చంద్రబాబు సర్కారుపై అంగన్‌వాడీల సమరశంఖం | Anganwadi workers fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కారుపై అంగన్‌వాడీల సమరశంఖం

Sep 30 2026 5:54 AM | Updated on Sep 30 2026 5:54 AM

Anganwadi workers fires On Chandrababu Govt

విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు (ఫైల్‌)

వేతనాలు పెంచాలని, యాప్‌ల భారం తగ్గించాలని ఆందోళనలకు సిద్ధం  

అక్టోబర్‌ 2న గాంధీ విగ్రహాలకు వినతులు  

సాక్షి, అమరావతి: తమకు చంద్ర­బాబు కూటమి ప్రభుత్వం వేతనాలు పెంచడంలేదని, యాప్‌ల భారం తగ్గించడంలేదని రాష్ట్రంలోని అంగన్‌వాడీ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా పలుమార్లు దశలవారీ ఉద్యమాలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మరోమారు సమ­రశంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 55,776 అంగన్‌వాడీల్లో పనిచేస్తున్న వర్కర్లు, హెల్పర్లకు వేతనాలు పెంచాలని, 12 రకాల యాప్‌ల భారం తగ్గించాలని కోరుతూ గాందీజయంతి అయిన అక్టోబర్‌ 2న శాంతియుత నిరసనలకు శ్రీకారం చుడుతున్నారు. ఆ రోజు గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు ఇవ్వాలని, అక్టోబర్‌ 6వ తేదీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి తమ సమస్యలు చెప్పి, డిమాండ్లపై వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. 

అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూలకు చెందిన మూడు అంగన్‌వాడీ యూనియన్లు నిర్ణయించాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో పెంచిన వేతనాలు తప్ప చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పెంచలేదని ఆ యూనియన్ల నేతలు తెలిపారు. కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, యాప్‌లను మిళితం చేసి వాటి భారం తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా చూస్తాం.. చేస్తాం.. అంటున్నారే తప్ప చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

డేటా ఎంట్రీలతోనే సతమతం 
రాష్ట్రంలో అంగన్‌వాడీ వర్కర్ల పని పరిధి నానాటికీ విస్తరిస్తోంది. ఒకప్పుడు చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, ప్రీ–సూ్కల్‌ విద్య, గర్భిణులు–బాలింతలకు సేవలు అందించడం ప్రధాన బాధ్యతలుగా ఉండేవి. ఇప్పుడు డిజిటల్‌ డేటా నమోదు, యాప్‌ల నిర్వహణ, ఫొటోల అప్‌లోడ్, లబ్ధిదారుల వివరాల అప్‌డేట్, గ్రోత్‌ మానిటరింగ్, ఇంటింటి పర్యటనల వివరాల నమోదు వంటి పనులు కూడా జతయ్యాయి. పోషణ్‌ ట్రాకర్‌ నుంచి వాట్సాప్‌ వరకు దాదాపు 12 రకాల యాప్‌లలో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ అప్‌డేట్‌ పేరుతో డేటా ఎంట్రీతో వారు సతమతమవుతున్నారు. 

నెట్‌వర్క్‌ సమస్యలున్నా డేటా అప్‌లోడ్‌ తప్పదు. దీనికితోడు పోషకాహార పంపిణీ, ప్రీ–ప్రైమరీ విద్య, ఇంటింటి పర్యటనల పేరుతో బాధ్యతల భారం మోయలేకున్నారు. ఇది చాలదన్నట్టు ప్రభుత్వ కార్యక్రమాలైన టీకాలు, రేషన్‌ పంపిణీ, పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ (గ్రోత్‌ మానిటరింగ్‌), బాల్యవివాహాల నిరోధం, మానవ అక్రమ రవాణా వంటివాటిపై అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు, శిక్షణ వంటివి కూడా ఉన్నాయి. సమానపనికి సమానవేతనం ఇవ్వకపోగా ప్రభుత్వం పనిభారం మాత్రం పెంచిందని అంగన్‌వాడీ కార్యకర్తలు మండిపడుతున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement