ప్రభుత్వం పట్టించుకోదు.. అధికారులపై అదుపు లేదు
గత ప్రభుత్వంలో ఏఐసీటీఈ పేస్కేల్, ఉద్యోగులకు పదోన్నతులు
కూటమి పాలనలో రెండేళ్లుగా ప్రమోషన్లకు ఎగనామం
కమిషనర్ పరిధిలోని ‘లెక్చరర్ టు సీనియర్ లెక్చరర్’ పదోన్నతులూ బంద్
నిబంధనలు పట్టించుకోకుండా సీఏఎస్ లెవెల్–11 ఇచ్చి.. గుట్టుచప్పుడు కాకుండా వెనక్కి!
లెవెల్–10పై స్పష్టత కరువు.. ఒకే బ్యాచ్ లెక్చరర్ల మధ్య వేతన వ్యత్యాసం
ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలు లేని శాఖగా విమర్శలు
సాక్షి, అమరావతి: సాంకేతిక విద్యాశాఖలో అధికారులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఆ శాఖలో ఏం జరుగుతోంది, ఉద్యోగుల సమస్యలేమిటనే కనీస విషయాన్ని కూడా సంబంధిత మంత్రి, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు అధికారులు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండేళ్లుగా ప్రమోషన్లను అటకెక్కించడమే కాకుండా కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) అమలులో అడ్డగోలు నిబంధనల్ని చొప్పించి ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టడం, 20 ఏళ్లనాటి సర్వీస్ రూల్స్‌ను తమ స్వప్రయోజనాల కోసం చట్టవిరుద్ధంగా మార్చేందుకు యత్నించడం వంటి చర్యలతో సాంకేతిక విద్యాశాఖ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. జరుగుతున్న అక్రమాలను ఈ ఏడాది ప్రారంభంలో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా.. వెనక్కి తగ్గిన శాఖ అధికారులు మళ్లీ తమ విధానాలను బలవంతంగా ఉద్యోగులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వంలో వెలుగులు.. నేడు చీకట్లు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉండగా పాలిటెక్నిక్ విద్యా రంగానికి, అందులో పనిచేసే సిబ్బంది సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత లభించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పే–స్కేల్‌ను (2016 పే–స్కేల్) 2022లో ఉద్యోగులకు వర్తింపజేసి ఆర్థిక భరోసా కల్పించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేసి, పలు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు శాశ్వత పోస్టులను మంజూరు చేశారు. అర్హులైన అన్ని కేడర్ల బోధన, బోధనేతర సిబ్బందికి సకాలంలో పదోన్నతులు కల్పించారు.
విద్యా సంస్థల్లో మౌలిక వసతులు, ల్యాబ్‌ల ఆధునికీకరణతో పాలిటెక్నిక్ విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందేలా చర్యలు తీసుకున్నారు. రికార్డు స్థాయిలో పాలిటెక్నిక్ కోర్సులకు ‘ఎన్‌బీఏ గుర్తింపు’ వచ్చేలా చేశారు. అయితే, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ శాఖను పూర్తిగా గాలికొదిలేసింది. 2024–25, 2025–26 ప్యానెల్ సంవత్సరాలకు సంబంధించి ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన పదోన్నతులు రాకుండా చేసి, తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.
కేవలం డైరెక్టర్/కమిషనర్ స్థాయిలోనే నిర్ణయం తీసుకుని విడుదల చేసే వీలున్న ‘లెక్చరర్ నుంచి సీనియర్ లెక్చరర్’ ప్రమోషన్లను సైతం విడుదల చేయకుండా కొందరు అధికారులు మోకాలడ్డారు. దీంతో కొందరు ఉద్యోగులు తమ మొత్తం సర్వీసులో ఒక్క పదోన్నతైనా పొందుతారో లేదో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. సాంకేతిక విద్యను ఉన్నత విద్యలో విలీనం చేసిన తర్వాత మంత్రులుగానీ, ప్రభుత్వ పెద్దలుగానీ ఈ శాఖలో ఏం జరుగుతుందో కనీసం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోవడంతో కొందరు అధికారులు పెట్టినవే నిబంధనలు అన్నచందంగా మారిపోయింది.
సీఏఎస్ ప్రహసనం.. రూల్స్‌కు తిలోదకాలు
పదోన్నతులు కల్పించని పక్షంలో లెక్చరర్ల సర్వీసును గుర్తించి ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకు ఉద్దేశించిన ‘కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్’ (సీఏఎస్) అమలులో డైరెక్టరేట్ అధికారులు చేసిన తప్పులు ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. జీవో–10 ప్రకారం పాలిటెక్నిక్ లెక్చరర్లు లెవెల్–9ఏతో సర్వీసులో చేరతారు. ఐదేళ్ల సర్వీసు, నిర్ణీత అర్హతలు పూర్తి చేసుకున్న వారికి లెవెల్–10 అమలు చేయాలి. తర్వాత స్థాయి లెవెల్–11 (లెక్చరర్ సీనియర్ స్కేల్) ఇవ్వాలంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అనుమతి, స్క్రీనింగ్ కమిటీ క్లియరెన్స్ జీవో–10 ప్రకారం తప్పనిసరి.
