తురు ఇస్తేనే నీళ్లిస్తామంటే అందుకు తాము సిద్ధమని.. మీ రక్తదాహం తీర్చుకొని పొలాల జలదాహం తీర్చండన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన రక్తం వ్యాఖ్యలపై కేటీఆర్ హైదరాబాద్‌లో మాట్లాడుతూ ఘాటుగా బదులిచ్చారు.
కేటీఆర్ మాట్లాడుతూ'' నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా.. రక్త పిశాచీ! ఇంకా తీరలేదా మీ రక్తదాహం ? 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా..సరిపోలేదా? తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి? తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు! 1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్ల జూశారు. 1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు" అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచాయని మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్నారు. కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై..! మీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, రైతులకు దయచేసి నీళ్లు ఇవ్వమని కేటీఆర్ విమర్శించారు.
తాము పేగులు తెగే దాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లమని రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామని తాము నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లమని నెత్తురు ఇస్తేనే.. నీళ్లు ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తామని కాంగ్రెస్ పార్టీనుద్దేశించి తీవ్ర పదజాలంతో విమర్శించారు.


