ఫెస్టివ్ మోడ్ ఆఫ్... షూట్ మోడ్ ఆన్
టాలీవుడ్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది హైదరాబాద్. తెలుగు చిత్ర పరిశ్రమకుహైదరాబాద్‌ని హబ్‌గా పిలుస్తుంటారు. టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోలు, యువ హీరోలు, హీరోయిన్లతో పాటు పలువురు సాంకేతిక నిపుణులు భాగ్యనగరంలోనే నివాసం ఉంటుంటారు. (పర భాష వాళ్లు మినహా). ఇక్కడ షూటింగ్‌లకు అనువైన పలు స్టూడియోలు అంతర్జాతీయ వసతులతో ఉన్నాయి. అదే విధంగా హైదరాబాద్ సమీపంలోని పలు ప్రాంతాల్లో ఆయా సినిమాల షూటింగ్స్ కోసం ఇండోర్, ఔట్‌డోర్‌లలో భారీ సెట్టింగులు సైతం వేస్తుంటారు.
కేవలం ఇక్కడ మాత్రమే కాదు... కథ డిమాండ్ చేస్తే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాల్లోనూ షూటింగ్స్ చేస్తుంటారు మేకర్స్. అయితే ఎక్కువ మంది హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే అధికంగా చిత్రీకరణలు జరుపుతుంటారు. ప్రస్తుతం భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో పలు మూవీ షూటింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. చిరంజీవి, నాగార్జున, రవితేజ, ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, శర్వానంద్ వంటి పలువురు స్టార్స్ హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్‌కి హ్యాపీగా... జాలీగా వెళ్లి వస్తున్నారు. దీపావళి ఫెస్టివ్ మోడ్‌ని ఆఫ్ చేసి షూట్ మోడ్ ఆన్ చేశారు. ఆ విశేషాలేంటో చూద్దాం...
ముచ్చింతల్‌లో...
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’(2023) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ఈ సినిమాలో నివేదా పేతురాజ్, అనస్వర రాజన్ , సునీల్, అనురాగ్ కశ్యప్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవితో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ బాబీ. ‘‘చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘కాకా’. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ‘కాకా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో ఆయన్ని ఆసక్తికరమైన షేడ్స్‌లో పరిచయం చేయడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. తాజాగా దీపావళి సందర్భంగా విడుదల చేసిన సరికొత్త పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో భాగం కావడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌లో టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అడిషినల్ రైటర్స్‌గా పని చేస్తుండగా, భాను–నందు డైలాగ్స్ అందిస్తుండగా, శరణ్య పోట్ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘కాకా’ చిత్రాన్ని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
మాదాపూర్‌లో...
నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ 100’. తన కెరీర్‌లో 99 సినిమాలు పూర్తి చేసుకున్న ఆయన నటిస్తున్న వందో మూవీ ఇది. ఈ సినిమాకి తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు నాగార్జున. ఈ చిత్రంలో నటి టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో పాటు టబు పాల్గొంటున్నారు. వీరిద్దరితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సీన్స్ చిత్రీకరిస్తున్నారట కార్తీక్. ‘‘యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న సినిమా ‘కింగ్ 100’. నాగార్జున కెరీర్‌లో ఓ మైలురాయిగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు
కార్తీక్.
అక్కినేని అభిమానులకే కాదు... సగటు మూవీ లవర్స్‌కి కూడా ఈ మూవీ నచ్చేలా ఇటు నాగార్జున, అటు కార్తీక్ ప్రత్యేమైన శ్రద్ధతో ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత నాగార్జున–టబు కలిసి నటిస్తున్న చిత్రం ఇది. 28 ఏళ్ల తర్వాత వీరి రీయూనియన్ మరోసారి వెండితెరపై ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుంది. నవంబరు 4న టబు పుట్టినరోజు. ఈ సందర్భంగా మహంతి ఝాన్సీ రాణిగా ఆమె పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ప్రత్యేక గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా ‘కింగ్ 100’ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. నాగార్జున కెరీర్‌లో వందో చిత్రంగా రూపొందుతోన్న ‘కింగ్ 100’ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, రాజా మహదేవన్ కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు’’ అని మేకర్స్ చె΄్పారు.
