ఏపీ ప్రభుత్వం ప్రచారం విషయంలో వెనుకడుగు వేయడం లేదు. కొత్తగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారికి ప్రభుత్వం పరోక్ష వేతనం చెల్లించడానికి రెడీ అయింది. ఇది ఒకరకంగా పరీక్ష లేకుండానే క్రీడా కోటాలో కొందరికి టీచర్ల ఉద్యోగాలు ఇచ్చిన చందంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్, ఇప్పటికే తనకు అనుకూలంగా పనిచేస్తున్న దాదాపు ఎనభై శాతం ప్రధాన మీడియాకాని, వందల సంఖ్యలో ఉన్న యూట్యూబ్ చానళ్లు తమ ప్రచారానికి సరిపోవడం లేదని అనుకుంటోందా? లేక వాటిని జనం నమ్మడం లేదన్న అభిప్రాయానికి వచ్చిందా అన్నది తెలియదు కాని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పేరుతో అంటే ప్రభావశీలురతో కంటెంటె పెట్టిస్తారట. దానికి భారీగా చెల్లింపులు చేస్తారట.
కొత్తగా పెన్షన్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికి నాలుగువేల రూపాయల చొప్పున మంజూరు చేయడానికి డబ్బులు లేవని మంత్రి అచ్చెన్నాయుడు ఆ మధ్య ఉపన్యాసం ఇచ్చారు. ఉద్యోగుల జీతాలకే ప్రభుత్వ ఆదాయంలో 94-98 శాతం ఖర్చు అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలిపారు. సంపద సృష్టించే మార్గాలు కనబడడం లేదని, ఐడియాలు ఉంటే ఇవ్వండని ప్రజలనే ఆయన సలహా కోరారు. అవన్ని వాస్తవమా? కాదా? అన్నది మనం చెప్పలేం.
కాని, చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సోషల్ మీడియాలో కూటమి సర్కార్ పక్షాన, చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌ల పక్షాన ప్రచారం చేయడానికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయల నుంచి లక్షన్నర వరకు ఇస్తారట. ప్రభుత్వం ఇచ్చే కంటెంట్ పోస్టు చేస్తే ఒక రేటు, స్వయంగా తయారు చేసే కంటెంట్‌కు మరో రేటు ఉంటుందట. ప్రభుత్వం ఇచ్చే గ్రాఫిక్స్ పోస్టింగ్‌లకు కేటగిరిని బట్టి 500 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఇస్తారట. ఆడియో, వీడియో పోస్టింగ్‌లకైతే 750 నుంచి రెండువేల రూపాయల వరకు ఇస్తారట. సొంతంగా తయారు చేసే వీడియోలకు గాను క్రియేటర్స్‌కు 2500 నుంచి ఇరవైవేల వరకు చెల్లిస్తారట. దీనికి ఏవో కండిషన్లు అని చెప్పినా, చివరికి ఏమి జరుగుతుందో ఊహించుకోవచ్చు.
ఎన్నివేల మందిని ఇందుకోసం వినియోగించుకుంటారో, ఎంత బడ్జెట్ కేటాయిస్తారో వెల్లడించలేదు. హిమచల్ ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్‌లలో వివిధ పద్దతులలో ఇలాంటి స్కీములను అమలు చేస్తున్నారట. యూపీలో ఆయా సోషల్ మీడియా ఫ్లాట్ పారంలకు నేరుగా డబ్బులు ఇస్తారట. వీటిని కాపీ చేసి ఏపీ ప్రభుత్వం వీటిని అమలు చేస్తోందన్నమాట. ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్‌తో ప్రభుత్వ ప్రచారం చేస్తుంటుంది. అందులో కూడా కంటెంట్ తయారు చేస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, తదతర మీడియా సంస్థలకు ప్రచార ప్రకటన రూపంలో, ఇతరత్రా భారీగానే లబ్ది చేకూర్చుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వారు మరీ ఏకపక్షంగా టీడీపీ కరపత్రాలుగా ప్రచారం చేస్తుండడంతో ప్రజలలో విశ్వసనీయత తగ్గిపోతోంది.
ఈ నేపథ్యంలో ఈ కొత్త ఐడియాను తీసుకువచ్చి ప్రజాధనాన్ని వెచ్చించబోతున్నారన్నమాట. నిజంగానే ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైనా పోస్టు చేస్తే ఫర్వాలేదు. ప్రభుత్వం ఇచ్చే గ్రాఫిక్స్, వీడియోలు అంటే కేవలం ప్రభుత్వ నేతల ప్రచారమే అత్యధికశాతం ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. దానికి తోడు ఇప్పుడు ఈ ఇన్‌ఫ్లూయేన్సర్‌లు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాలో వచ్చే విషయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్నమాట. అలాగే ఇండిపెండెంట్‌గా పనిచేసే యూట్యూబర్లు వెలికితీసే వాస్తవాలను ఖండించాలన్నమాట. వైఎస్సార్‌సీపీ నేతలపై బురద చల్లే పనిలో నేర్పరితనం ప్రదర్శించాలన్నమాట. డైవర్షన్ రాజకీయాలలో భాగస్వాములవ్వాలన్నమాట.
