ముఖవర్చస్సు కోసం..! | Beauty Tips: Skin care for aging skin | Sakshi
Sakshi News home page

ముఖవర్చస్సు కోసం..!

Jul 12 2026 3:29 PM | Updated on Jul 12 2026 3:29 PM

Beauty Tips: Skin care for aging skin

వయసు పైబడే కొద్దీ ముఖంపై మార్పులు రావడం సహజం. ముఖ్యంగా కళ్ల కింద వాపులు, పెదవుల చుట్టూ వచ్చే ముడతలు చాలా మందిని వేధించే ప్రధాన సమస్య. ఈ వృద్ధాప్య ఛాయలను తొలగించి, ముఖాన్ని మళ్లీ యవ్వనవంతంగా మార్చేందుకు బ్యూటీ రంగంలో సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అదే మైక్రోకరెంట్‌ లైన్‌–స్మూతింగ్‌ టెక్నాలజీతో పనిచేసే ‘బేర్‌ 2 ఐస్‌ అండ్‌ లిప్స్‌’ డివైజ్‌. ఈ సరికొత్త హ్యాండ్‌హెల్డ్‌ డివైజ్‌ ఇప్పుడు సౌందర్య ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఫేస్‌లో అత్యంత సున్నితంగా ఉండే కళ్ల చుట్టూ ఉన్న చర్మం, పెదవుల రక్షణే ధ్యేయంగా ఈ పరికరం పనిచేస్తుంది. 

కేవలం చర్మం పైపైన మాత్రమే కాకుండా, లోపలి కండరాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ డివైజ్‌ నుంచి వెలువడే అత్యల్ప విద్యుత్‌ ప్రవాహం చర్మంలో కొలాజెన్, ఎలాస్టిన్‌ అనే ప్రొటీన్ల ఉత్పత్తిని వేగవంతం చేసి, చర్మానికి మంచి బిగుతును అందిస్తుంది. ముఖంలో రక్త ప్రసరణను పెంచి, చర్మ కణాలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. ముఖంలో పేరుకుపోయిన అదనపు నీరు, వ్యర్థాలను తొలగించి, కళ్ల కింద వచ్చిన వాపును తక్షణమే తగ్గేలా చేస్తుంది.

పచ్చరాయితో ఫేస్‌ రోలర్‌!
చైనా రాజకుటుంబీకులు తమ సౌందర్యాన్ని పెంచుకోవడానికి సహజ సిద్ధంగా లభించే జేడ్‌ రత్నాలతో తయారు చేసిన రోలర్స్‌తో మసాజ్‌ చేసుకునేవారు. ముఖంపై ముడతలు తగ్గించడానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఉపయోగించే ఈ రోలర్‌ వెనుక సుమారుగా 1300 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ జేడ్‌ రోలర్లు అప్పట్లో కేవలం రాణులు, ఉన్నత వర్గాల మహిళలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. చైనాను సుదీర్ఘకాలం పాలించిన ప్రసిద్ధ మహారాణి సిక్సీ ప్రతిరోజూ ఈ జేడ్‌ రోలర్‌ను ఉపయోగించేది. 

జేడ్‌ రత్నానికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ, ఇది ఎల్లప్పుడూ చల్లగానే ఉంటుంది. ఈ చల్లదనం ముఖంలోని రక్తనాళాలను సంకోచింపజేసి, చర్మంపై వచ్చే ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ ముఖంపై మసాజ్‌ చేయడం వల్ల ముఖ కండరాలు దృఢపడి, కొలాజెన్‌ ఉత్పత్తి పెరిగి, ముడతలు తగ్గుతాయి.

వర్షంలో తడుస్తున్నారా? 
వర్షాకాలంలో తలలో జిడ్డు, మురికి త్వరగా పేరుకుపోతాయి. అందువల్ల జుట్టు తత్వానికి సరిపోయే మైల్డ్‌ షాంపూతో క్రమం తప్పకుండా తలస్నానం చేయాలి. అలాగే వర్షంలో తడవడం సరదాగా అనిపించినా, వాన నీటిలోని ఆమ్లాలు, కాలుష్య కారకాలు జుట్టును దెబ్బతీస్తాయి. ఒకవేళ అనుకోకుండా వానలో తడిస్తే, వెంటనే మంచినీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. 

బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా రెయిన్‌కోట్‌ తప్పనిసరిగా వాడాలి. ఈ సీజన్‌లో జుట్టును స్ట్రెయిటెనింగ్‌ చేయడం కోసం హీటింగ్‌ టూల్స్‌ ఉపయోగించడం వల్ల్ల జుట్టు మరింత బలహీనపడి తెగిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కేవలం పైపూతలే కాకుండా, పోషకాహారం కూడా ముఖ్యమే!

(చదవండి: ధగ ధగ మెరిసే ఆభరణాలు లేకుండానే..పెళ్లికూతురు రూపం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement