డప్పు సేవ.. తప్పుదోవ! | Social media influencer policy is widely criticized | Sakshi
Sakshi News home page

డప్పు సేవ.. తప్పుదోవ!

Sep 30 2026 4:21 AM | Updated on Sep 30 2026 4:21 AM

Social media influencer policy is widely criticized

టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో వలంటీర్లకు ఇచ్చిన హామీ ఇది..

చంద్రబాబు ప్రభుత్వ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ పాలసీపై సర్వత్రా విమర్శలు 

ఇంటింటికీ నాడు సేవలందించిన వలంటీర్లకు ఏం తక్కువని పక్కన పెట్టారు? 

మీకు బాకా ఊదడానికి మాత్రమే పనికొచ్చే ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం ప్రత్యేక పాలసీనా? 

జరిగింది తలుచుకుని రాష్ట్రవ్యాప్తంగా రగిలిపోతున్న బాధిత వలంటీర్లు  

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ పాలసీ వారికి డప్పు కొట్టించుకుంటూ ప్రజలను పక్కదోవ పట్టించడమేనని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సమయంలో సొంత కుటుంబ సభ్యులే వైరస్‌ సోకిన వారి దగ్గరకు వెళ్లలేని సమయంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడంతోపాటు నిరంతరం పేద ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందించిన గ్రామ, వార్డు వలంటీర్ల సేవలు ఈ రాష్ట్రానికి అవసరమా.. లేక జరగని వాటిని జరిగినట్లు గొప్పలు చెబుతూ డప్పు కొట్టేందుకు ప్రభుత్వ పెద్దలకు మాత్రమే ఉపయోగపడే సోషల్‌ మీడియా ఇన్‌ప్లుయెన్సర్‌ సేవలు అవసరమా.. అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 

చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కాగానే వృధా ఖర్చు అంటూ తొలగించిన 2.66 లక్షల మంది వలంటీర్ల కుటుంబాలు ఇప్పుడు గొంతెత్తి ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం తీరు దోపిడీ కన్నా దారుణంగా ఉందని దుయ్యబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్న ‘సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ పాలసీ‘ ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కొంత మంది అనుయాయులకు ఏటా కోట్ల రూపాయలు దోచి పెట్టడానికి తప్ప సామాన్య ప్రజలకు ఏ విధమైన ప్రయోజనం లేదని తూర్పారబడుతున్నాయి.

2019–24 మధ్య ఎంతటి వరదలొచ్చినా, ఇక్కట్లు వచ్చినా స్వల్ప ప్రాణ నష్టానికి కూడా తావు లేకుండా తాము సేవలు అందించామని చెబుతున్నారు. విజయవాడ బుడమేరు వరదల సమయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం తమకు రెట్టింపు వేతనం (రూ.10 వేలు) ఇచ్చి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ఆశ పెట్టి.. సేవలు వినియోగించుకుందని గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

నిలువెత్తు మోసానికి నిదర్శనమిది 
దేశంలోనే తొలిసారిగా పౌర సేవలను ఇంటింటికీ తీసుకెళ్తూ ప్రజాభిమానం పొందిన వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు అండ్‌ కో వెళ్లగక్కిన అక్కసు అంతా ఇంతా కాదని వలంటీర్ల కుటుంబాలు పేర్కొంటున్నాయి. ఈ వ్యవస్థ ఆవిర్భావం నుంచి వారు విషం చిమ్ముతూనే ఉన్నారని, మధ్యలో పవన్‌కళ్యాణ్‌.. మరింత దారుణంగా చేసిన వ్యాఖ్యలు తమ గుండెలను తొలచి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా, మహిళలను అక్రమ రవాణా చేసే కిరాతకులుగా చిత్రీకరించి.. ఆ వ్యవస్థను విచ్ఛినం చేసే కుట్రకు తెరదీశారని మండిపడుతున్నారు. 

మండల స్థాయిలో ఎంపీడీవోలు, నగరాల్లో మున్సిపల్‌ కమిషనర్లు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఎంపిక చేసిన వలంటీర్లను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుగా ముద్రవేసి దుష్ప్రచారం చేస్తూ, పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ ధనాన్ని పప్పు బెల్లాలు మాదిరి దోచి పెడుతోందని ఆరోపణలు చేయడాన్ని వలంటీర్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పే సోషల్‌ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లకు ప్రభుత్వ పెద్దల, అధికార పార్టీ ఇమేజ్‌ను పెంచుకోవడానికి ప్రజల పన్నుల డబ్బును చెల్లించడం కాక మరేంటని ప్రశ్నిస్తున్నారు. 

2019–24 మధ్య ఐదేళ్ల కాలంలో ప్రజలకు గడప వద్దనే సేవలు అందించడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి కొత్త సమాచారమైనా గంటల వ్యవధిలోనే ఆయా కుటుంబాలకు అందే పరిస్థితి ఉండగా.. వాస్తవాలతో పాటు అసత్యాలు కూడా ఎక్కువ ప్రచారంలో ఉండే సోషల్‌ మీడియా పోస్టులతో ప్రజలకు నిజమైన, కచ్చి­తమైన సమాచారం చేరే అవకాశం ఎంతవరకు ఉంటుందని నిలదీస్తున్నారు. ఎన్నికల ముందు వలంటీర్ల వేతనాలు రెట్టింపు చేస్తాం.. ఉన్నత చదువులు చదువుకున్న వలంటీర్లకు నైపుణ్య శిక్షణ ఇచ్చి నెలకు రూ.50 వేల ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేస్తాం.. అంటూ మాయ మాటలతో మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని గెలిచాక తమను నట్టేట ముంచారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది నిలువెత్తు మోసానికి నిదర్శనమని ఎత్తి చూపుతున్నారు.  

నాడు–నేడు బాబు, పవన్‌ మాటలు  
» జగన్‌మోహన్‌రెడ్డి ఎంత స్వార్థపరుడో వలంటీర్లు అర్థం చేసుకోవాలి. అందుకే తెలుగుదేశం, ఎన్డీయే.. మూడు పార్టీల కూటమి తరఫున మీకు హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం. వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఉగాది పండుగ రోజున తీపి కబురు చెబుతున్నాం. రూ. 5 వేలు కాదు.. రూ.10 వేలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది.  – 2024 ఏప్రిల్‌ 9న ఉగాది రోజున (అసెంబ్లీ ఎన్నికల ముందు) చంద్రబాబు వలంటీర్లకు ఇచ్చిన హామీ. 

» వలంటీర్లకు నేను ఒకటే చెబుతున్నా.. వలంటీర్లలో లక్ష మంది మహిళలున్నారని వైఎస్సార్‌సీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. మీకు నేను ఓ అన్నగా చెబుతున్నా.. మీకు ఐదు వేలు వస్తుంటే, ఇంకో ఐదు వేలు పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. నేను ఎప్పుడూ మీ పొట్ట కొట్టను. – ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌   

అధికారంలోకి వచ్చాక..  
» 2024 జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరిగింది. 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వలంటీర్లకు గౌరవ వేతనం ఆగిపోయింది. అనంతరం ఎలాంటి ప్రకటన లేకుండానే వారిని విధుల నుంచి తప్పించారు. నెలల తరబడి వలంటీర్లు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించినా.. కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన లేకుండా వలంటీరు వ్యవస్థకు మంగళం పాడేసింది. 
»  ఇప్పుడు వలంటీర్లు అసలు అఫీషియల్‌గా లేరు. ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు జీతాలు పెంచడానికి చూస్తున్నా.. ఎక్కడా, జీవోలో వాళ్లు అసలు లేరు. ఏదన్నా చేద్దాం.. ముందుకెళదామంటే వాళ్లు ఉద్యోగంలో ఉంటే చేయొచ్చు. అంటే ఇది ఒక టెక్నికల్‌ ఇష్యూ అయింది.  
» మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సర్పంచుల సంఘం ప్రతినిధుల సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement