కటిక పేదరికం అందమైన బాల్యం దూరంచేసి చదువు దారిదాపుల్లోకి రానివ్వకుండా చేసింది. కానీ అతడి ఎదుగుదలను ఆపలేకపోయింది. చదువు లేకపోయినా..బతక నేర్చిన తెలివితేటలనే పెట్టుబడిగా పెట్టి..అంట్లు తోమే స్థాయి నుంచి వ్యవస్థాపకుడిగా మారి ఏకంగా 160 కోట్లు విలువ చేసే కంపెనీని నిర్మించే స్థాయికి చేరుకుని యువతకు ఆదర్శంగా నిలిచాడు. అంతేగాదు జీవితం అన్ని ఇవ్వకపోయినా..కష్టపడి సాధించుకుంటే అందులో ఉండే ఆనందమే వేరు అని చూపించాడు.
ఆ వ్యక్తే రాజస్థాన్‌కు చెందిన విజయ్ వర్మ. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా, బిసౌ గ్రామంలో అక్టోబర్ 1978లో జన్మించిన ఆయన బాల్యం కటిక దారిద్యంలో గడించింది. అతనికి పదేళ్లు వచ్చేసరికి తాతయ్య, నానమ్మ ఇద్దరూ చనిపోయారు. ఏడాదిలోపే తండ్రి కూడా చనిపోయారు. మిగిలింది తల్లి ఒక్కత్తే..ఆమెనే ఆరుగురు పిల్లలను పోషించాల్సి ఉంది. అయితే అక్కడ మహిళలు ఎప్పుడూ పొడవాటి ఘూంఘట్‌లతో గడప దాటి బయటకు రావడం చాలా అరుదు.
అందువల్ల నాటి సమాజ ఆంక్షలను ధిక్కరించే అవకాశం లేక అతడి తల్లి ఆరుగురు పిల్లలను పోషించేందుకు ప్రతి రోజు సూర్యోదయానికి ముందే ఇంటి వెనుక ఉన్న అడవిలోకి వెళ్లి ఎండిన ఆకులు, పేడను సేకరించి బదులుగా 30-40 కిలోల పిండిని తెచ్చుకునేదని చెప్పుకొచ్చారు విజయ్ వర్మ. ఇంతలో అన్నయ్య అమ్మకు సాయంగా ఆస్పత్రిలో రెండు రూపాయల జీతానికి కార్మికుల భోజన పెట్టెలు మోసుకెళ్లే పనిలో చేరాడని అన్నారు. అంతా బాగానే సాగుతుంది అనుకుంటుండగా..ఒక ఏడాది తర్వాత మళ్లీ చేతిలో పనుల్లు లేక ఇబ్బందిపడాల్సి వచ్చింది.
అప్పుడే తమ కుటుంబానికి తెలిసిన సీతారాం భాయ్ అనే వ్యక్తి మా అన్యయ్యను ముంబై తీసుకువెళ్లి నెలకు రూ. 500లు ఇప్పిస్తానని చెప్పారు. ఆరో తరగతిలో ఉన్నా తాను ఆ మాటలు విని పట్టుబట్టి మరి అన్యయ్య తోపాటు ముంబై వెళ్లినట్లు తెలిపారు. అయితే అక్కడ మురుగు కాలువ దుర్గంధం, దోమల బెడద తట్టుకోలే నరకం చూసి, ఇంటికి వెనుదిరిగి వెళ్లిపోదాం అనుకున్న తరుణంలో పూణే వెళ్లి పరిశుభ్రమైన వాతావరణ చూడమని సలహా ఇవ్వడంతో అక్కడికి పయనమైనట్లు తెలిపారు. అయితే తమకు సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి రూ. 200లు ఇవ్వడంతో ఆ డబ్బులతో తాము రైలు ఎక్కి పూణేకి చేరుకున్నట్లు తెలిపారు.
రైలు టికెట్ రూ. 20లు పోగా మిగిలినడబ్బుని ఎవరో ఎత్తుకుపోయిన ఘటన అస్సలు మరవనన్నారు. ఆ సమయంలో టాయిలెట్లు క్లీన్ చేసే ఒక అపరిచితుడు మమ్మల్ని చూసి జాలిపడి మాకు మూడు రోజులు అన్నం పెట్టి..టాయిలెట్ వాడుకునేందుఉ అనుమతించాడని అన్నారు. ఆ తర్వాత తాము అతడి వద్దే 18 రోరజు ఉండి వడా పావ్ అమ్మేవారికి గిన్నెలు కడుగుతూ రూ. 3లు సంపాదించినట్లు తెలిపారు. సరిగ్గా ఆ సమయంలో
నిరాధర్ అనే రాజస్థానీ కాంట్రాక్టర్, వర్మ తనసోదరుడికి మంగళా థియేటర్‌లో రోజుకు రూ. 18 చొప్పున పునరుద్ధరణ పనులు చేసే పనులు అప్పగించడంతో తమ రాత మారినట్లు తెలిపాడు. అయితే విజయ్‌కి పనిచేసే వయసు తక్కువగా ఉండటంతో ఒక వృద్ధురాలికి ఇసుక జల్లించడంలో సాయం చేయమని చెప్పారు. అయితే ఆమె కంటే మూడు రెట్లు వేగంగా పనిచేయడంతో ఆశ్చర్యపోయిన కాంట్రాక్టర్ తనకు రోజుకు రూ. 8లు చెల్లించినట్లు తెలిపారు.
ఆ తర్వాత నెలలో ఒక గదికి మారి రూ. 2లకు ఒక సైకిల్‌ని అద్దెకు తీసుకుని ఒక భవన నిర్మాణానికి సంబంధించి.. టైల్ ఫ్లోరింగ్ నుంచి ప్లాస్టరింగ్, ఆర్‌సీసీ వరకు ప్రతి అంశంలో నైపుణ్యం సాధించినట్లు తెలిపారు. ప్రతి నెల 25వ తేదీకి రూ. 90 నుంచి 170 వరకు మనీ ఆర్డర్లను పంపేవాళ్లమని అన్నారు. ఒక ఏడాది తర్వాత టిఫిన్ బాక్సులలో రూ. 65,000 నగదును దాచి మా ఊరికి వెళ్లి..మా ఇంటి వెనుకు ఉన్న పొదలను తొలగించి ఒక గోడను నిర్మించుకోగలిగామని గర్వంగా చెప్పారు.
అన్నింటినీ మార్చేసిన ఆ అవకాశం
దానితో ధైర్యం తెచ్చుకున్న ఆ సోదరులు, సొంతంగా కాంట్రాక్టర్లుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు విజయ్. ఇందుకోసం తమ గ్రామం నుంచి ఆరుగురు అబ్బాయిలను శిక్షణ కోసం చేర్చుకున్నామని అన్నారు. వారు విమల్ కుమార్ జైన్ అనే ఒక ప్రసిద్ధ బిల్డర్ వద్ద పని చేయాలని ఆశపడ్డారు. మూడు నెలల పాటు, ఆ బిల్డర్ వారిని "కేవలం పిల్లలు" అని కొట్టిపారేశాడు. చివరకు విజయ్ తాము, టైలింగ్, కిచెన్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆర్‌సిసి, ప్లాస్టరింగ్ వంటి వాటిలో తనకు నైపుణ్యం ఉందని వాదించి మరి అవకాశం ఇవ్వమని అర్థించాడు.
దాంతో ఆ బిల్డర్ 15 రోజుల్లో పూర్తి చేయాల్సిన ఒక శాంపిల్ ఫ్లాట్‌ను కేవలం ఎనిమిది రోజుల్లోనే పూర్తి చేయాలనే అసాధ్యమైన గడువు ఇచ్చాడు, అంతేగాదు పని పూర్తి చేయకపోతే జీతం కూడా ఉండదని హెచ్చరించాడు. కానీ విజయ్ బృందం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రేయింబవళ్లు పనిచేసి మూడు రోజుల్లోనే ఆ పనినని పూర్తి చేసి ఆశ్చర్యపోయేలా చేశారు. వారి వేగం, నాణ్యత చూసి ఆ ఇంజనీర్ కాంట్రాక్టర్ ఏకంగా రూ. 5100 అందజేశారు. అదే తమనుఅన్న పేరుమీద శ్యామ్‌సుందర్ చీరంజీవ్‌లాల్‌జీ కన్‌స్ట్రక్షన్ అనే కంపెనీని పెట్టే స్ధాయికి తీసుకెళ్లిందని చెప్పుకొచ్చారు. కొద్దిమంది కార్మికులతో మొదలైన ఆ కంపెనీ..చూస్తుండగానే ఏకంగా 350 మందికి పెరిగింది.
ఆ తర్వాత కాంట్రాక్టర్ నుంచి వ్యవస్థాపకుడిగా
1998 నాటికి, ఆ సంస్థలో సుమారు 850 మంది కార్మికులు పనిచేసేవారు, పైగా రూ. 8 కోట్ల వార్షిక టర్నోవర్‌ను నమోదు చేసేదని వెల్లడించారు. అయితే ఈ సంఖ్య పెరుగుతూనే ఉండి, 2004-05 నాటికి రూ. 20 కోట్లకు చేరుకుందని చెప్పారు. ఫైవ్-స్టార్ హోటళ్ల లాబీల నుంచి ఫామ్‌హౌస్‌ల వరకు, తాము అస్సలు వెనుతిరిగి చూడలేదని తెలిపారు. ఆ తర్వాత ఆయన 2008లో,సొంతంగా సాయి విజయ్ కన్‌స్ట్రక్షన్‌ను స్థాపించి, 2011లో దానిని LLPగా లాంఛనప్రాయంగా మార్చారు. 2017లో, ఆ కంపెనీ ఆదాయపు పన్ను విచారణను కూడా ఎదుర్కొన్నప్పటికీ, ఎటువంటి నష్టం లేకుండా బయటపడిందన్నారు.
తమ రికార్డులు ఎంత పకడ్బందీగా ఉండేవంటే, దర్యాప్తు అధికారులు కనీసం రూ. 5,000 వ్యత్యాసాలను కూడా కనిపెట్టలేకపోయేవారని గర్వంగా చెప్పారు. ఈనాడు, ఆ కంపెనీ విలువ సుమారు రూ. 160 కోట్లు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయనకు పూణేలో నాలుగు ఇళ్లు, ఒక ఫామ్ హౌస్ ఉన్నట్లు తెలిపారు. అంతేగాదు ఒమన్, యెమెన్ వంటి దేశాల్లో ఏకంగా రూ. 730 కోట్ల అంతర్జాతీయ ప్రాజెక్టులు కూడా ఉన్నాయని అన్నారు. అలాగే తన వద్ద శిక్షణ తీసుకున్న కార్మికులే కొందరు సొంతంగా వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే ఆర్థికపరిస్థితుల దృష్ట్యా కోల్పోయిన చదువుని తిరిగిపోందడం కోసం..30వ ఏట ఓపెన్ స్కూలింగ్ సాయంతో పది పూర్తి చేసి, సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా, పీహచ్‌డీ పూర్తి చేసినట్లు తెలిపారు. అంతేగాదు ఆయన ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస పాఠాలను చెబుతున్నారు. అరగంటగా మొదలయ్యే తన ప్రసంగాలు విద్యార్థుల ప్రోత్సాహంతో రెండు మూడు గంటల వరకు సాగుతాయని చెప్పుకొచ్చారు. అంతేగాదు విజయ్ వర్మ కుమారుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలిపారు.
ఆయన చెప్పే జీవిత పాఠాలు..
తనలాంటి జీవితాన్ని నిర్మించుకోవడానికి ఏం కావాలని అడిగితే, నిజాయితీ, కఠోర శ్రమ, పట్టుదల అని తడుముకోకుండా చెప్పేస్తారు. అంతేగాదు తాము ఎదిగే క్రమంలో ఒక రాత్రి పోలీసులో దాడిలో తీవ్రంగా గాయపడ్డమని అన్నారు. దాంతో తన అన్నయ ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చిందని అన్నారు. ఆ ఘటన తనకు గౌరవనీయమైన వ్యక్తులతో సత్ససంబంధాలు ఏర్పరుచుకోవడం అత్యంత ముఖ్యమని తెలిసొచ్చిందన్నారు.
అంతేగాదు విజయ్ అందమైన జీవితాన్ని నిర్మించుకోవడమే కాదు, బాల్యంలో మిస్సైన అభిరుచుల వైపుకి మళ్లుతూ పియానో, మార్వాడీ జానపద గీతాలు వంటివి కూడా నేర్చుకుంటూ..తన బాల్యన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తుంటానని అన్నారు.
(చదవండి: చేతితో చిత్రించిన పటచిత్ర చీరలో నీతా అంబానీ అద్భుతమైన లుక్..!)


