మంత్రి డోలా మాటలపై సర్వత్రా విమర్శలు
ప్రజల ఇళ్ల వద్దకు సేవలందించిన వ్యవస్థపై ఇంత అక్కసా?
17 కేటగిరి ఉద్యోగులకు గత ప్రభుత్వంలోనే పదోన్నతుల ఛానల్స్‌కు రూపకల్పన
2024కు ముందే పలువురు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం అనాలోచితంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చిందని.. లక్ష ఉద్యోగాలను ఒక్కసారిగా భర్తీ చేయడం తగదని రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయులు వ్యాఖ్యానించడంపై ఉద్యోగ వర్గాలు, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2019లో అప్పటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి.. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. ఆయా సచివాలయాల్లో పని చేసేందుకు 1.34 లక్షల కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించింది.
నాలుగు నెలల వ్యవధిలో నియామక ప్రక్రియను పూర్తి చేసింది. ఉద్యోగ నియామకంతో పాటే ఆయా కేటగిరి ఉద్యోగులకు సర్వీసు రూల్స్ ఖరారు చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా జీవోలు కూడా జారీ అయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 కేటగిరిల ఉద్యోగులు పని చేస్తుండగా, అందులో 17 కేటగిరి ఉద్యోగులకు ఆ ఐదేళ్ల కాలంలో పదోన్నతుల ఛానల్స్‌కు రూపకల్పన చేసి, ఆ మేరకు విధి విధానాలతో 2024కు ముందే పలువురు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు సైతం కల్పించింది.
మిగతా రెండు కేటగిరీలైన ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో పాటు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉద్యోగుల పదోన్నతుల ఛానల్స్ విధివిధానాల రూపకల్పన సైతం 2024 నాటికే దాదాపు పూర్తయింది. తుది ఆమోదం, జీవోలు విడుదలకు ముందే ఎన్నికల నోటిఫికేషన్‌తో అప్పట్లో ఆ ప్రక్రియ ఆగిపోగా.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 27 నెలలు పూర్తవుతున్నా, దానిని పూర్తి చేయలేదు. ఇప్పుడు దీనిపై ఉద్యోగులు ఎక్కడ ప్రశ్నిస్తారని.. మంత్రితో విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఆయా రెండు కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల విధివిధానాలపై 15 రోజుల్లో జీవోలు ఇస్తామంటూ పేర్కొనడం గమనార్హం.
అప్పట్లోనే గెజిట్ నోటిఫికేషన్
మరోవైపు, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తప్పుపడుతూ మాట్లాడుతుండటంతో నియమాకాలు జరిగిన ఉద్యోగులకు మరింత ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగుల నియామక ప్రక్రియపై గత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. ఇదిలా ఉండగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషనలైజేషన్ పేరిట ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో ఉండే ఉద్యోగుల సంఖ్యను కు
దించింది. ఈ ప్రక్రియలో వేలాది మంది ఉద్యోగులను మిగులు ఉద్యోగులుగా తేల్చింది.
ఇతర ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయని కారణంగా.. ఆయా శాఖల్లో ఉద్యోగుల అవసరం పెరగడంతో.. గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగులు ఉద్యోగులుగా తేలి్చన వారిని ఆయా శాఖలకు డిప్యూటేషన్‌పై పంపేందుకు చర్యలు చేపట్టింది. అలా ఆయా శాఖలకు సర్దుబాటు చేసింది. కాగా, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ అమలు చేస్తూ 2009 జనవరి 5వ తేదీ జీవో ఎంఎస్ నెంబరు 2 జారీ చేశారని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. తద్వారా నోషనల్ ఇంక్రిమెంట్లు అసాధ్యమని మంత్రి డోలా చెప్పిన మాటలు అవాస్తవమని స్పష్టం చేస్తున్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే సేవలు అందించిన వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం ఇంత నిస్సిగ్గుగా ఎదురు దాడి చేయడం సరికాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