కానీ, డైరెక్టరేట్‌లోని కొందరు అధికారులతో కూడిన అంతర్గత కమిటీ అత్యుత్సాహం ప్రదర్శించి, ఏపీపీఎస్సీ అనుమతి లేకుండానే సెపె్టంబర్ నెలలో ఏకంగా 244 మంది లెక్చరర్లకు లెవెల్–9ఏ నుంచి నేరుగా లెవెల్–11 ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2012–13లో చేరిన వారికి ఏఐసీటీఈ–2016 నిబంధనల ప్రకారం 2022లోనే లెవెల్–10 ఇవ్వాల్సి ఉండగా.. అది ఇవ్వకుండా నేరుగా లెవెల్–11 ఎలా ఇస్తారని, రేపు ఆడిట్ అభ్యంతరాలతో రికవరీలు విధిస్తే ఎవరిది బాధ్యతని లెక్చరర్లు నిలదీశారు.
తప్పిదం బయటపడటంతో కొద్ది రోజులకే ఆ ఉత్తర్వులను అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వెబ్‌సైట్ నుంచి తొలగించారు. కానీ ఉత్తర్వుల రద్దు చేస్తూ ప్రొసీడింగ్ ఇవ్వకపోవడంతో కొన్ని కాలేజీల్లో లెవెల్–11 వేతనాలు డ్రా చేయడం, మరికొన్ని కాలేజీల్లో నిలిపివేయడం జరిగింది. దీంతో ఒకే నోటిఫికేషన్ ద్వారా సర్వీసులో చేరిన ఉద్యోగుల మధ్య నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతన వ్యత్యాసం ఏర్పడింది. అటు పదోన్నతులు, ఇటు కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలు కాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులోనూ తప్పులే..
పోస్టుల విభజన ప్రక్రియలో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడంలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఈ నిబంధనల ప్రకారం పేస్కేల్ ఆధారంగా పోస్టులను నిర్ణయించే విధానాలను పాటించలేదు. కేవలం కొందరు ఉద్యోగుల పదోన్నతుల ప్రయోజనం చేకూర్చే విధంగా తప్పులు చేశారు. అయితే, వీటికి కార్యదర్శి స్థాయిలో తీవ్రస్థాయి ఫిర్యాదులు అందడంతో అడ్డుకట్టపడింది. అసలు సర్వీస్ నిబంధనలు లేని శాఖగా సాంకేతిక విద్యాశాఖను మార్చి అభాసుపాలు చేశారని సిబ్బంది మండిపడుతున్నారు.
సర్వీస్ రూల్స్‌పై నిండా నిర్లక్ష్యం
20 ఏళ్ల క్రితం నాటి సర్వీస్ రూల్స్ మార్పు ప్రక్రియ కోసం నిబంధనల ప్రకారం ఇతర శాఖల నిపుణులతో కాకుండా సొంత శాఖ అధికారులతోనే హైపర్ కమిటీ వేయించుకున్నారు. గతంలో తమ పదోన్నతుల కోసం సొంత శాఖపైనే హైకోర్టులో కేసులు వేసిన వ్యక్తులను ఈ కమిటీలో కీలక సభ్యులుగా నియమించడం గమనార్హం. అనుకూల నిబంధనలు రూపొందిస్తామని చెప్పి కొందరి నుంచి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడ్డారన్న విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను కనీసం పట్టించుకోకపోవడం, కొందరు అధికారులు ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తుండటంతో లెక్చరర్లు, ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పదోన్నతులు, ఆగిపోవడానికి సర్వీస్ రూల్స్ లేకపోవడమేనని చెబుతున్నారు. సర్వీస్ రూల్స్‌కు సంబంధించి అంతర్గత కమిటీ నివేదికను అందరికీ అందుబాటులో ఉంచలేదని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అప్పటి డైరెక్టర్ ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌లో ఉంచారు. దీనికి పర్యవసానంగా ఉద్యోగుల నుంచి 300 పైగా అభ్యంతరాలు డైరెక్టరేట్‌కు అందాయి. అనంతరం వీటి పరిశీలనకు జేఎన్‌టీయూ, ఉన్నత విద్యశాఖల ఉద్యోగులతో మరో కమిటీని నియమించారు. అయితే, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?, రెండో కమిటీ ఏ నివేదిక ఇచ్చింది? అనేది బహిర్గతం చేయలేదు. సర్వీస్ రూల్స్‌పై సాంకేతిక విద్య జాయింట్ డైరెక్టర్‌ను వివరణ కోరగా, ప్రభుత్వానికి పంపించామని ఒకసారి, త్వరలో పంపిస్తామని మరోసారి చెప్పడం గమనార్హం.


