'ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు'.. టాలీవుడ్‌లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మంచి సినిమాలు తీసి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయాల్సిన నిర్మాతలు.. ఇండస్ట్రీలో ఇన్నాళ్లుగా ఉన్న రహస్యాల్ని బయటపెట్టేస్తున్నారు. ఇవి చూసిన నెటిజన్లు.. టాలీవుడ్‌పై జాలి పడుతున్నారు. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? ఇక్కడ ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు?
(ఇదీ చదవండి: ఎందుకు ఇబ్బందిపెడతారు? రేణు దేశాయ్ పోస్ట్ వైరల్)
సినిమా గురించి ఎవరెన్ని చెప్పినా సరే ఇది ఓ వ్యాపారం. నిర్మాత డబ్బు పెట్టి సినిమా తీస్తాడు. అన్ని కుదిరి అది బాగుంటే.. ప్రేక్షకులు లాభాలు కురిపిస్తారు. కానీ చాలామంది నిర్మాతలు సరైన కంటెంట్ ఇవ్వడం మానేసి.. ప్రమోషనల్ గిమ్మిక్కులనే నమ్ముకుంటున్నారు. థియేటర్లకు రాకపోతే ప్రేక్షకులదే సమస్య అన్నట్లు ఉల్టా మాట్లాడుతున్నారు. ఇలాంటి పనులు చేయడం వల్ల వచ్చే ఒకరిద్దరు ఆడియెన్స్ కూడా థియేటర్లకు రావడం మానేస్తారనే ప్రాథమిక విషయాన్ని మర్చిపోతున్నారు.
కరోనా వచ్చి వెళ్లిన తర్వాత అంటే ఆరేడేళ్లలో ప్రేక్షకులు, తెలుగు సినిమాలని చూసే విధానమే మారిపోయింది. దానికి కారణం ఓటీటీ. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు, సిరీస్‌లని ఓటీటీల్లో చూస్తున్న ప్రేక్షకులకు.. తెలుగులో వస్తున్న చాలా మూవీస్ ఏ విషయంలోనూ బెస్ట్ అనిపించట్లేదు! దానికి తోడు కమర్షియల్ అంశాల పేరు చెప్పి అవసరం లేకపోయినా సరే పాటలు, ఫైట్స్, రొమాన్స్, కామెడీ లాంటివి కథలో ఇరికిస్తున్నారు. ఒకప్పుడు ఇవన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయేమో గానీ ఇప్పటితరం ఆడియెన్స్ ఇలాంటి వాటిని అస్సలు ఆదరించట్లేదు.
మరోవైపు మలయాళ, తమిళ సినిమాలనే తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు.. తెలుగు చిత్రాల్ని ఆదరించట్లేదు అని చాలామంది నిర్మాతలు ప్రేక్షకులని విమర్శిస్తున్నారు. అయితే ఏ మూవీ చూడాలనేది ప్రేక్షకుడి ఇష్టం. మంచిగా తీస్తే తెలుగు సినిమానైనా సరే నెత్తిన పెట్టుకుంటాడు. మళ్లీ మళ్లీ థియేటర్‌కి వచ్చి చూస్తాడు. కానీ మన నిర్మాతలు.. కంటెంట్ పరంగా మలయాళ, తమిళ ఇండస్ట్రీలతో పోటీ పడడటం మానేసి కలెక్షన్స్, టాక్ ఫేక్ చేయడం లాంటి వాటిపై ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
(ఇదీ చదవండి: ఒకటి కాదు..రెండు, మూడు సార్లు విడాకులు తీసుకున్న స్టార్స్ వీళ్లే)
రీసెంట్ టైంలో ధీరజ్ మొగిలినేని, నాగవంశీ లాంటి నిర్మాతలు పల ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ మేం చెప్పే వసూళ్లు నిజం కాదు, బుక్ మై షోలో చూపించే రేటింగ్స్ నిజం కాదు అని అంటున్నారు. ఇదే కాదు ఓ మూవీ.. థియేటర్లలో రిలీజ్ కావడం లేటు.. జెన్యూన్‌గా అసలు టాక్ బయటకు రావడానికి ముందే పెయిట్ ట్వీట్స్ హోరెత్తుతున్నాయి. దీంతో నిజమైన టాక్ తెలియక ప్రేక్షకుడు అయోమయానికి గురవుతున్నాడు. ఇవన్నీ ఎందుకు ఓటీటీలోకి వచ్చిన తర్వాత మూవీ చూసుకుందాంలే అనుకుంటున్నాడు. వీటన్నింటి దెబ్బకు సినిమా తీసిన నిర్మాత.. చూస్తున్న ప్రేక్షకుడు ఇద్దరూ నష్టపోతున్నారు.
హీరోల ఇమేజీ డ్యామేజీ అయిపోవద్దని చెప్పి చాలామంది నిర్మాతలు.. కలెక్షన్స్ ఫేక్ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే జనాలు ఇలాంటి నమ్మేసేవాళ్లు. కానీ స్వయంగా కొందరు నిర్మాతలు, ఇవన్నీ ఫేక్ అని చెబుతుండేసరికి కొత్త మూవీస్ రిలీజ్ తర్వాత వస్తున్న పోస్టర్స్ చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా నిర్మాతలు.. ఈ ఫేక్ వసూళ్లు, రివ్యూలని పక్కనబెట్టి కంటెంట్‌పై దృష్టి పెడితే బెటర్. లేదంటే మాత్రం తెలుగు ప్రేక్షకుడు 'మీకు' దూరమైపోతాడు.
(ఇదీ చదవండి: ఓటీటీకి తెలుగు థ్రిల్లర్ సినిమా.. ప్రకటన)


