తిరుపతి జిల్లా పెళ్లకూరులో టీడీపీ వ్యక్తి బరితెగింపు , పుల్లలచెరువులో బిడ్డ టీసీ తీసుకున్న యోగేశ్వరరావు
స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఎన్నికల్లో రెచ్చిపోయిన ‘పచ్చ’గూండాలు
రాజకీయ రణరంగంగా మార్చి బరితెగింపు
44,059 ప్రభుత్వ స్కూళ్లలో ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు
ఘర్షణలకు తెరతీసిన టీడీపీ కూటమి నాయకులు
పల్నాడు జిల్లాలో హెడ్‌మాస్టర్ కిడ్నాప్
చాలా ప్రాంతాల్లో పోలీసుల సాయం కోరిన ఉపాధ్యాయులు
టీడీపీ నేతల తీరు వల్ల 4,171 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా
కోరం లేదన్న సాకుతో 326 బడుల్లో ఎన్నికలకు ఆటంకం
ఆందోళనలకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు
అధికారమదంతో తెలుగుదేశం నేతలు పేట్రేగిపోతున్నారు. గుడి, బడి తారతమ్యం మరిచి బరితెగిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపు, వసతుల కల్పన పర్యవేక్షణ కోసం ఉద్దేశించిన పాఠశాలల నిర్వహణ కమిటీ ఎన్నికలను రాజకీయ రణరంగంగా మార్చి బాహాబాహీకి దిగారు. బడుల్లోకి చొరబడి గురువులపైనా గూండాగిరికి తెగబడ్డారు. పల్నాడు జిల్లాలో ఏకంగా ప్రధానోపాధ్యాయుడినే కిడ్నాప్ చేసిన ఘటన విద్యావ్యవస్థలో మునుపెన్నడూ చూడని చీకటి అధ్యాయాన్ని కళ్లకు కట్టింది. పసిపిల్లల ముందే టీడీపీ నేతలు సాగించిన ఈ రాక్షస కాండకు సభ్యసమాజమే విస్తుపోయింది.
సాక్షి, అమరావతి: పాఠశాలల నిర్వహణ కమిటీ ఎన్నికలు(ఎస్‌ఎంసీ) టీడీపీ కూటమి నాయకుల అరాచకాలకు అడ్డాగా మారాయి. మంగళవారం నిర్వహించిన ఎన్నికలను పూర్తిగా రాజకీయం చేస్తూ, పసిపిల్లల ముందే తెలుగుదేశం కూటమి నేతలు బాహాబాహీకి దిగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కొన్నిచోట్ల ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేయగా, మరికొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులనే ఏకంగా కిడ్నాప్ చేసి దౌర్జన్యాలకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను, విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
నిబంధనల ప్రకారం విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రమే పాఠశాల ప్రాంగణాల్లోకి అనుమతి ఉంది. అయితే దీనికి విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు చొరబడ్డారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల్సిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో కొట్లాటలకు దిగి భయోత్పాతం సృష్టించారు. 44,059 ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించగా అనేక చోట్ల ఘర్షణలకు పూనుకున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం జెడ్పీ స్కూల్ హెచ్‌ఎంను ఏకంగా కిడ్నాప్ చేశారు.
టీడీపీ సానుభూతిపరులు తక్కువగా ఉన్నచోట్ల కోరం లేదంటూ ఎన్నికలను అడ్డుకుని వాయిదా వేయించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఎస్‌ఎంసీ ఎన్నికలు జరగడం ఇది రెండోసారి. గతంలోనూ 2024 ఆగస్టు 8న రాష్ట్ర వ్యాప్తంగా 45,193 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ కమిటీ ఎన్నికలు నిర్వహించగా, నాడు 631 స్కూళ్లలో గ్రామస్థాయిలోని కూటమి నాయకులు గొడవలకు దిగారు. ఇప్పుడూ మరోమారు బడులను రణరంగంగా మార్చారు.
ఇవిగో నిదర్శనాలు
» గుంటూరు జిల్లా, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని జొన్నలగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీడీపీ కూటమి నేతలు చొరబడి రౌడీషీట్, పోక్సో కేసు నమోదైన వ్యక్తిని అక్రమంగా, అడ్డదారుల్లో చైర్మన్‌గా ఎన్నుకున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఎన్నికకు ఏమాత్రం సంఖ్యాబలం లేకపోయినా పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్నిక ఏకగ్రీవం చేశారని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన ఓ విద్యార్థి తండ్రి సంకూరి కిషోర్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. రౌడీషీట్, పోక్సో కేసులు ఉన్న వ్యక్తిని పాఠశాల చైర్మన్‌గా చేస్తే విద్యార్థులకు రక్షణ, భద్రత, పాఠశాల అభివృద్ధి ఏ విధంగా సాధ్యపడతాయని వారు ప్రశ్నించారు.
» పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం జెడ్పీ స్కూల్ కమిటీ ఎన్నికల నిర్వహణ కోసం ఉదయం పాఠశాలకు వస్తున్న హెడ్ మాస్టర్ దండా శ్రీనివాసప్రసాద్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఎంఈవో నాగరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా కొందరు వ్యక్తులు పాఠశాలలోకి చొరబడ్డారు. అడ్డుకునేందుకు యత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. ఘటనలో పలువురు గాయపడ్డారు. టీడీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వర్గానికి చెందిన నాగండ్ల రాంబాబు, అదే పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావు వర్గాలు ఈ ఎస్‌ఎంసీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గమనార్హం.