బీరంగూడలో...
‘ఇరుముడి’ వంటి హిట్ మూవీ తర్వాత రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘తులాభారం’. వివేక్ ఆత్రేయ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, అనస్వర రాజన్, జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్, అనిల్ కరెళ్ల, రవి ఆంటోనీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీనిరావు నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం లింగంపల్లి సమీపంలోని బీరంగూడ కొడకంచి ఆలయంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో రవితేజతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటుండగా పలు కీలక సన్నివేశాలు తీస్తున్నారట వివేక్ ఆత్రేయ. ‘‘రవితేజ కెరీర్‌లో 78వ చిత్రంగా ‘తులాభారం’ రూపొందుతోంది. రవితేజ ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, వివేక్ ఆత్రేయ యూనిక్ స్టయిల్ స్టోరీ టెల్లింగ్ కలగలిసి క్రైమ్, డ్రామా, ఎంటర్‌టైన్ మెంట్‌తో ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఉంటుంది. ‘ఇరుముడి’ విజయంతో జోరు మీదున్న రవితేజ ‘తులాభారం’ ప్రాజెక్ట్‌తో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు.
తనదైన ఎనర్జీ, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్తో ‘మాస్ మహారాజా’గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రవితేజ ‘తులాభారం’తో సరికొత్త ఐడెంటిటీని సొంతం చేసుకోబోతున్నారు. ఈ మూవీలో ‘మాస్ మహారాజా’కు బదులుగా ‘క్రైమ్ మహారాజా’గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తూ వినూత్నంగా రూపొందించిన ‘ది టైటిల్ డాక్యుమెంటరీ’ వీడియోకి చక్కని స్పందన వస్తోంది. ఈ చిత్రంలో జడేజాగా అనిల్ కరెళ్ల, రాబిన్ గా రవి ఆంటోనీ, సౌండ్‌గా అనస్వర రాజన్, దేవరాజ్‌గా తరుణ్ భాస్కర్, శివాజీ రావుగా జేడీ చక్రవర్తి, కృష్ణవేణిగా ప్రియాంక మోహన్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, జీఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్. నరసింహారావు.
కోకాపేటలో...
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘ఫౌజీ’. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘సీతా రామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో జరుగుతోంది. ఇటలీ వెకేషన్‌ని పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చిన ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ప్రభాస్‌తో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి.
‘‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఫౌజీ’. 1940ల నాటి నేపథ్యంలో సాగే పీరియాడిక్ వార్ యాక్షన్ డ్రామాగా రెండో ప్రపంచ యుద్ధం, ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ మూవీలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ‘సీతా రామం’ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తోన్న ‘ఫౌజీ’పై ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియన్స్‌లో భారీ హైప్ నెలకొంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘ఫౌజీ’ని వేసవి కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు.
శంషాబాద్‌లో...
మహేశ్ బాబు హీరోగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంకా చో్రపా, మలయాళ నటుడు పథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోంది. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ని పూర్తి చేసిన మహేశ్ ఈ షెడ్యూల్‌లో పాల్గొనడం లేదు. ఇతర తారాగణంపై పలు సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట రాజమౌళి.
ఈ చిత్రంలో మహేశ్ బాబు శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ వైపు చిత్రీకరణ తుది దశకు చేరుకుంటున్న ఈ మూవీ మరోవైపు పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ వంటి సినిమాలతో విదేశాల్లోనూ రాజమౌళి సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ‘వారణాసి’కి కూడా అంతకు మించి క్రేజ్ నెలకొంది. దీంతో ఈ చిత్రాన్ని ప్రపంచంలోని అనేక భాషల్లోకి డబ్ చేసి, విడుదల చేయనున్నారు మేకర్స్. మహేశ్ బాబు–రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం భారతీయ ప్రేక్షకులే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆర్‌ఎఫ్‌సీలో...
ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్, సలార్’ మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘కాంతారా’ మూవీ ఫేమ్ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. చేతికి గాయం కావడంతో ఆపరేషన్ చేసుకుని, కొద్ది రోజులు షూటింగ్ నుంచి విరామం తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కోలుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడాయన ‘డ్రాగన్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌పై క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట ప్రశాంత్ నీల్.
ఈ పోరాట సన్నివేశాలు యాక్షన్ ప్రియుల రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని టాక్. ఈ హై ఓల్టేజ్ క్లైమాక్స్ సీన్స్‌తో ఎన్టీఆర్ అభిమానులకు థియేటర్లలో పూనకాలు ఖాయం అని వినిపిస్తోంది. హీరో, విలన్స్ మధ్య సాగే ఈ పోరాట ఘట్టాలు ఆడియన్స్‌ని సైతం మెస్మరైజ్ చేస్తాయని తెలుస్తోంది. ప్రత్యేకించి ఈ ఫైట్ కోసం ఓ భారీ సెట్‌ను తీర్చిదిద్దారట మేకర్స్. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ ప్రెజెంటేషన్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఆయన బాడీ లాంగ్వేజ్, ఫైటింగ్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ను దృష్టిలో పెట్టుకుని యాక్షన్ సన్నివేశాలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. కేవలం భారీ ఫైట్లు మాత్రమే కాకుండా, ప్రతి యాక్షన్ ఎపిసోడ్‌లో ఒక ప్రత్యేకమైన ఇంపాక్ట్ ఉండేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘డ్రాగన్’ 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
శంకర్‌పల్లిలో...
శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘జార్జ్ క్రిష్’. ‘నారీ నారీ నడుమ మురారి, బైకర్’ వంటి హిట్ మూవీతో ఫుల్ జోష్‌లో ఉన్న శర్వానంద్ దర్శకుడు శ్రీను వైట్లతో తొలిసారి చేతులు కలిపారు. ఏటీవీ సమర్పణలో అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ‘జార్జ్ క్రిష్’ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శర్వానంద్, మానస వారణాసితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ‘‘శ్రీను వైట్ల పుట్టినరోజు (సెప్టెంబరు 24) సందర్భంగా విడుదల చేసిన ‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీను వైట్ల సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే హ్యూమర్, ఫన్ ఈ సినిమాలో ఉంటాయి.
ఈ మూవీలో శర్వానంద్ జార్జ్, క్రిష్ అనే రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. శ్రీను వైట్ల కొత్త బ్యాక్‌డ్రాప్, డిఫరెంట్ కథాంశాన్ని ఎంచుకుని, తన సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే ఫుల్ ఎంటర్‌టైన్ మెంట్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ ఎనర్జిటిక్, లైవ్లీ మ్యూజిక్ అందిస్తుండగా, కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్‌గా పని చేస్తున్నారు. అదే విధంగా నందు సవిరిగాన, గోపీ మోహన్ రచయితలుగా వ్యవహరిస్తుండగా, కిశోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘జార్జ్ క్రిష్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు హ్యూమర్, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్ మెంట్‌తో కూడిన కలర్‌ఫుల్ ఫీస్ట్ అందించేందుకు ‘జార్జ్ క్రిష్’ సిద్ధం అవుతోంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు.
ఆర్‌ఎఫ్‌సీలో...
‘కాంతారా’ మూవీ ఫేమ్ రిషబ్ శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘జై హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘హనుమాన్’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తేజ సజ్జా హీరోగా నటించారు. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ 2024 జనవరి 12న రిలీజై, పాన్ ఇండియా హిట్ అందుకుంది. ‘హనుమాన్ ’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జై హనుమాన్’. ఈ మూవీలో ఆంజనేయ స్వామిగా రిషబ్ శెట్టి నటిస్తున్నారు. ‘హను–మాన్ ’లో హనుమంతుగా నటించిన తేజ సజ్జా సీక్వెల్‌లోనూ కనిపించనున్నారు. ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ వర్మ. ‘హనుమాన్’ మూవీ సూపర్ హిట్ కావడంతో ‘జై హనుమాన్’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే... పైన పేర్కొన్న చిత్రాలే కాదు... మరికొన్ని సినిమాల చిత్రీకరణలు కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి.
– డేరంగుల జగన్ మోహన్


