నేడు వరల్డ్ హార్ట్ డే
ఏటా ప్రపంచవ్యాప్తంగా 23 లక్షల మంది గుండె సమస్యలతో జననం
అభివృద్ధి చెందుతున్న అల్పాదాయ దేశాల్లో నాణ్యమైన వైద్యం దూరం
భారత్‌లో ప్రతి వెయ్యి సజీవ జననాల్లో 5.7 మందిలో సమస్య
వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2026’ నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఏటా 23 లక్షల నుంచి 25 లక్షల మంది చిన్నారులు పుట్టుకతోనే వచ్చే గుండె లోపాలు(కంజెనిటల్ హార్ట్ డిసీజ్)తో జని్మస్తున్నారు. ఈ విషయాన్ని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ తాజాగా విడుదల చేసిన ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2026’ నివేదికలో వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం ప్రస్తుతం భూగోళంపై దాదాపు 1.6 కోట్ల మంది ఈ సమస్యతో జీవిస్తున్నారు. గడిచిన 30 ఏళ్లలో వైద్యరంగం ఎంతో పురోగతి సాధించినప్పటికీ అభివృద్ధి చెందుతున్న, అల్పాదాయ దేశాల్లోని చిన్నారులకు ఇంకా నాణ్యమైన వైద్యం అందడం లేదు. నవజాత శిశువుల మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణంగా నిలుస్తున్నట్లు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తంచేసింది.
ప్రతి వెయ్యి జననాల్లో 5.7 మందిలో సమస్య
⇒ భారతదేశంలో పరిస్థితులపై ఉత్తర భారత్‌లో అధ్యయనం చేయగా ప్రతి వెయ్యి సజీవ జననాల్లో 5.7 మంది శిశువులు గుండె కింద గదుల మధ్య రంధ్రం(వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్) సమస్యతో జని్మస్తున్నారని వరల్డ్ హార్ట్ రిపోర్ట్ వెల్లడించింది.
⇒ భారత్‌లో పీడియాట్రిక్ గుండె శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరితే సగటున రూ.2,01,898 వరకు ఖర్చు అవుతోంది.
⇒ గుండెలో రంధ్రం పూడ్చే సర్జరీకి రూ.65,000 నుంచి రూ.4.50 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
⇒ కేరళం ప్రభుత్వం అమలు చేసిన ‘హృదయం’ ప్రాజెక్ట్ ప్రపంచానికే ఒక గొప్ప మార్గదర్శకమని ఆ నివేదిక కొనియాడింది. ఈ విధానంతో ఎందరో చిన్నారుల ప్రాణాలు నిలిచాయని వెల్లడించింది.
⇒ సంపన్న దేశాల్లో 80 శాతానికి పైగా శిశువులకు అవసరమైన గుండె సర్జరీలు పుట్టిన వెంటనే
అందుబాటులో ఉంటున్నాయి. అల్పాదాయ, నిరుపేద దేశాల్లో ఇది కేవలం 0 నుంచి 5 శాతం మందికే పరిమితం అవుతోంది.
పుట్టుకతో గుండె జబ్బులకు కారణాలు ఇలా..
⇒ ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్’ ప్రకారం 40శాతం జన్యుపరమైన లోపాలతోనే గుండె జబ్బులు వస్తున్నాయి. క్రోమోజోమ్ లోపాలు 8–10 శాతం బాధ్యత వహిస్తున్నాయి.
⇒ గర్భధారణకు ముందు తల్లికి డయాబెటిస్ ఉంటే శిశువుకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం 2.5 నుంచి 5 రెట్లు పెరుగుతుంది.
⇒ తల్లి స్థూలకాయంతో ఉంటే శిశువుకు గుండె జబ్బుల ముప్పు 29శాతం ఎక్కువ అవుతుంది.
⇒ గర్భధారణ సమయంలో వాయు కాలుష్యంతో 23శాతం ముప్పు పెరగ్గా, గర్భం దాల్చిన తొలి 3 నుంచి 8 వారాల్లో తీవ్రమైన ఎండల బారినపడితే గుండె లోపాల తీవ్రత పెరుగుతుందని ఆ నివేదిక వివరించింది.


