ఇసుక అక్రమాలను అడ్డుకునే వ్యవస్థ ఏది | AP High Court reacts strongly to illegal mining in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమాలను అడ్డుకునే వ్యవస్థ ఏది

Sep 29 2026 5:43 AM | Updated on Sep 29 2026 5:43 AM

AP High Court reacts strongly to illegal mining in Andhra Pradesh

అక్రమ తవ్వకాలపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు

సక్రమంగా తనిఖీలు చేయకపోవడం వల్లే అక్రమ తవ్వకాలు 

అడ్డుకునేందుకు ఓ వ్యవస్థ ఉండి తీరాల్సిందే.. ఓ అధికారిని ప్రత్యేకంగా నియమించండి 

అక్రమాలు జరిగితే ఆ అధికారిని బాధ్యుడిగా చేయండి 

ఈ దిశగా చర్యలు తీసుకునే విషయంలో వైఖరి ఏంటో చెప్పండి 

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

తనిఖీలు నిర్వహించేందుకు సిబ్బంది లేరనడంపై అసహనం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు సోమవారం తీవ్రంగా స్పందించింది. పిల్‌పై విచారణ జరిపిన సీజే ధర్మాసనం, ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునే వ్యవస్థ ఏదీ రాష్ట్రంలో లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని తేల్చి చెప్పింది. వీటిని అడ్డుకునేందుకు సమర్థవంతమైన వ్యవస్థ, యంత్రాంగం ఉండి తీరాలని స్పష్టం చేసింది. అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు ఓ అధికారిని నియమించాలంది. తద్వారా అక్రమ తవ్వకాలు జరిగితే ఈ అధికారిని బాధ్యుడిని చేసి, తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని తెలిపింది. తగిన వ్యవస్థను రూపొందించే విషయంలో మీ వైఖరి ఏమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తనిఖీలు నిర్వహించేందుకు తమ వద్ద తగినంత మంది సిబ్బంది లేరని, అక్రమ మైనింగ్‌ జరగకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని వాదనల సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది (మైన్స్‌) సాయి విహారి పేర్కొనడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది.  ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామన్న ధర్మాసనం, ఇసుక అక్రమ తవ్వకాలపై ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాలతో ఈ పిల్‌ను కూడా జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.  

పెద్ద తలకాయల జోలికి వెళ్లడం లేదు:  పిటిషనర్‌ వాదనలు 
బాపట్ల జిల్లా, చీరాల మండలం, కవురివారిపాలెం గ్రామ పరిధిలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, దీని వెనుక పెద్ద తలకాయలున్నాయని, దీంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆమంచి కృష్ణమోహన్‌  ఈ పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది మనోజ్‌ సోమవారం వాదనలు వినిపిస్తూ, ‘కవురివారిపాలెం గ్రామంలోని పలు సర్వే నంబర్లలో విచక్షణారహితంగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతూ పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నారు.  దీని వెనుక అధికార పార్టీకి చెందిన వారు ఉండటంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.  కేవలం వాహన డ్రైవర్లపై కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. అసలు సూత్రధారులను మాత్రం వదిలేస్తున్నారు’ అని విన్నవించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement