సాక్షి, కడప: కడప టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కడప మేయర్ పదవిని బలిజలకు కేటాయించాలని కోరుతూ కాపు జేఏసీ కన్వీనర్ విజయ్‌కుమార్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు దీపక్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డికి వ్యతిరేకంగా మేయర్ పదవి కోసం డిమాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో.. అర్ధరాత్రి విజయ్‌కుమార్‌కు చెందిన కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు బలిజ నేతలు ఆరోపిస్తున్నారు.
జిల్లాకు వచ్చిన టీడీపీ ఎన్నికల పరిశీలకుడు దీపక్‌రెడ్డిని కలిసిన విజయ్‌కుమార్.. కడప మేయర్ సీటును బలిజలకు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం స్థానిక టీడీపీలో వర్గ విభేదాలను మరింత తీవ్రతరం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీరును ప్రశ్నిస్తున్నందుకే తమ వర్గానికి చెందిన నేతలపై దాడులు జరుగుతున్నాయని కొందరు టీడీపీ బలిజ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే తీరును మరో బలిజ నేత చెన్నంశెట్టి మురళీ బహిరంగంగా ప్రశ్నించినట్లు వారు చెబుతున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వ్యతిరేకంగా పార్టీ అధిష్ఠానం పంపిన నేతలను టీడీపీలోని కొందరు స్థానిక నాయకులు కలుస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కడప టీడీపీలో అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. విజయ్‌కుమార్ కారును ధ్వంసం చేసిన ఘటనపై సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీలోని బలిజ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులెవరు, రాజకీయ విభేదాలే కారణమా అన్నది తేలాల్సి ఉంది.
ఇదీ చదవండి: ‘డబ్బులిస్తాం.. డప్పుకొట్టిండి’


