సాక్షి, కృష్ణా జిల్లా: కొల్లు రవీంద్రలా కడుపులో కత్తులు పెట్టుకుని తిరిగేవాళ్లం కాదని వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అన్నారు. ఇవాళ(మంగళవారం) మచిలీపట్నం నియోజకవర్గ ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు పేర్ని నాని దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. కులం చూసి ఓటేయమని తానెప్పుడూ అడగలేదన్నారు. కొల్లు రవీంద్ర నీకు ఎన్ని బూతులు వచ్చో.. నాకు అంతకంటే ఎక్కువే బూతులు వచ్చు. నేనూ బందరులోనే పుట్టా.. బందరులోనే చదువుకున్నా. నేను తిట్టాలంటే శత సహస్ర నామాలు లాగా నువ్వు పుస్తకం రాసుకున్నా సరిపోదు. గాలి ఉంటే గెలుస్తావ్.. గాలి లేకపోతే గెలవలేవు. బందరు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.
‘‘నా తండ్రి, నేను బందరుకు ఏం చేశామో ప్రజలకు తెలుసు. తరకటూరు పంపుల చెరువు నా తండ్రి చేసిందే. బందరులో 132కేవి పవర్ సబ్ స్టేషన్ నిర్మాణం చేయించింది నా తండ్రి. తీర ప్రాంత గ్రామాలకు మంచినీరు అందించిన ఘనత నా తండ్రిది. బందరులో 25 వేల మందికి ఇళ్లపట్టాలిచ్చిన చరిత్ర మాది. నువ్వు ఇప్పుడు టిడ్కో ఇళ్లు కట్టామని చెప్పుకుంటున్న భూమి కొన్నది కూడా మేమే.
..నీ మంత్రి పదవి కోసం బెల్ కంపెనీని నిమ్మకూరుకు తాకట్టు పెట్టిన చరిత్ర నీది. కృష్ణా యూనివర్శిటీ బందరుకు తెచ్చాం. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ బందరుకు తెచ్చాం. మెడికల్ కాలేజీను బందరుకు తీసుకొచ్చాం. గ్రామ గ్రామానికి తరకటూరు చెరువు నుంచి మంచినీరు తీసుకెళ్లాం. తారు రోడ్డు అంటే తెలియని అనేక గ్రామాలకు రోడ్డు వేయించాం.’’ అని పేర్ని నాని వివరించారు.
‘‘కరెంట్ ఆపితే తప్ప మంచినీటి ఇవ్వలేని పరిస్థితి. నేను మంత్రిగా ఉన్నప్పుడు కరెంట్ ఇవ్వాలని ధర్నా చేయించావు. ఇప్పుడు నువ్వు మంత్రివే కదా... అధికారం మీదే కదా? గంట పాటు కరెంట్ ఆపకుండా ఎందుకు మంచినీరు ఇవ్వలేకపోతున్నారు?. కాపులకు ఏం చేశావ్.. అని నన్ను అడుగుతున్నావ్. నువ్వేం చేశావ్.. కాపులకు సమాధానం చెప్పు. మున్సిపల్ ఛైర్మన్ పదవిని ఆర్యవైశ్యుల వద్ద 60 లక్షలు వసూలు చేసింది నువ్వు. ఫలానా పదవి ఇస్తానని... నేను ఏనాడూ ఎవరికి టిక్కెట్లు ఇవ్వలేదు.
..కష్టపడి పనిచేసే వారికి ... నికార్సైన వారికే మేం టిక్కెట్లు ఇచ్చాం. జనసేనలో నిఖార్సైన డబ్బులేని కాపులెవరూ కనిపించలేదా నీకు?. ఎందుకు డబ్బున్నోడికే మేయర్ టిక్కెట్ ఇస్తామంటున్నారు. వైఎస్ జగన్ సాయంతో స్థలాలు కొని నిజాయితీగా 25 వేల ఇళ్లపట్టాలిచ్చాం. 25 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చిన నాకు దొంగ పట్టాలివ్వాల్సిన కర్మ పట్టలేదు. మేం ఇచ్చింది దొంగ పట్టాలైతే ఇంటింటికి వీఆర్వోలను ఎందుకు తిప్పుతున్నావు. నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు అధికారులను ఇబ్బంది పెడుతున్నావు. పేర్ని నాని ఏరోజూ ఏ ఒక్కరి ఇల్లు కూల్చలేదు.

..నీ కోసం పనిచేసిన జనసేన కార్యకర్తను కూల్చి వేయించిన చరిత్ర నీది. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ గుమ్మటాల చెరువులో ఈరోజుకీ నువ్వు ఇళ్లు అమ్ముకుంటున్నావు. బందరుకు నువ్వేం చేశావో.. నువ్వు ఏం తెచ్చావో చెప్పే దమ్ముందా?. గిలకలదిండిలో 22 బెల్టు షాపులు పెట్టించావ్. దొంగతనంగా బయోడీజిల్ అమ్మే దొంగవి నువ్వు. పాపపు సొమ్ముతో బీచ్‌లో 63 అడుగుల వినాయకుడు పెడితే మీ పాపాలు పోతాయా?. రైతులు సాగుకు నీరు లేక నానా అవస్థలు పడుతుంటే నువ్వు పట్టించుకున్నావా?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.
ఇదీ చదవండి: కొల్లు రవీంద్రకు ఇదే నా ఛాలెంజ్: పేర్ని కిట్టు