» వైఎస్సార్ జిల్లా, కాజీపేట మండలం దుంపలగట్టు గ్రామం ప్రాథమిక పాఠశాలలో ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగానే టీడీపీ నేతలు చొరబడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు ఉన్నాయని దూషణలకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎన్నికను వాయిదా వేశారు. ఈ సమయంలో ఖాజీపేట సీఐ వంశీధర్.. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి భార్యను ఉద్దేశించి ‘ఆడదానివి నువ్వు పోకపోతే..’ అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. సీఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. మదనపల్లె డీఎస్పీ వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుని సీఐ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. బాధితులకు నచ్చజెప్పి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. వైఎస్సార్‌సీపీకి మెజారిటీ ఉన్నా టీడీపీ నాయకులు అధికార బలంతో ఎన్నికలు వాయిదా వేయించడంపై గ్రామంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
» చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికల్లో 40 శాతం మంది తల్లిదండ్రులూ హాజరుకాలేదు. చాలా పాఠశాలల్లో ఎన్నికలకు అవసరమైన సభ్యులు లేకపోయినా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు.
» చిత్తూరు రూరల్ మండలం ఎన్‌ఆర్‌పేట జెడ్పీ హైసూ్కల్‌లో మెజారిటీ సభ్యులు ఉన్నా టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను వాయిదా వేయించేందుకు హెచ్‌ఎం, అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ పాఠశాలలో స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది.
» గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం డీఎంపురం జెడ్పీ హైస్కూల్‌లో ఘర్షణలు తలెత్తాయి. గతంలో ఆ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఉన్న త్యాగరాజను తిరిగి ఎన్నుకోవాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. అతను వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు కావడంతో నిబంధనలకు విరుద్ధంగా మరొకరిని చైర్మన్‌గా ప్రకటించారు. కమిటీలోని ఐదుగురు సభ్యులు వాకౌట్ చేసినా టీడీపీ నాయకుల ఒత్తిడితో ఏకపక్షం చేశారు. దీంతో ఆ పాఠశాల వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
» ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో టీడీపీ నేతలు చొరబడి ఎన్నికలను నిలిపివేశారు. ముక్త్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో మహిళలకు కనీసం కమిటీలో ప్రాధాన్యం ఇవ్వకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన చేశారు.
» అనంతపురం జిల్లాలో జరిగిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకున్నారు. మొత్తం 1,723 పాఠశాలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 1,687 పాఠశాలల్లో పూర్తయ్యాయి, 36 పాఠశాలల్లో వాయిదా పడ్డాయి. 27 చోట్ల కోరం లేక, తొమ్మిది చోట్ల శాంతిభద్రతల సమస్యలతో వాయిదా వేశారు. కొన్నిచోట్ల కోరం ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో ఎన్నికలు వాయిదా వేశారు.
» తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని ఆర్లపాడు గ్రామంలోని బడిలో ఎన్నికల సందర్భంగా వివాదం తలెత్తింది. దీనిని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వాటంబేటి చంద్రశేఖర్ దాడికి పాల్పడ్డాడు. దుర్భాషలాడుతూ ఇద్దరు విలేకర్లపై దాడులకు పాల్పడ్డాడు.
» మార్కాపురం జిల్లా పుల్లలచెరువు ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నికలు అధికారపార్టీ కనుసన్నల్లో ఏకపక్షంగా జరిగాయని నిరసిస్తూ విద్యార్థి తండ్రి నీలబోయిన యోగేశ్వరరావు తన బిడ్డ టీసీ తీసుకెళ్లిపోయారు.
» అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మహంతపురం యూపీ పాఠశాల, కరిగానిపల్లి ఉన్నతపాఠశాలలో కోరం లేదనే సాకుతో ఎన్నికలను టీడీపీ నేతలు వాయిదా వేయించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహించారు. తమ పిల్లల టీసీలిచ్చేయాలని ధర్నా చేశారు.
» శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోటలో పోస్ట్ మాస్టర్‌గా పనిచేస్తున్న టీడీపీకి చెందిన వ్యక్తి సనపల అప్పలనాయుడు జెడ్పీ పాఠశాలలో ఎన్నికల ప్రక్రియను నడిపించారు. మైక్ పట్టుకుని ఎవరేం చేయాలో నిర్దేశించారు.
» స్కూల్ కమిటీ ఎన్నికలో ఓటమిని సహించలేక పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం పనుకువలస మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు కోట అజయ్‌కుమార్‌పై కూటమి నాయకులు దాడిచేశారు. అటుగా వస్తున్న ఎస్సై డోల వెంకన్న కూటమి నాయకులను చెదరగొట్టి అజయ్‌కుమార్‌ను రక్షించారు.
4,171 పాఠశాలల్లో ఎన్నికలు ఒకటోతేదీకి వాయిదా
సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల నిర్వహణ కమిటీల(ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం పారదర్శకంగా ముగిశాయని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 44,059 పాఠశాలల్లో ఎన్నికలకు ఏర్పాట్లుచేయగా, 39,888 పాఠశాలల్లో ఎన్నికలు సజావుగా జరిగాయని పేర్కొన్నారు. 4,171 పాఠశాలల్లో వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదని, ఇందులో 321 పాఠశాలల్లో కోరం లేక, 3,850 పాఠశాలలకు పరిపాలనా కారణాలతో ఎన్నికలను అక్టోబర్ ఒకటో తేదీకి వాయిదా వేశామని ఎస్పీడీ తెలిపారు.


