గాయని చిత్ర నుంచి సత్కారం అందుకుంటున్న సుధాశ్రీనివాస్(ఫైల్)
రాగ సుధారసం.. గాత్ర సమ్మోహనం
దేశ విదేశాలలో 2800 పైగా ప్రదర్శనలు
అంతర్జాతీయ వేదికపై మెరిసిన బెజవాడ గాయని
సుధ అంటే అమృతం. ఆమె పేరులోని అమృతం ఆమె గొంతులో ప్రవహిస్తే... ఆ స్వర సమ్మోహనంలో తేలియాడిన శ్రోతలకు స్వర్గంలో విహరించినట్టు ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. భగవంతుడిచ్చిన వరమో, గురువుల ఆశీర్వాదమో, తల్లిదండ్రుల ఆశీస్సుల ఫలితమో ఆమె పాడుతుంటే మనసు మరోలోకంలో విహరిస్తుంది. అది శాస్త్రీయ సంగీతమైనా, మరే భారతీయ సంప్రదాయ సంగీతమైనా ఆ గానమాధుర్యానికి మైమరచిపోవలసిందే. ఆనంద డోలికలలో ఓలలాడాల్సిందే.
విజయవాడ నగరానికి చెందిన చిముడూరి సుధా శ్రీనివాస్ ఈ తరంలో ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసులలో ఒకరిగా భాసిస్తున్నారు. సుధాశ్రీనివాస్ తల్లిదండ్రులు కొల్లంకోడు గిరిజ, రామచంద్రన్. సుధ ఏడేళ్ల వయసులో సంగీతం అభ్యసించడం ప్రారంభించారు.
సద్గురువుల శిక్షణలో...
విఖ్యాత సంగీత విద్వాంసులు అన్నవరపు రామస్వామి, అంపోలు మురళీకృష్ణ, పెమ్మరాజు సూర్యారావుల వద్ద శాస్త్రీయ సంగీతంతో పాటు, లలిత సంగీతం, జానపద సంగీతం, భారతీయ సంగీతంలో వివిధ ప్రక్రియలలో పరిణితి
సాధించారు.
ప్రముఖ నాట్యాచార్యులతో...
కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యంతో పాటు రాధారెడ్డి, రాజారెడ్డి, స్వప్న సుందరి, శోభానాయుడు, జయరామారావు, మంజూభార్గవి లాంటి దిగ్గజాలతో సుధా శ్రీనివాస్ వేదిక పంచుకున్నారు. వారి నాట్య భంగిమలకు ఆమె గాత్రంతో ఆ ప్రదర్శనలను రంజింపజేశారు.
లైవ్ కార్యక్రమంలో సుధాశ్రీనివాస్(ఫైల్)
అంతర్జాతీయ సంగీత ప్రస్థానం...
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్), ఇతర సాంస్కృతిక సంస్థల ఆహ్వానం మేరకు సుధాశ్రీనివాస్ అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఇటలీ, దుబాయి, అమెరికా, యూనివర్సిటీ ఆఫ్ ఫిలడెలి్ఫయా, టొరెంటో, కెనడా తదితర దేశాలలో నృత్య కార్యక్రమాలకు తన గాత్ర మాధుర్యాన్ని పంచారు.
దేశ విదేశాలలో...
ఇప్పటివరకు దేశ విదేశాలలో 2800 పైగా ప్రదర్శనలు, 42 నృత్య రూపకాలకు, 500కు పైగా లలిత జానపద గీతాలకు, సోలో గీతాలకు ఆమె గాత్రాన్ని అందించారు.
పురస్కారాలు, సత్కారాలు..
సుధా శ్రీనివాస్ ఉగాది పురస్కారం, రాగమాధురి, గాన లహరి, రోటరీ యువ పురస్కారం, యంగ్ అచీవర్స్, యువ పురస్కారం పొందారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు నిర్వహించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. సినీ నేపథ్యగాయనిచిత్రనుంచి అభినందనలు అందుకున్నారు.
గురుముఖంగా సాధన చేయాలి..
''సంగీతమైనా, నృత్యమైనా గురుముఖంగా సాధన చేయాలి. సంగీతం ఓ తపస్సులా భావించాలి. సంగీత సరస్వతికి అర్చనలా భావించాలి. అంకిత భావం, చిత్తశుద్ధి ఏకాగ్రత అవసరం. నిరంతరం సాధన చేయాలి.''
– సుధాశ్రీనివాస్
ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం వదలి ఆటో డ్రైవర్‌గా మహిళా టెకీ..!


