చర్మంపై ముడతలు పడటం, ముఖంపై చర్మం సాగిపోవడం వంటి మార్పులు వయసుమళ్లే దశలో సహజమే! కొందరిలో చిన్న వయసులోనే ఈ సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా వచ్చేసింది ‘టచ్‌బ్యూటీ హాలో’ స్కిన్ కేర్ డివైస్. సాధారణంగా వేర్వేరు చర్మ సమస్యల కోసం వేర్వేరు ట్రీట్‌మెంట్లు అవసరమవుతాయి. కానీ టచ్‌బ్యూటీ హాలో పరికరం ఏకంగా నాలుగు రకాల అడ్వాన్స్‌డ్ టెక్నాలజీల కలయికతో రూపొందించినది.
ఇది చర్మం లోపలి పొరల్లో కొలాజన్ ఉత్పత్తిని ప్రేరేపించి, చర్మం బిగుతుగా మారేలా చేస్తుంది. ముఖ కండరాలను ఉత్తేజపరచి, అందమైన ఆకృతిలోకి తీసుకువస్తుంది. చర్మంపై ఉండే ఫైన్ లైన్స్, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. కణాల పునరుద్ధరణకు, చర్మ కాంతిని పెంచడానికి ఈ పరికరం ఎంతగానో దోహదపడుతుంది. ఎలాంటి సర్జికల్ పద్ధతులతో పని లేకుండా, ఎలాంటి నొప్పి లేకుండా చర్మాన్ని యవ్వనంగా మార్చుకోవడానికి ఈ మల్టీ–ఫంక్షన్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని పలు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.
గ్రీన్ టీతో సౌందర్యపోషణ
గ్రీన్ టీ ముఖ చర్మాన్ని, జుట్టును మెరిపించడానికి కూడా ఒక అద్భుతమైన సౌందర్య సాధనంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ తాగిన తర్వాత ఆ టీ బ్యాగులను పారేయకుండా వాటిని కళ్లపై ఉంచుకుంటే కళ్లకు ఎంతో ఉపశమనం లభిస్తుంది.
గ్రీన్ టీలోని కెఫీన్ కళ్ల కింద వచ్చే ముడతలు, నల్లటి వలయాలను తగ్గించి, కళ్ల వాపును నయం చేస్తాయి. అలాగే, వీటిని పెదవులపై ఉంచడం వల్ల తగినంత తేమ అంది మృదువుగా మారుతాయి. అలాగే మెరిసే కేశాల కోసం రెండు గ్రీన్ టీ బ్యాగులను వేడి నీటిలో బాగా నాననివ్వాలి. ఆ నీటితో తలస్నానం చివర్లో జుట్టును కడిగితే, జుట్టుకు చక్కని నిగారింపు రావడమే కాకుండా, ఒత్తుగా పెరుగుతుంది.
చుండ్రుకు విరుగుడు కొండగన్నేరు
చుండ్రు సమస్యలకు ఇప్పుడంటే నానా రకాల లోషన్లు, షాంపూలు వాడుతున్నారు గాని, మన పూర్వీకులు చుండ్రు నివారణ కోసం కొండగన్నేరు ఆకులను, బెరడును ఉపయోగించేవారు. చుండ్రు నివారణకు కొండగన్నేరు ఆకులు, బెరడు వినియోగం పలు దేశాల్లో ఉండేది. యూరోపియన్ దేశాల్లో కొండ గన్నేరు ఆకులను, బెరడును వైన్‌లో నానబెట్టి; దానితో తయారు చేసిన మిశ్రమాన్ని తలకు పట్టించుకునేవారు.
ఇలా చేయడం వల్ల చుండ్రు నయమయ్యేది. కొండగన్నేరు బెరడులో ఉండే ‘సాలిసిలిక్ యాసిడ్’ చండ్రు నివారణలో అమోఘంగా పనిచేసేది. ఇప్పటికీ ఆధునిక సౌందర్య ఉత్పత్తుల్లో ‘సాలిసిలిక్ యాసిడ్’ ప్రధానంగా ఉపయోగిస్తుండటం విశేషం.
(చదవండి: మూత్రపిండం ప్రాణగండం)


