ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సురేంద్రకుమార్‌తో.. రవి
ప్రాణాలకు తెగించి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన వైనం
ఆంధ్రప్రదేశ్: ప్రమాదవశాత్తు రైలు కిందపడబోయిన ఓ ప్రయాణికుడిని సకాలంలో ఓ కానిస్టేబుల్ పక్కకు లాగి ప్రాణాలు కాపాడాడు. వివరాల్లోకి వెళితే... అనంతపురంలోని భైరవనగర్ నివాసి రవి బండలు కొట్టి కుటుంబాన్ని పోషించుకునేవాడు. తిరుపతికి వెళ్లేందుకు సిద్ధమైన ఆయన మంగళవారం ఉదయం 9.40 గంటలకు అనంతపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అప్పటికే గుంతకల్లు నుంచి తిరుపతికి వెళ్లే ప్యాసింజర్ (57404) రైలు ప్లాట్‌ఫాం విడుస్తోంది.
గమనించిన రవి పరుగున వెళ్లి కదిలే రైలులో ఎక్కేందుకు ప్రయత్నించి అదుపు తప్పాడు. అదే సమయంలో చేతికి అందిన కంపార్ట్‌మెంట్ తలుపు హ్యాండిల్ పట్టుకుని కిందకు వేలాడుతూ ఉండగా రైలు వేగం అందుకుంది. అదే సమయంలో తన ఉన్నతాధికారిని (ఎస్‌ఐ)ని రైల్వే స్టేషన్‌లో వదిలేందుకు వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేంద్రకుమార్ వెంటనే స్పందించి, పరుగున వెళ్లి రవిని పక్కకు లాగేందుకు ప్రయత్నించాడు.
అయితే భయంతో తలుపు హ్యాండిల్‌ను రవి గట్టిగా పట్టుకోవడంతో సురేంద్రకుమార్ పరిస్థితి కూడా కాసేపు సంక్లిష్టంలో పడింది. చివరకు తన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా సురేంద్రకుమార్ రైలు పక్కనే పరుగు తీస్తూ రవిని ప్లాట్‌ఫాం పైకి లాగేశాడు. చిన్నపాటి గాయాలతో ప్రాణాపాయం నుంచి రవి బయటపడ్డాడు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు కానిస్టేబుల్ సురేంద్రకుమార్‌ను అభినందనలతో ముంచెత్తారు.
ఇదీ చదవండి: రష్యాలో మావాళ్లు.. రక్షించండి!


