కల్కి భగవాన్‌ ఇకలేరు | Spiritual guru and founder of Ekam Kalki Bhagwan passes away | Sakshi
Sakshi News home page

కల్కి భగవాన్‌ ఇకలేరు

Sep 30 2026 5:06 AM | Updated on Sep 30 2026 5:06 AM

Spiritual guru and founder of Ekam Kalki Bhagwan passes away

అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస 

విషాదంలో భక్తులు.. మూగబోయిన ఏకం క్షేత్రం 

నేటి నుంచి మూడు రోజుల పాటు ఏకం క్షేత్రంలో భగవాన్‌ పార్థీవదేహం 

భక్తులందరూ దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు

వరదయ్యపాళెం: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఏకం వ్యవస్థాపకులు కల్కి భగవాన్‌ (విజయ్‌కుమార్‌ నాయుడు) (77) పరమపదించారు. ఆయన అనారోగ్య సమస్యలతో రెండు వారాలకు పైగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. తన తండ్రి, ఏకం వ్యవస్థాపకులు శ్రీ భగవాన్‌ మహాసమాధి చెందారని ఆయన కుమారుడు కృష్ణాజీ మంగళవారం రాత్రి ఓ వీడియో ద్వారా ప్రకటించారు. కల్కి భగవాన్‌ మరణంతో తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలోని ఏకం క్షేత్రం మూగబోయింది.భక్తులు, భగవాన్‌ శిష్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

భగవాన్‌ పార్థీవ దేహాన్ని బుధవారం ఉదయం 9 గంటలకు బత్తలవల్లంలోని ఏకం క్షేత్రంకు తీసుకురానున్నారు. భక్తుల సందర్శనార్థం భగవాన్‌ పార్థీవ దేహాన్ని బుధవారం ఉదయం 11.30 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు మూడు రోజులు ఏకం క్షేత్రంలో ఉంచనున్నట్లు కృష్ణాజీ చెప్పారు. భక్తులందరూ ప్రశాంతంగా తరలివచ్చి దర్శనం చేసుకోవాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో రానున్న నేపథ్యంలో సత్యవేడు సీఐ ఆ«ధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  

వరదయ్యపాళెం కేంద్రంగా కల్కి భగవాన్‌ ఆధ్యాత్మిక ఉద్యమం 
తిరుపతి జిల్లా వరదయ్యపాళెం కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆధ్యాత్మిక ఉద్యమాన్ని  కల్కి భగవాన్‌ 1984లో ప్రారంభించారు. తొలి దశలో చిత్తూరు జిల్లాలో ప్రత్యామ్నాయ విద్యా విధానం, పిల్లల్లో ఆత్మ పరిశీలన పెంపొందించే లక్ష్యంతో ‘జీవాశ్రమం’ అనే పాఠశాలను స్థాపించారు. 1980 చివరలో తనను తాను విష్ణుమూర్తి పదో అవతారమైన ‘కల్కి భగవాన్‌’గా ప్రకటించుకున్నారు. 

1994లో జీవాశ్రమం ప్రాంగణాన్ని ‘సత్యలోకం’గా మార్చి దీక్షలు, ఆధ్యాత్మిక సాధనలను  ప్రారంభించారు. అనంతరం వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలో సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘వన్‌నెస్‌ టెంపుల్‌’ (ప్రస్తుతం ఏకం) నిర్మితమైంది. దీని ద్వారా ‘ఏకత్వ ఉద్యమం’ (వన్‌నెస్‌ మూవ్‌మెంట్‌) దేశ విదేశాలకు విస్తరించింది. ప్రస్తుతం ఈ ఆధ్యాత్మిక సంస్థ కార్యకలాపాలను ఆయన కుమారుడు ఎన్‌.కె.వి. కృష్ణ, కోడలు ప్రీతా కృష్ణ ’ఏకం’ పేరుతో కొనసాగిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement