సాక్షి,గుంటూరు: జిల్లా కోర్టులో తెనాలి పోలీసులకు బిగ్‌షాక్ తగిలింది. గత ఏడాది ఏప్రిల్‌లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెనాలి టూటౌన్, త్రీటౌన్ పోలీసుల థర్డ్ డిగ్రీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ చిరంజీవిపై నలుగురు యువకులు హత్యాయత్నం చేశారంటూ పోలీసులు నమోదు చేసిన కేసును జిల్లా కోర్టు కొట్టివేసింది. చిరంజీవిపై యువకులు హత్యాయత్నం చేశారనడానికి తగిన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ.. పోలీసులు బనాయించింది తప్పుడు కేసని తేల్చిచెప్పింది.
గత ఏడాది ఏప్రిల్‌లో తెనాలిలో కానిస్టేబుల్ చిరంజీవిపై నలుగురు యువకులు హత్యాయత్నం చేశారంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారిని విచారించే పేరుతో నడిరోడ్డుపై నడిపిస్తూ, ఊరంతా తిప్పుతూ,అందరూ చూస్తుండగా లాఠీలతో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ కేసుకు సంబంధించి జిల్లా కోర్టు తాజాగా విచారణ జరిపింది. పోలీసుల తరపున ప్రవేశపెట్టిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. కానిస్టేబుల్‌పై హత్యాయత్నం జరిగినట్లు ఎలాంటి బలమైన సాక్ష్యాధారాలు లేవని వెల్లడించింది. ఈ మేరకు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించడంతో పోలీసు శాఖలో ఈ తీర్పు చర్చనీయాంశమైంది.


