సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆడపిల్లకు ఇచ్చే ఆస్తి కన్నా ఆమెకు అందించే విద్యే జీవితాంతం అండగా నిలుస్తుంది. చదువు ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఏ రంగంలోకి వెళ్లినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కూతురిని చదివించి ఆమెకు నచ్చిన రంగంలో ఎదిగే అవకాశం కల్పిస్తే ఆ కుటుంబానికి ఆమె కేవలం కూతురిగా కాకుండా బలమైన శక్తిగా ఎదిగి, అండగా నిలుస్తుంది. ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించిన కుటుంబాలు ఇప్పుడు అదే కూతురిని తమ భవిష్యత్ ఆశగా చూస్తున్నాయి. చదువులో రాణిస్తూ, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు ఎదుగుతూ కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న కూతుళ్లు తల్లిదండ్రుల ఆలోచనలను మారుస్తున్నారు. అందుకే ‘కూతురే కావాలి’ అనే మాట వినిపించే రోజులు వస్తున్నాయి. నేడు కూతుళ్ల దినోత్సవం (డాటర్స్ డే) సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
అక్షరాలను ఆయుధాలుగా మలచుకొని నలుగురు కూతుళ్లు ఆ తండ్రిని కాలరెగరేసుకునేలా చేశారు. మండలంలోని ఎల్లంపేటకు చెందిన లక్యానాయక్ వ్యవసాయం చేస్తూ నలుగురు కూతుళ్లను చదివిస్తున్నాడు.పెద్ద కూతురు రేణుక ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం ఎండీ డెర్మటాలజీ చదువుతోంది. రెండో కూతురు సరిత ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. మూడో కూతురు స్వప్న డిగ్రీ పూర్తిచేసి పీజీ కోసం ప్రిపేర్ అవుతోంది. నాలుగో కూతురు సుస్మిత బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది.
బంగారు ఆభరణాలు తయారు చేస్తూ..
కామారెడ్డి పట్టణానికి చెందిన శ్రీనివాసచారి, భార్గవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. కులవృత్తి అయిన బంగారు ఆభరణాల తయారీ పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లను చదివిస్తున్నాడు. పెద్దకూతురు భావన బీటెక్ పూర్తి చేసి విప్రో కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. చిన్న కూతురు స్నిగ్ధశ్రీ ఇంటర్ చదువుతోంది. ఇద్దరూ చదువులో ముందున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాసచారి.


