సోమాజిగూడకు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారికి ఏఐ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ పెట్టుబడుల పెడితే అధిక లాభాలు ఆర్జించవచ్చని సైబర్ నేరస్తులు ఆశ చూపించడంతో ధని సెక్యూరిటీస్ అనే నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.3.37 కోట్లు పెట్టుబడులు పెట్టి ఆయన మోసపోయారు.
ఇజ్జత్‌నగర్‌కు చెందిన హైకోర్టు అడ్వొకేట్‌కు ఓ డేటింగ్ యాప్‌లో దిశా పరిచయమైంది. ఆయన వ్యక్తిగత ఫొటోలు, వివరాలను సేకరించి అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే పర్సనల్ చాట్, ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులకు చూపిస్తామనడంతో బాధితుడు రూ.5 కోట్లు సమర్పించుకున్నారు.
ఎర్రగడ్డకు చెందిన ఓ 44 ఏళ్ల డాక్టర్‌కు ఫేస్‌బుక్‌లో మహిళ పరిచయంతో ఆన్‌లైన్ ట్రేడింగ్ వైపు ఆకర్షితులయ్యారు. ఆమె మాటలు నమ్మి నకిలీ వెబ్‌సైట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. విడతల వారీగా ఆయన నుంచి ఏకంగా రూ.14.61 కోట్లు డిపాజిట్ చేయించుకుని మోసగించారు. ఇది తెలంగాణ సైబర్ క్రైమ్ చరిత్రలోనే రికార్డు మొత్తం.
ఇలా.. లాయర్, పోలీసు, డాక్టర్, ఐఏఎస్.. విద్యావంతులే సైబర్ వలలో చిక్కుతున్నారు. వీరిని మోసం చేస్తోంది అక్షరం ముక్కరాని, పాతికేళ్ల లోపు కుర్రాళ్లే. ఆంగ్లంలో మాట్లాడటం, అత్యాధునిక సాంకేతికతపై పట్టు సాధించడమే ఈ నేరస్తుల ప్రధాన అస్త్రంగా మారింది. బాధితులు మోసపోవడానికి అతి తెలివి, అత్యాశ, తొందరపాటే ప్రధాన కారణాలని తెలుస్తోంది.
95% మందికి కనీస విద్యార్హతల్లేవు..
పోలీసులకు చిక్కుతున్న సైబర్ నేరస్తులలో 95 శాతం మందికి సరైన చదువు, కనీస విద్యార్హతలు ఉండటం లేదు. అయినా డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటూ నిమిషాల్లో రూ.లక్షల్లో గుంజేస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లను సృష్టిస్తున్నారు. ఏఐ వాయిస్ క్లోనింగ్ చేయడం, డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం వంటి కొత్త పద్ధతులను అలవోకగా వాడేస్తున్నారు. కస్టమర్ కేర్, డిజిటల్ అరెస్ట్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ, వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో విద్యావంతులను సైబర్ ముఠాలు బురిడీ కొట్టిస్తున్నాయి. సైబర్ కేటుగాళ్ల నెట్‌వర్క్ ప్రధానంగా రాజస్థాన్, హరియాణా, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచే ఆపరేట్ అవుతున్నాయి. 20–25 ఏళ్ల యువతను చేరదీసి ఆంగ్లం కమ్యూనికేషన్, బ్యాంకింగ్ లూప్‌హోల్స్‌పై శిక్షణ ఇచ్చి ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు దొరక్కుండా విదేశీ వర్చువల్ నంబర్లు (వీఓఐపీ), టెలిగ్రామ్ ఛానెళ్లు, డిజిటల్ వ్యాలెట్లను ఉపయోగిస్తున్నారు.
అవగాహనే శ్రీరామరక్ష..
గృహిణులు, నిరుద్యోగులు, విద్యావంతులకూ డిజిటల్ పరిజ్ఞానం, సైబర్ మోసాలపై అవగాహన అత్యవసరం. చట్టపరంగా డిజిటల్ అరెస్ట్ అనే విధానమే లేదని, ఎలాంటి ప్రభుత్వ సంస్థలు లేదా పోలీసులు ఫోన్ కాల్స్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా పోగొట్టుకున్న సొమ్మును వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంటుంది.


