ఇటలీ నుంచి నేరుగా హైదరాబాద్‌లోని పెళ్లి మండపంలోకి ప్రభాస్ అడుగుపెట్టారని తెలిసింది. కానీ ప్రస్తుతానికి ఇది రియల్ లైఫ్‌లో కాదు... రీల్ లైఫ్‌లో అన్నమాట. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సీక్రెట్ సోల్జర్‌గా కనిపిస్తారని తెలిసింది.
ఇక ఇటీవల వెకేషన్ కోసం ఫారిన్ వెళ్లిన ప్రభాస్ ఇండియాకు వచ్చీ రాగానే ‘ఫౌజీ’ చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. పెళ్లి మండపం సెట్‌లో జరుగుతున్న ఈ సినిమా షూట్‌లో ప్రభాస్‌తో పాటు ఇమాన్వీ పాల్గొంటున్నారు.
ఈ కీలక సన్నివేశాల తర్వాత ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట హను రాఘవపూడి. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది. మరోవైపు ‘స్పిరిట్, కల్కి 2’ సినిమాల చిత్రీకరణలతో కూడా ప్రభాస్ బిజీగా ఉంటున్నారు. ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘సలార్ 2’ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.