ఇదీ చదవండి: దానం ఎపిసోడ్.. డిఫెన్స్‌లో కాంగ్రెస్, రేవంత్?
ఉదాహరణకు డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆధారాలు చూపుతున్నప్పుడు అవేవి సరికావన్నట్లుగా ప్రచారం చేయాలి. ఇలాంటి డైవర్షన్ విషయాలలో చంద్రబాబును మించిన మొనగాడు మరొకరు ఉండకపోవచ్చు. డీఎస్సీ స్కామ్‌పై నిరసన చెప్పడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీవారిపై దాడి చేసింది టీడీపీవారు లేదా టీడీపీ యువగళం టీమ్ అన్నది బహిరంగ రహస్యమే. వారే ఈ విషయం చెప్పుకున్నారు. కాని వ్యూహాత్మకంగా గురువులపై వైఎస్సార్‌సీపీ దాడి అని చంద్రబాబే ప్రచారం ఆరంభించారు. అది నిజం కాదని ఆయనకు తెలుసు. పోలీసులకు తెలుసు. లేదా రెండు వైపులా ఏమైనా గొడవ జరిగితే ఇరుపక్షాలకు చెందినవారిమీద కేసులు పెట్టవచ్చు.
అదేమి కాకుండా వైఎస్సార్‌సీపీపైన ఎంత వీలైతే అంత బురద చల్లడం, జగన్‌పై పిచ్చి, పిచ్చి ఆరోపణలు చేయడంతో అసలు స్కామ్‌ను దారి మళ్లించాలన్నది వారి వ్యూహమన్నమాట. దీనికోసం ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ఎంత బాగా పనిచేసి అంతగా వ్యూస్ సంపాదిస్తే వారికి అంతగా డబ్బు వస్తుందన్నమాట. ఇదంతా టీడీపీ తరపున ఇప్పటికే పనిచేస్తున్నవారికి డబ్బులు ఇవ్వడానికే ఈ స్కీమ్ తెచ్చారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు. డీఎస్సీలో పరీక్షలు లేకుండా టీచర్ ఉద్యోగాలు కొంతమందికి ఇచ్చి అప్రతిష్ట తెచ్చుకున్న నేపథ్యంలో ఈ స్కీమ్ ప్రకారం తమకు కావల్సిన వారికి ప్రభుత్వం డబ్బు ఇష్టారీతిన వెచ్చించే అవకాశం ఉండవచ్చన్నది కొందరి అనుమానం.
ఒకవైపు ఇలా జనం డబ్బుతో వారినే మభ్య పెట్టడానికో, నమ్మించడానికో సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ, మరో వైపు పోలీసుల ద్వారా తమకు వ్యతిరేకంగా స్కామ్‌లను బయటపెడుతున్న సోషల్ మీడయాను అణచివేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలో చివరికి అమెరికాకు చెందిన పోలీస్ వ్యవస్థ ఎఫ్‌బీఐ పేరుతో కూడా నకిలీ ఫిర్యాదులు చేయడానికి ఏపీ పోలీసు వ్యవస్థ సిగ్గుపడకపోవడం దారుణంగా ఉంటుంది.
ఎవరైనా వేరే సంస్థ పేరుతో తప్పుడు ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టే పోలీసులే స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలకు నకిలీ ఫిర్యాదులు చేయడం ఏమిటి? తద్వారా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వాస్తవ పోస్టులను తొలగించేలా చూడడం ఏమిటి? ఏపీలో పోలీసు వ్యవస్థ ఎంతసేపు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాను అణచివేయడం, వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం, వారి అక్కౌంట్లను మూసివేయించడం పనిలోనే బిజీగా ఉంటున్నట్లు కనిపిస్తుంది.
ఎక్స్‌లో 150 ఖాతాలు తొలగింపచేశారట. సుమారు 800 పోస్టులు తొలగించారట. చివరికి జడ శ్రవణ్ వంటివారు మీడియా సమావేశాలలో చేసే విమర్శల వీడియోలు కొన్నిటిని సైతం ఇండియాలో కనబడకుండా చేస్తున్నారంటే ప్రభుత్వం సోషల్ మీడియాకు ఎంత భయపడుతోందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ కొత్త ఐడియాను ప్రవేశపెట్టి టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఉపాధి స్కీము కింద ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టబోతున్నారన్నమాట. అంత మాత్రాన ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత తగ్గుతుందా? అన్నది సందేహమే!
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


